నవీపేట్, వెలుగు : నగల కోసం మేనకోడలిని చంపిన మామను అరెస్ట్ చేసి రిమాండ్ పంపినట్లు ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. బుధవారం ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మల్కాపూర్ గ్రామానికి చెందిన ఆకుల అనంత అలియాస్ సోని తల్లితో కలిసి జీవిస్తోందని తెలిపారు. తల్లి లేని సమయంలో మోస్రా గ్రామానికి చెందిన మేనమామ సాగర్ సోమవారం సాయంత్రం ఇంటికి వచ్చి సోని మీద ఉన్న బంగారం చోరీ చేయాలని యత్నించాడన్నారు. ఆమె ప్రతిఘటించడంతో గొంతు నులిమి హత్య చేసి బంగారు నగలు తీసుకుని పారిపోయాడని వివరించారు.
మంగళవారం మృతురాలు తల్లి ఒడ్డెమ్మ ఫిర్యాదు చేయడంతో ఆధ్వర్యంలో దర్యాప్తు ముమ్మరం చేశామన్నారు. బోధన్ రోడ్డులోని ముత్తూట్ ఫైనాన్స్‌లో కమ్మలు కుదువపెట్టాడని, మిగిలిన పుస్తెలతాడు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈమేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని బుధవారం రిమాండ్‌కు పంపినట్లు పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై తిరుపతి, యాదగిరి గౌడ్ క్రైమ్ టీమ్‌ను ఏసీపీ అభినందించారు.
