
- ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యంకాని పనిచేసి చూపారు
- మేక్ ఇన్ ఇండియాను మూన్ వరకు తీసుకెళ్లారు
- చంద్రయాన్ విజయంలో నారీ శక్తిదే పెద్ద పాత్ర
- ఇస్రో సైంటిస్టులను కొనియాడిన ప్రధాని
- విక్రమ్ ల్యాండింగ్ సైట్‌కు ‘శివ శక్తి పాయింట్’గా పేరు
- చంద్రయాన్ 2 క్రాష్ అయిన చోటుకు ‘తిరంగా పాయింట్’ పేరు ప్రకటన
- ఆగస్ట్ 23ను ‘నేషనల్ స్పేస్ డే’గా జరుపుకోవాలని పిలుపు
బెంగళూరు/న్యూఢిల్లీ: భారత్‌ను చంద్రుడిపైకి తీసుకెళ్లిన ఘనత ఇస్రో సైంటిస్టులదేనని, ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యంకాని పనిని వారు చేసి చూపారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. గ్రీస్ రాజధాని ఏథెన్స్ నుంచి శనివారం ఉదయం నేరుగా బెంగళూరు చేరుకున్న ప్రధాని.. ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్ వర్క్ (ఇస్ట్రాక్)లో సైంటిస్టులను కలిసి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘మీరు దేశాన్ని చంద్రుడిపైకి తీసుకెళ్లారు. ఇది సాధారణ విషయం కాదు. ఈ అనంత అంతరిక్షంలో భారతదేశ టెక్నాలజీతో సత్తా చాటి శంఖనాదం చేశారు. ఈ విజయంలో నారీ శక్తి (మహిళా సైంటిస్టులు)దే పెద్ద పాత్ర” అని ప్రశంసించారు. ఈ సందర్భంగా మోదీ భావోద్వేగానికి గురయ్యారు. కొద్ది క్షణాల తర్వాత గద్గద స్వరంతో తిరిగి మాట్లాడారు.
భారత్ ఇప్పుడు చంద్రుడిపై ఉంది. మనకు ఇప్పుడు చంద్రుడిపై ఒక గర్వకారణమైన స్థానం ఉంది. ఇప్పటివరకూ ఎవరూ చేరుకోలేని చోటికి మనం చేరాం. ఎవరూ చేయలేని పనిని చేసి చూపించాం. ఇదీ నేటి భారత్. నిర్భయంగా, పోరాట పటిమతో ముందుకెళ్తున్న భారత్. కొత్తగా ఆలోచించి, కొత్త తరీఖాలో పయనించే భారత్ ఇది. చీకటి ప్రదేశాలకు వెళ్లి (చంద్రుడి దక్షిణ ధ్రువం) ప్రపంచానికి కాంతిని పంచుతున్న కొత్త భారత్ ఇది. ఇదే భారత్ 21వ శతాబ్దంలో ప్రపచంలోని ప్రధాన సవాళ్లను కూడా పరిష్కరిస్తుంది” అని ప్రధాని అన్నారు.
ఫెయిల్యూర్ ముగింపు కాదు
చంద్రయాన్-–2 ల్యాండర్ క్రాష్ ఘటనను గుర్తు చేసుకుంటూ కూడా మోదీ కొంత ఎమోషనల్ అయ్యారు. ‘‘చంద్రుడిపై ల్యాండర్ లను దింపినప్పుడు ఆ ప్రాంతాలకు ఆయా దేశాలు పేర్లు పెట్టుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఇండియా కూడా చంద్రయాన్-3 ల్యాండింగ్ సైట్ కు పేరు పెట్టాలని నిర్ణయించింది. విక్రమ్ ల్యాండర్ దిగిన చోటును ఇకపై ‘శివ శక్తి పాయింట్’గా పిలుద్దాం. ఇందులో శివ అంటే.. మానవాళి సంక్షేమం కోసం తీసుకునే దృఢమైన సంకల్పాలకు సంకేతం. ఆ సంకల్పాలను సాధించడం కోసం మనకు బలాన్ని అందించేదే శక్తి.. ఆ శక్తే మన నారీ శక్తి” అని మోదీ వివరించారు. హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకూ ఉన్న కనెక్షన్ ను సైతం శివ శక్తి పాయింట్ సూచిస్తుందన్నారు.
