
- నిందితుల వద్ద 14 బైక్లు స్వాధీనం
- మీడియాకు వివరాలు వెల్లడించిన
- నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్
నల్గొండ అర్బన్, వెలుగు : అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నల్గొండ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం తన ఆఫీసులో మీడియా సమావేశంలో ఎస్పీ శరత్ చంద్రపవార్ వివరాలు వెల్లడించారు. ఏపీలోని గుంటూరు జిల్లా చిలుకలూరిపేట మండలం కావూరుకు చెందిన నలమాల యర్రబ్బాయి అలియాస్ లూథర్, గుంజి అంకమరావు, పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన మట్టిపల్లి శ్రీకాంత్ కూలీ పని చేస్తుండేవారు. శ్రీకాంత్ దామరచర్ల మండలం జానపహాడ్ లో ఉంటున్నాడు. ముగ్గురూ కలిసి బైక్ చోరీలకు ప్లాన్ చేశారు.
లూథర్ మూడేండ్లుగా దామరచర్ల, నల్గొండ, నార్కట్ పల్లి, ఇబ్రహీంపట్నం, ఏపీలోని మార్టూరు, పొన్నూరు టౌన్లలోని ప్రభుత్వ ఆఫీసులు, హోటళ్లు, వైన్స్ లు, ఇంటి ముందు పార్కింగ్ చేసిన ఖరీదైన రాయల్ ఎన్ ఫీల్డ్, పల్సర్ బైక్ లను టార్గెట్ చేసి దొంగిలించేవాడు. వాటిని అతనితో పాటు అంకమరావు, శ్రీకాంత్ కలిసి వివిధ ప్రాంతాల్లో తక్కువ ధరకు అమ్మేవారు. వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవారు. బుధవారం తెల్లవారుజామున వాడపల్లి ఎస్ఐ తన సిబ్బందితో కలిసి తెలంగాణ ఆంధ్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేపట్టారు.
నిందితులు లూథర్, అంకమరావు అనుమానాస్పదంగా వెళ్తుండగా అదుపులోకి తీసుకొని విచారించగా చోరీలు చేసినట్టు ఒప్పుకున్నారు. 36 బైక్ లను చోరీ చేయగా, 14 రికవరీ చేశారు. మరో 22 బైక్ లను పట్టుకోవాల్సి ఉంది. సీజ్ చేసిన బైక్ ల విలువ రూ.26.50 లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. నిందితులపై రెండు రాష్ట్రాల్లోని పలు పీఎస్ ల్లో కేసులు నమోదై ఉన్నాయి. మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు పర్యవేక్షణలో రూరల్ సీఐ పీఎన్డీ ప్రసాద్, సీసీఎస్ సీఐ డానియల్ కుమార్, వాడపల్లి ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.