కరోనా, ధరల పెరుగుదలపై 8 పార్టీలతో పవార్​ భేటీ

కరోనా, ధరల పెరుగుదలపై 8 పార్టీలతో పవార్​ భేటీ
  • రెండు గంటలకు పైగా మీటింగ్​
  • ఇది పూర్తిగా రాజకీయేతర  సమావేశమన్న ఎన్సీపీ
  • పవార్‌ను కలిసిన కమల్ నాథ్

సీనియర్ కాంగ్రెస్ లీడర్, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ మంగళవారం సాయంత్రం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ను కలిశారు. ఇద్దరు నేతల మధ్య అరగంటపాటు  భేటీ జరిగింది. కమల్ నాథ్ మర్యాదపూర్వకంగానే కలిశారని శరద్ పవార్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

న్యూఢిల్లీ:నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ నిర్వహించిన మీటింగ్ కు 8 ప్రతిపక్ష పార్టీల సభ్యులు హాజరయ్యారు. మంగళవారం ఢిల్లీలోని పవార్ ఇంటిలో రెండు గంటలకుపైగా మీటింగ్ జరిగింది. దేశంలో కరోనా పరిస్థితులు, ధరల పెరుగుదల ఇతర సమస్యలపై చర్చించినట్టు మీటింగ్ లో పాల్గొన్న నేతలు చెప్పారు. సమావేశంలో నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ఘన్ శ్యామ్ తివారీ, రాష్ట్రీయ లోక్ దళ్ ప్రెసిడెంట్ జయంత్ చౌధరి, ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ సుశీల్ గుప్తా, సీపీఐ, సీపీఎం నేతలు బినోయ్ విశ్వమ్, నీలోత్పల్ బసు, తృణమూల్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ యశ్వంత్ సిన్హా, కాంగ్రెస్ మాజీ నేత సంజయ్ ఝా, జేడీయూ లీడర్ పవన్ వర్మ  పాల్గొన్నారు. జావెద్ అఖ్తర్, దౌత్యవేత్త కేసీసింగ్, రిటైర్డ్ జడ్జి ఏపీ షా లాంటి ప్రముఖులు మీటింగ్ కు అటెండ్ అయ్యారు. బీజేపీకి వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కోసమే శరద్ పవార్ ఈ మీటింగ్ నిర్వహించినట్టు ఊహాగానాలు వినిపించాయి. అయితే మీటింగ్ తర్వాత ఎన్సీపీ లీడర్, రాష్ట్రీయ మంచ్ వ్యవస్థాపకుల్లో ఒకరైన మజీద్ మెనన్ మాట్లాడుతూ.. ‘ఇది రాజకీయాల కోసం పెట్టింది కాదు. బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేక ఫ్రంట్ కోసం పెట్టిన మీటింగ్ కూడా కాదు. రాష్ట్రీయ మంచ్ నిర్వహించిన రాజకీయేతర మీటింగ్. దీన్ని కావాలనే హైప్ చేశారు. ఒకే ఐడియాలజీ కలవాళ్లు మీటింగ్ కు వచ్చారు. రాజకీయేతర వ్యక్తులు కూడా ఇందులో పాల్గొన్నారు’ అని ఆయన అన్నారు. కాంగ్రెస్సేతర ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నం జరుగుతోందన్న వార్తలను ఖండించారు. కాంగ్రెస్ ఎంపీలు కపిల్ సిబల్, వివేక్ తన్ఖా, మనీశ్ తివారీ, అభిషేక్ మను సింఘ్వీలను కూడా ఆహ్వానించామని, అయితే వాళ్లు మీటింగ్ కు రాలేదని చెప్పారు.
ప్రజా సమస్యలపై చర్చించాం: ఎస్పీ నేత ఘన్ శ్యామ్
శరద్ పవార్‌తో మీటింగ్‌లో ప్రజా సమస్యలపై చర్చించినట్టు సమాజ్ వాదీ పార్టీ నేత ఘన్ శ్యామ్ తివారీ అన్నారు. ఇది పొలిటికల్ మీటింగ్ కాదని, ఒకే మనస్తత్వం కలవారు ఒక చోట చేరి మాట్లాడుకునేందుకు సమావేశం నిర్వహించారని సీపీఎం లీడర్ నీలోత్పల్ బసు అన్నారు. కరోనా మేనేజ్ మెంట్, రాజ్యాంగ సంస్థలపై దాడులు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ఇతర అంశాలపై చర్చించినట్టు తెలిపారు.