నరసింహుడి జయంతి ఉత్సవాలు ముగింపు

నరసింహుడి జయంతి ఉత్సవాలు ముగింపు
  • పూర్ణాహుతి, సహస్ర కలశాభిషేకంతో ముగిసిన వేడుకలు
  • నేటి నుంచి ఆర్జిత సేవల పునరుద్ధరణ

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న నారసింహుడి జయంతి ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ప్రధాన ఆలయంతో పాటు, పాతగుట్టలో ఈ నెల 9న ప్రారంభమైన ఉత్సవాలను ఆదివారం నిర్వహించిన పూర్ణాహుతి, సహస్ర కలశాభిషేకం, నృసింహ జయంతి, నారసింహ ఆవిర్భావ ఘట్టంతో పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం నిత్య పూజల అనంతరం అర్చకులు మహాపూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం ప్రధానాలయ ముఖ మంటపంలో సహస్ర కలశాభిషేకం జరిపారు. సాయంత్రం ఆలయంలో జరిపిన నృసింహ జయంతి, స్వామివారి ఆవిర్భావ మహాతంతుతో ఉత్సవాలకు పరిసమాప్తి పలికారు. అనంతరం స్వామివారికి నివేదన, తీర్థప్రసాద గోష్టి నిర్వహించారు.

ఆదివారం జరిగిన సహస్ర కలశాభిషేకంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, కలెక్టర్‌‌‌‌ హనుమంతరావు కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వయంభు నారసింహుడిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో వెంకట్‌‌‌‌రావు స్వామి వారి ప్రసాదం, శేషవస్త్రాలు అందజేశారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.

ఉదయం యాదగిరిగుట్ట మండలం మల్లాపురానికి చెందిన శ్రీరామ భక్త భజన మండలి, యాదగిరిగుట్టకు చెందిన శ్రీయాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి మహిళా భజన మండలి బృందం సభ్యులు భజన కార్యక్రమాలు నిర్వహించగా, సాయంత్రం శ్రీవేంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్‌‌‌‌, శ్రీసత్యసాయి నృత్య అకాడమీ సభ్యులు కూచిపూడి నృత్యం, హైదరాబాద్‌‌‌‌కు చెందిన అనుశ్రీ మ్యూజికల్‌‌‌‌ ఈవెంట్స్‌‌‌‌ బృందం భక్తి సంగీత విభావరి నిర్వహించారు.

నేటి నుంచి ఆర్జిత సేవలు ప్రారంభం

లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ నెల 9 నుంచి తాత్కాలికంగా రద్దు చేయబడిన ఆర్జిత సేవలు సోమవారం నుంచి తిరిగి ప్రారంభంకానున్నాయి. ఆదివారంతో జయంతి ఉత్సవాలు పూర్తి కావడంతో సోమవారం నుంచి నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, సుదర్శన నారసింహ హోమం, నిత్య, శాశ్వత బ్రహ్మోత్సవాలు, ఆర్జిత సేవలను ప్రారంభించనున్నారు.

కిటకిటలాడిన యాదగిరిగుట్ట

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. స్వామి వారి జయంతి ఉత్సవాలు జరుగుతుండడం, సమ్మర్‌‌‌‌ హాలీడేస్‌‌‌‌ కావడంతో హైదరాబాద్‌‌‌‌తో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. కొండపైన పార్కింగ్‌‌‌‌ ప్లేస్‌‌‌‌ పూర్తిగా నిండిపోవడంతో కొండపైకి వాహనాలను నిలిపివేశారు. రద్దీ కారణంగా స్వామి వారి ధర్మదర్శనానికి నాలుగు, ప్రత్యేక దర్శనానికి గంటన్నర టైం పట్టిందని భక్తులు తెలిపారు.

ఆదివారం భక్తులు జరిపించిన పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆలయానికి రూ.63,64,480 ఆదాయం వచ్చింది. ఇందులో ప్రసాద విక్రయం ద్వారా రూ.22,43,690, వీఐపీ దర్శనాలతో రూ.13.05 లక్షలు, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.6,08,500, బ్రేక్‌‌‌‌ దర్శనాలతో రూ.5,97,300, వ్రతాల నిర్వహణతో రూ.2,02,400, యాదరుషి నిలయం ద్వారా రూ.2,75,082, కల్యాణకట్ట ద్వారా రూ.1.70 లక్షల ఆదాయం వచ్చినట్లు అదికారులు తెలిపారు.