చంద్రయాన్-2 క్రాష్ కావడంతో అప్పుడు ఆ ప్రాంతానికి పేరు పెట్టాలని అనిపించలేదన్నారు. ఇప్పుడు చంద్రయాన్-3 సక్సెస్ కావడంతో పాటు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం కూడా వచ్చిందన్నారు. చంద్రయాన్-2 ల్యాండర్ రూపంలోనూ జాబిల్లిపైకి ఇండియా జెండా చేరినందున ఇప్పుడు ఆ ప్రాంతానికి కూడా పేరు పెట్టామని, ఇకపై ఆ ప్రాంతాన్ని ‘తిరంగా పాయింట్’గా పిలవాలన్నారు. ‘‘ప్రతి ప్రయత్నం నుంచీ స్ఫూర్తి పొందాలి. దేనికీ వైఫల్యం అనేది ముగింపు కాదన్న విషయాన్ని మనకు చంద్రయాన్-2 ఫెయిల్యూర్ నేర్పించింది. దృఢమైన సంకల్పం ఉంటే విజయం తప్పక వరిస్తుందని తిరంగా పాయింట్ చెప్తుంది”అని పేర్కొన్నారు.
ఆర్యభట్ట ఆనాడే చెప్పారు
మన పూర్వీకులు వేల ఏండ్ల కిందటే అనంత అంతరిక్షాన్ని చూడటం షురూ చేశారని మోదీ అన్నారు. ఆర్యభట్ట, బ్రహ్మగుప్తుడు, వరాహమిహిరుడు, భాస్కరుడి వంటి వాళ్లు ఆనాడే ఖగోళ సూత్రాలను రాశారని తెలిపారు. ‘‘ఆర్యభట్ట భూమి గోళాకారంగా ఉందని రాశారు. భూమి భ్రమణాన్ని కచ్చితమైన లెక్కలతో రాశారు. సూర్యసిద్ధాంతం గ్రంథంలో విశ్వంలో కింద, మీద అనేవి లేవని.. అంతా గోళాకారమేనని పేర్కొన్నారు. సూర్యుడు, చంద్రుడి గురించి ఇలాంటివి ఎన్నో విషయాలు రాసి ఉన్నాయి. ఇతర గ్రహాల కదలికలూ మన ప్రాచీన గ్రంథాల్లో ఉన్నాయి. వీటిపై మన కొత్త తరం అధ్యయనం చేయాలి. సైంటిఫిక్ గా ఆ సూత్రాలను నిరూపించాలి అని ప్రధాని పిలుపునిచ్చారు.
చంద్రయాన్‌పై దేశవ్యాప్తంగా స్టూడెంట్లకు అతిపెద్ద క్విజ్ కాంపిటీషన్ నిర్వహిస్తామని చెప్పారు. విద్యార్థులు దీనితోనే ప్రాచీన సైన్స్‌పై అధ్యయనం ప్రారంభించవచ్చన్నారు. అంతకుముందు బెంగళూరు ఎయిర్ పోర్టు వద్ద ప్రధానికి బీజేపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్ వర్క్ (ఇస్ట్రాక్)కు చేరుకున్న ఆయన.. ఇస్రో చైర్మన్ సోమనాథ్, ఇతర సైంటిస్టులను కలిసి అభినందనలు తెలిపారు. చంద్రయాన్-–3 మిషన్ సాగిన తీరు.. విక్రమ్ ల్యాండింగ్, రోవర్ మూన్ వాక్ వంటి విషయాలను ఈ సందర్భంగా ప్రధాని మోదీకి సోమనాథ్ వివరించారు. మిషన్‌లో
ప్రస్తుత పురోగతిని కూడా తెలియజేశారు.
ఈ విజయం మీదే..
