
- స్వస్తివాచనం, పుణ్యాహవచనంతో ఉత్సవాలకు శ్రీకారం
- ఘనంగా తిరువేంకటపతి, పరవాసుదేవ అలంకార సేవలు
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం నుంచి నరసింహస్వామి జయంతి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. 11వ తేదీ వరకు మూడు రోజుల పాటు సాగే ఉత్సవాలకు శుక్రవారం ఉదయం స్వస్తివాచనం, పుణ్యాహవాచనం, విశ్వక్సేనపూజ, రుత్విక్‌వరణం, రక్షాబంధనంతో శ్రీకారం చుట్టారు. ముందుగా ప్రధానాలయాన్ని మంత్రజలంతో సంప్రోక్షణ చేసిన అనంతరం లక్ష కుంకుమార్చన జరిపారు.
అనంతరం స్వామివారికి తిరువేంకటపతి సేవ నిర్వహించారు. ఇందులో భాగంగా పూలు, వజ్రవైఢూర్యాలతో స్వామి వారిని అలంకరించి ఆలయ వీధుల్లో ఊరేగించారు. సాయంత్రం నిత్య పూజల అనంతరం ముఖ మంటపంలో మృత్సంగ్రహణం, అంకురార్పణ, హవనం పూజలను శాస్త్రబద్ధంగా నిర్వహించారు. అనంతరం పరవాసుదేవ అలంకారంలో స్వామివారిని అలంకరించి, గరుడ వాహనంపై అధిష్ఠింపజేసి తిరువీధుల్లో విహరింపజేశారు. తొలిరోజు జయంతి ఉత్సవాల్లో టెంపుల్ చైర్మన్ నరసింహమూర్తి, ఈవో వెంకటరావు పాల్గొన్నారు. మరో వైపు పాతగుట్టలోనూ స్వామివారి జయంతి ఉత్సవాలను ప్రారంభించారు. జయంతి ఉత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు.
జయంతి ఉత్సవాల సందర్భంగా కొండపైన ఉదయం యాదగిరిగుట్టకు చెందిన జైశ్రీరాం భక్త భజన మండలి, గాయత్రి మహిళా భజన మండలి, పోచంపల్లికి చెందిన పుండరీక భక్త సేవా సమాజం భజనలు, హైదరాబాద్ సత్య మ్యూజిక్ అకాడమీ కళాకారులు నిర్వహించిన భక్తి సంగీత కార్యక్రమాలు అలరించాయి. అదేవిధంగా హైదరాబాద్‌కు చెందిన స్వరాలయ అకాడమీ, తాండవ నృత్య డాన్స్ మ్యూజిక్ అకాడమీ, యాదగిరిగుట్టకు చెందిన గౌరీభట్ల సాత్విక చేసిన కూచిపూడి నృత్యం ఆకట్టుకున్నాయి.
ఉత్సవాల్లో నేడు
నారసింహుడి జయంతి ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం ప్రధానాలయంలో నిత్య మూలమంత్ర హవనాలు, లక్షపుష్పార్చన, కాళీయ మర్దన అలంకార సేవ నిర్వహించనున్నారు. సాయంత్రం నృసింహ మూలమంత్ర హవనాలు, హనుమంత వాహనంపై రామావతార అలంకార సేవను జరపనున్నారు. పాతగుట్టలో విశేషస్నపనం, నిత్యహవనం, నృసింహ మూలమంత్ర హవనం, లక్షపుష్పార్చన జరపనున్నారు.