
- సుప్రీం తీర్పుపై దళిత సంఘాల ఆందోళన
- మద్దతుగా నిలిచిన ప్రతిపక్ష నేతలు
- బిహార్‌లో ఆందోళనకారులపై పోలీసుల లాఠీచార్జ్
న్యూఢిల్లీ: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు, దళిత సంఘాలు బుధవారం దేశవ్యాప్తంగా భారత్ బంద్ నిర్వహించాయి. పలు రాష్ట్రాల్లో ఆందోళనకారులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రోడ్లను దిగ్బంధించి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించారు. రైల్ రోకో చేపట్టడంతో కొన్నిచోట్ల రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంక్ లు, వ్యాపార కార్యకలాపాలు మాత్రం యథావిధిగా కొనసాగాయి. ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు ఎక్కువగా జరిగాయి.
ఎస్సీ వర్గీకరణకు మద్దతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. భారత్ బంద్ నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ నిరసనల్లో రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితితో సహా -12 దళిత, ఆదివాసీ సంఘాలు పాల్గొన్నాయి. బిహార్‌లోని పాట్నాలో రాష్ట్రీయ జనతాదళ్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. నిరసనను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. ఆందోళనకారులపై పోలీసులు దాడి చేయడాన్ని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఖండించారు.
ట్రాక్‌లపై నిరసన
బిహార్‌లో రైల్వే ట్రాక్‌లపై దళిత సంఘాల నేతలు ఆందోళనలు చేపట్టారు. పాట్నాలో దర్భంగా – ఢిల్లీ సంపర్క్ క్రాంతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను అడ్డుకున్నారు. భీమ్ ఆర్మీ సభ్యులు పోస్టర్లు, బ్యానర్లు పట్టుకుని రైలు ఎక్కి ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించే కుట్ర జరుగుతున్నదని నినాదాలు చేశారు. రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. జెహనాబాద్‌లోనూ ఆందోళనకారులు జాతీయ రహదారి 83పై బైఠాయించారు. యూపీలోని లక్నోలో బీఎస్పీ కార్యకర్తలు నిరసన తెలియజేశారు. నోయిడాలో బంద్ ప్రభావం అంతగా కనిపించలేదు. ప్రయాగ్‌రాజ్, ఆగ్రా, కాన్పూర్‌లో పాక్షిక బంద్ కొనసాగింది. జార్ఖండ్‌లో ఆందోళనకారులు టైర్లను తగులబెట్టి తమ ఆగ్రహాన్ని తెలియజేశారు.
రాజస్థాన్‌లో విద్యా సంస్థలు బంద్
రాజస్థాన్‌లో బంద్ ప్రభావం కనిపించింది. పలు జిల్లాల్లో విద్యా సంస్థలు బంద్ పాటించాయి. కోటాలో పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇక మధ్యప్రదేశ్ లో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి బంద్ ను విఫలం చేశారు. గ్వాలియర్ జిల్లాలో బీఎస్పీ, భీమ్ సేన కార్యకర్తలను అడ్డుకునేందుకు 150కి పైగా బారికేడ్లు ఉంచారు. భారీగా పోలీసులను మోహరించారు.
నిరసనకారులకు కేంద్రమంత్రి మద్దతు
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా జరిగిన భారత్ బంద్ కు లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్) నేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ నైతిక మద్దతు తెలిపారు. 'ఎస్సీ,- ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు చేస్తున్న భారత్ బంద్‌కు నేను, మా పార్టీ నైతికంగా మద్దతిస్తున్నాం. దోపిడీకి గురవుతున్న అణగారిన వర్గాల గొంతుకగా మారడం మా కర్తవ్యం' అని ఆయన ట్వీట్ చేశారు.