తెలియకపోతే ఆప్షన్స్ ట్రేడింగ్ వద్దు

తెలియకపోతే ఆప్షన్స్ ట్రేడింగ్  వద్దు
  •     మ్యూచువల్ ఫండ్స్‌‌  ద్వారా షేర్లలో ఇన్వెస్ట్ చేసుకోండి
  •     రిటైల్ ఇన్వెస్టర్లకు ఎన్‌‌ఎస్‌‌ఈ చీఫ్ ఆశిష్ చౌహాన్ సలహా

న్యూఢిల్లీ : ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌‌ ( ఎఫ్ అండ్ ఓ) లో  ట్రేడింగ్‌‌ చేస్తున్న రిటైల్ ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌‌ఎస్‌‌ఈ) చీఫ్  ఆశిష్ చౌహాన్ హెచ్చరించారు. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా షేర్లలో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అని సలహా ఇచ్చారు. మార్కెట్  నాలెడ్జ్  ఉన్న ఇన్వెస్టర్లు, రిస్క్‌‌ను కంట్రోల్ చేసుకోగలిగే వారు మాత్రమే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌‌లో ట్రేడ్ చేయాలని అన్నారు. 

తాజాగా ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్‌‌, ఎకనామిక్ అడ్వైజర్ వీ అనంత నాగేశ్వరన్ కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు.  ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్‌‌లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయొద్దని కిందటేడాది నవంబర్‌‌‌‌లో సెబీ చైర్మన్ మాధవి పూరి బుచ్ కూడా రిటైల్ ఇన్వెస్టర్లను హెచ్చరించారు. అయినప్పటికీ  ఎఫ్‌‌ అండ్ ఓ ట్రేడింగ్ రోజు రోజుకీ  పెరుగుతూనే ఉంది. తక్కువ టైమ్‌‌లో భారీ లాభాలు పొందే వీలుండడంతో రిటైల్ ఇన్వెస్టర్లు ఎగబడుతున్నారు.  

ఈ ఏడాది మార్చిలో ఎఫ్‌‌ అండ్ ఓ సెగ్మెంట్‌‌లో మంత్లీ టర్నోవర్ రూ.8,740 లక్షల కోట్లకు పెరిగింది. కిందటేడాది మార్చిలో ఈ నెంబర్ కేవలం రూ.217 లక్షల కోట్లు మాత్రమే. ఈక్విటీ సెగ్మెంట్‌‌లో డైలీ టర్నోవర్ రూ.లక్ష కోట్లకు పెరిగితే, ఎఫ్ అండ్ ఓ సెగ్మెంట్‌‌లో డైలీ టర్నోవర్ రూ.330 లక్షల కోట్లకు చేరుకుంది.   కాగా, ఎఫ్‌‌ అండ్ ఓ ట్రేడింగ్‌‌ చేస్తున్న వారిలో 89 శాతం మంది ట్రేడర్లకు నష్టాలే వస్తున్నాయని గతంలో సెబీ ఓ రిపోర్ట్‌‌లో పేర్కొంది. 2021–22 లో ట్రేడర్లకు సగటున రూ.1.1 లక్షల నష్టం వచ్చిందని వెల్లడించింది.