సూర్యుడిపై నిఘా కోసం..సోలార్ పడవ

సూర్యుడిపై నిఘా కోసం..సోలార్ పడవ

‘కాదేదీ సైన్సు కు అనర్హం’ అన్నట్టుగా.. మన భూమిపై ఉన్న ప్రతి అంశం నుంచి స్ఫూర్తిని పొందుతూ నాసా కొంగొత్త ఆవిష్కరణలు చేస్తోంది. తెర చాప పడవల తరహాలో ఓ సోలార్ పడవను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈవిషయాన్ని నాసా తమ వెబ్ సైట్ వేదికగా ప్రకటించింది. తెరచాప పడవలు గాలి వీచే బలాన్ని వినియోగించుకొని ముందుకు కదులుతాయి. సరిగ్గా ఇదే తరహా సూత్రంతో సోలార్ పడవ కూడా పనిచేస్తుంది. దీన్ని ఈ ఏడాది చివరికల్లా సూర్యుడి ధ్రువ ప్రాంతంలో కక్ష్యలోకి ప్రవేశపెడతామని నాసా చెబుతోంది. సాధారణ వ్యోమ నౌకలు సూర్యుడి చుట్టూ కక్ష్యలో తిరిగే క్రమంలో ఎదుర్కొనే అవరోధాలన్నీ అధిగమించేలా దీన్ని తీర్చిదిద్దుతున్నట్లు తెలిపింది.

ఇలా పనిచేస్తుంది..

సూర్యుడి కిరణాల ప్రవాహంతో ఏర్పడే తీవ్రమైన ఒత్తిడిని గ్రహించి.. దాని ఆధారంగా నిర్ణీత కక్ష్యలో తిరగడమే  సోలార్ పడవ పని. సాధారణ వ్యోమ నౌకలు తమతో పాటు తీసుకెళ్లే ఇంధనాన్ని, బ్యాటరీలను వాడుకుంటూ కక్ష్యలో తిరుగుతాయి. కానీ సోలార్ పడవకు వాటితో పనిలేదు. ఎందుకంటే ఇంధన భాండాగారమైన సూర్యుడి కిరణాలే  దానికి ఇంధన వనరు.సూర్యుడి ధ్రువ ప్రాంతాలలో జరిగే మార్పుల గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించే ప్రధాన లక్ష్యంతో సోలార్ పడవను నాసా అభివృద్ధి చేస్తోంది. కాగా, సోలార్ పడవ ఒక పెద్ద అపార్ట్మెంట్ అంత ఎత్తులో ఉంటుంది. బాస్కెట్ బాల్ కోర్టు అంత పెద్ద సైజులో (దాదాపు 500 చదరపు మీటర్లు) నిర్మించనున్నారు. సోలార్ పడవ అభివృద్ధి, ప్రయోగానికి సంబంధించిన ప్రాజెక్టు కోసం రూ.15 కోట్లను నాసా వెచ్చిస్తోంది. 

మరిన్ని వార్తలు.. 

కాగితపు విమానాలు గాల్లో విసిరి రికార్డ్

దేవుడి భూములనూ వదుల్తలే