మార్స్ పై హెలికాప్టర్ ఎగిరింది

మార్స్ పై హెలికాప్టర్ ఎగిరింది

నాసా ‘ఇన్ జెన్యూటీ’ చాపర్ టెస్ట్ ఫ్లైట్ విజయవంతం  
39 సెకన్ల పాటు ఎగిరి, ల్యాండ్ అయిన హెలికాప్టర్

కేప్ కెనవెరాల్ (యునైటెడ్ స్టేట్స్): అంగారకుడిపై నాసా హెలికాప్టర్ విజయవంతంగా ఎగిరింది. సోమవారం మార్స్ పై గాలిలో 10 ఫీట్ల (3 మీటర్లు) ఎత్తుకు చేరిన హెలికాప్టర్ 39 సెకన్ల పాటు ఎగిరి, సేఫ్ గా ల్యాండ్ అయింది. మనిషి పంపిన ఓ వెహికల్ ఇతర గ్రహంపై ఎయిర్ ట్రావెల్ చేయడం ఇదే ఫస్ట్ టైం కావడం విశేషం. నాసా పంపిన పర్సివరెన్స్ రోవర్ తో పాటు ఇన్ జెన్యూటీ అనే చిన్న హెలికాప్టర్ ఫిబ్రవరిలో మార్స్ మీదకు చేరాయి. మొదట రోవర్ ను యాక్టివేట్ చేసి, కొద్ది దూరం టెస్ట్ డ్రైవ్ చేసిన నాసా సైంటిస్టులు తాజాగా ఇన్ జెన్యూటీకి టెస్ట్ ఫ్లైట్ నిర్వహించారు. హెలికాప్టర్ ను రోవర్ ఈ నెల 3న మార్స్  నేలపైకి దింపింది. రోవర్ కు 65 మీటర్ల దూరంలో ఉన్న హెలికాప్టర్ కు టెస్ట్ ఫ్లైట్ ను ఈ నెల 11న నిర్వహించాల్సి ఉండగా, సాఫ్ట్ వేర్ సమస్య కారణంగా వాయిదా పడింది. సాఫ్ట్ వేర్ ఎర్రర్ ను సరిచేసి, అప్ లోడ్ చేసిన తర్వాత సోమవారం టెస్ట్ ఫ్లైట్ నిర్వహించారు. దీంతో ఇతర గ్రహంపై తొలిసారిగా భూమి నుంచి కంట్రోల్ చేస్తూ హెలికాప్టర్ ను ఎగిరేలా చేయడం ద్వారా నాసా సైంటిస్టులు హిస్టరీ క్రియేట్ చేశారు. 
మార్స్ పై ఎగరడం ఈజీ కాదు.. 
ఒకటిన్నర కిలోల బరువు ఉన్న ఇన్ జెన్యూటీకి రెండు రోటార్ బ్లేడ్ లు ఉన్నాయి. మార్స్ పై వాతావరణం చాలా పలుచగా ఉండటం వల్ల అక్కడ హెలికాప్టర్ ఎగరాలంటే భూమిపై కంటే ఐదు రెట్లు వేగంగా (నిమిషానికి 2,500 సార్లు) బ్లేడ్స్ తిరగాల్సి ఉంటుంది. అదే టైంలో మార్స్ పై వీచే గాలులు, చల్లటి వాతావరణాన్ని తట్టుకుని చాపర్ నిలకడగా ఉండాల్సి ఉంటుంది. అందుకే చిన్న హెలికాప్టర్ అయినా, కొన్ని సెకన్లే అయినా.. అక్కడ టెస్ట్ ఫ్లైట్ సరిగ్గా జరగడం పెద్ద విజయంగా భావిస్తున్నారు.