
- హంస వాహనంపై విహరించిన ఆది దంపతులు
అలంపూర్, వెలుగు: దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లోభాగంగా 9 రోజులపాటు జోగులాంబ అమ్మవారు విశేష పూజలు అందుకున్నారు. గురువారం తో నవరాత్రి బ్రహ్మోత్సవా లు ముగిశాయి. విజయదశమి సందర్భంగా ఆలయ ఆవరణలోని శమీ వృక్షం వద్ద ఆయుధ పూజ నిర్వహించారు. అనంతరం ఈవో దీప్తి, ఖడ్గంతో శమీ పత్రాన్ని కోసి స్వామికి సమ ర్పించారు. సాయంత్రం యోగా నరసింహస్వామి రథోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యే విజయుడు, డీఎస్పీ మొగులయ్య స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.
తుంగభద్ర నదిలో తెప్పోత్సవం..
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి తెప్పోత్సవం నిర్వహించారు. జోగులాంబ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పుష్కర ఘాట్‌కు తరలించారు. అక్కడ పూజలు చేసిన అనంతరం హంస వాహనంపై కొలువుదీర్చి నదీ విహారాన్ని కొనసాగించారు. తుంగభద్ర నదికి అర్చకులు నక్షత్ర హారతి, కుంభహారతి, కర్పూర హారతితో కలిపి 5 రకాల హారతులిచ్చారు.
హంస వాహనంపై జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి విహరించగా, తెప్పోత్సవానికి తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామి, అమ్మవార్ల నదీ విహారం కనులపండువగా సాగింది. రాత్రి ధ్వజావరోహణంతో నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డీఎస్పీ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు, భక్తులకు ఆలయ ఈవో దీప్తి కృతజ్ఞతలు
తెలిపారు.
గద్వాల: దసరా సందర్భంగా నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ అమ్మవారి ఆలయం వద్ద తెప్పోత్సవాన్ని నిర్వహించారు. అమ్మవారికి నిర్వహించిన పల్లకీ సేవలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. పుష్కర ఘాట్ వద్ద అమ్మవారి తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.