నా సినిమాల్లో ఇది బెస్ట్ క్లైమాక్స్.. నందిని రెడ్డి చెప్పిన విశేషాలు

నా సినిమాల్లో ఇది బెస్ట్ క్లైమాక్స్.. నందిని రెడ్డి చెప్పిన విశేషాలు

అలా మొదలైంది, కళ్యాణ వైభోగమే, ఓ బేబి లాంటి చిత్రాలతో మెప్పించిన నందిని రెడ్డి... ‘అన్నీ మంచి శకునములే’ అనే ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌ను తెరకెక్కించారు. సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటించారు. ఈరోజు సినిమా విడుదలవుతున్న సందర్భంగా నందిని రెడ్డి చెప్పిన విశేషాలు... 

‘విక్టోరియా పురం అనే ఊరి కథ ఇది. ఆ ఊరికి, సినిమాలోని పాత్రలకు సంబంధం ఏమిటి.. ఇందులో లవ్‌‌ స్టోరీకి ఉన్న ఇంపార్టెన్స్ ఏమిటనేది మెయిన్ కాన్సెప్ట్‌‌. ఇలాంటి కథలో చాలా పాత్రలు ఉండడం వారికి తగిన న్యాయం చేయడం అనేదే గొప్ప ఛాలెంజ్‌‌. అన్ని పాత్రలకూ ప్రాధాన్యత వున్న కథ ఇది. కాఫీ ఎస్టేట్‌‌, రెండు కుటుంబాలు, నాలుగు జనరేషన్స్‌‌, కోర్టు కేసులు లాంటి ఫ్యామిలీ ఎమోషన్స్‌‌తో ప్రేక్షకులను కట్టిపడేసేలా వుంటుంది. ‘ఓ బేబి’ తరహాలోనే ఇందులోనూ సెకండాఫ్‌‌ కీలకం. ప్రేక్షకుల్ని టచ్‌‌ చేస్తుంది. ఇప్పటివరకు చేసిన సినిమాల్లో బెస్ట్‌‌ క్లైమాక్స్‌‌ ఈ సినిమాకు రాశా. చివరి 20 నిముషాలు ది బెస్ట్‌‌ అని చెప్పగలను. సంతోష్, మాళవిక చాలా బాగా నటించారు. ఎమోషనల్ సీన్స్‌‌ను లక్ష్మీభూపాల అద్భుతంగా రాశారు. కథ డిమాండ్ మేరకే షావుకారు జానకి, రాజేంద్ర ప్రసాద్, నరేష్, గౌతమి, వాసుకి లాంటి సీనియర్స్‌‌ను తీసుకున్నాం. ఔట్‌‌పుట్ వచ్చాక డైరెక్టర్ నాగ్ అశ్విన్‌‌కు చూపిస్తే చిన్నపాటి సలహాలు ఇచ్చాడు.. అవి పాటించాం. ఇక నా తర్వాతి చిత్రానికి ఊహించని కథతో రాబోతున్నా. కొత్తగా ఉంటుంది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించబోతున్నాడు’.