విక్రమ్ ల్యాండింగ్ సమయంలో ఒక్కో క్షణం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూశామని మోదీ అన్నారు. ‘‘ల్యాండర్ చంద్రుడి మీద దిగిన క్షణాలను దేశ ప్రజలు ఎన్నటికీ మరిచిపోలేరు. ప్రతి ఒక్కరికీ ఎంతో సంతోషాన్ని ఇచ్చిన ఈ విజయం మీరు సాధించినదే. ప్రతి ఒక్క భారతీయుడూ ఒక పెద్ద పరీక్షలో పాస్ అయినట్లు ఫీలయ్యారు. దీనంతటికీ మీరే కారణం. మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువే” అని ప్రశంసించారు. చంద్రుడిపై ఒకవైపు విక్రమ్ విశ్వాసాన్ని.. మరోవైపు ప్రజ్ఞాన్ పరాక్రమాన్ని చూశామన్నారు.
ల్యాండర్, రోవర్ రెండూ పంపిన ఫొటోలను చూశానని, అవి అద్భుతంగా ఉన్నాయన్నారు. చంద్రుడిని ప్రపంచానికి చూపే బాధ్యతను ఇప్పుడు భారత్ తీసుకుందన్నారు. ‘‘ఒకప్పుడు ప్రపంచంలో మూడో వరుసలో ఉన్నవాళ్లం.. ఇప్పుడు మొదటి వరుసలోకి వచ్చాం. ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగాం. ఏ రంగంలోనైనా ఫస్ట్ వరుసలోనే ఉన్నాం. ఇందులో ఇస్రో పాత్ర ఎంతో పెద్దది. ఇప్పుడు మీరు మేక్ ఇన్ ఇండియాను చంద్రుడి వరకు తీసుకెళ్లారు” అని కొనియాడారు.
ఆగస్ట్ 23.. నేషనల్ స్పేస్ డే
ఆగస్ట్ 23ను ‘జాతీయ అంతరిక్ష దినోత్సవం’ గా జరుపుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ల స్ఫూర్తిని చాటడంతోపాటు దేశ ప్రజలను ఇన్ స్పైర్ చేసే లక్ష్యంతో ఈ సెలబ్రేషన్స్ చేసుకోవాలన్నారు. టెక్నాలజీ, స్పేస్ సైన్స్ ను ప్రజల జీవితాలు మెరుగుపర్చేందుకు ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వ శాఖలను ఆదేశించానని చెప్పారు. ‘పరిపాలనలో స్పేస్ టెక్నాలజీ వాడకం’పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి నేషనల్ హ్యాకథాన్ లు నిర్వహించాలని ఇస్రో సైంటిస్టులను ఆయన కోరారు. దీనితో పాలన మరింత సమర్థంగా మారుతుందని, ప్రజలకు ఆధునిక పరిష్కారాలు లభిస్తాయన్నారు.
బెంగళూరు నుంచి ఢిల్లీ చేరుకున్న మోదీకి అక్కడి ఎయిర్ పోర్టు వద్ద బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ ఎంపీలు, కార్యకర్తలు, ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. చంద్రయాన్–3 విజయంతో దేశమంతటా ఒక ఉత్సాహం వచ్చిందన్నారు. ఇదే ఉత్సాహంతో యువత సైన్స్ రంగం వైపు మళ్లేలా చూడాలని, తద్వారా ఇండియాను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని పిలుపునిచ్చారు.విక్రమ్ ల్యాండింగ్ సమయంలో దక్షిణాఫ్రికాలో ఉన్నా. ఆ తర్వాత గ్రీస్ వెళ్లాల్సి వచ్చింది. కానీ.. నా మనసంతా మీతోనే ఉంది. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కలుద్దామా? అన్న ధ్యాసలోనే ఉన్నా. మీ అందరికీ ఎప్పుడెప్పుడు సెల్యూట్ చేద్దామా? అన్న ఆత్రుతతో నేరుగా ఇక్కడికే వచ్చా. మీ నిరంతర కృషికి, ధైర్యానికి, డెడికేషన్‌కు, ఎమోషన్‌కు నా సెల్యూట్.
ప్రధాని నరేంద్ర మోదీ