ఊపిరి తీసిన ఈత సరదా.. - మున్నేరు వాగులో ముగ్గురు మృతి

ఊపిరి తీసిన ఈత సరదా.. - మున్నేరు వాగులో ముగ్గురు మృతి

ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  నందిగామ కీసర మునేరులో ఐదుగురు  యువకులు  సరదాగా ఈతకొట్టేందుకు వెళ్లారు.  అయితే లోతు సరిగా అంచనావేయలేకపోవడంతో కొట్టుకుపోయారు.  సమీపంలోని వారు చూసి కేకలు వేయగా స్థానికులు రక్షించేందుకు ప్రయత్నించారు.   గల్లంతయిన వారిలో ముగ్గురు మృతి చెందారు. చేజర్ల దినేష్, ఎడవల్లి గణేష్, గాలి సంతోష్ కుమార్ లు ముగ్గురు యువకులు మృతి చెందారని పోలీసులు తెలిపారు.ఉద్యోగాలు, చదువుల కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారంతా... దీపావళి పండుగ కావడంతో సొంత గ్రామానికి వచ్చారు. గ్రామంలోని తమ మిత్రులను కలిశారు.

 అనంతరం మున్నేరు వాగులో ఈతకు దిగారు. కాసేపటికే వారంతా నీటిలో మునిగిపోతుండడాన్ని చూసిన చుట్టుపక్కల వారు.. ఆ యువకులను కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే, అప్పటికే ఇద్దరు  నీటిలో మునిగిపోవడంతో వారు చేరుకోలేకపోయారు. నీటిలో మునిగిపోతున్న మరో ముగ్గురిని ఒడ్డుకు తీసుకొచ్చారు. వెంటనే నందిగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. ఘటనా స్థలంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతులు చేజర్ల దినేష్, ఎడవల్లి గణేష్, గాలి సంతోష్ కుమార్​గా గుర్తించారు.  వారి మృతితో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. దండ రవికుమార్‌, ఎడవల్లి సిద్ధులకు మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువకులు నీట మునిగి ప్రాంతంలో ఇసుక కోసం తీసిన గుంటల్లో ఎక్కువ లోతులో ఉండడంతో- వారు అక్కడి ఊబిల్లో కూరుకుపోయినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ముగ్గురి మృతితో ఐతవరం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.