నవరాత్రుల ఉపవాసం ఆరోగ్యంగా

నవరాత్రుల ఉపవాసం ఆరోగ్యంగా

శరన్నవరాత్రులు మొదలయ్యాయి. దేశమంతటా దుర్గాదేవి ఘనంగా పూజలు అందుకుంటోంది. ఆ తల్లి చల్లని చూపు తమపై  ఉండాలని  దేవీ నవరాత్రుల్లో ఉపవాసాలు కూడా చేస్తున్నారు చాలామంది. అయితే మామూలు రోజుల్లో తినడం అరగంట ఆలస్యం అయితేనే కళ్లు తిరిగిన ఫీలింగ్ వస్తుంది. అలాంటిది దేవీ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు  ఉపవాసాలు చేయడమంటే  మాటలు కాదు. అయితే  హెల్దీ డైట్​ ఫాలో అయితే ఉపవాసాలు చేసినా  ఆరోగ్యానికేం ఢోకా ఉండదు.  ఈ నవరాత్రుల్లో ఉపవాసాలు చేసేవాళ్లు ఏం తినాలి? ఏం తినొద్దు? 
దేవీ నవరాత్రుల్లో కొందరు మంచినీళ్లు తప్ప ఏం ముట్టరు. మరికొందరేమో ఒక్క పొద్దు ఉపవాసాలు ఉంటారు. ఇంకొందరేమో రోజులో ఒక్క పూట మాత్రమే తింటారు. ఇలా పద్ధతి ఏదైనా సరే.. హెల్దీగా ఉండాలంటే ఉపవాసం ఉండేవాళ్లు వీటిని డైట్​లో చేర్చాలి. 
ఏం తినాలంటే... 
నవరాత్రుల్లో ఉపవాసం చేసేవాళ్లు డ్రైఫ్రూట్స్​  తినాలి. వీటిలో ఉండే  ఫైబర్, ఒమెగా–6, ఒమెగా–3 పాలీ శాచ్యురేటెడ్​​ ఫ్యాట్స్​ , మెగ్నీషియం, విటమిన్స్,​ మినరల్స్​ రోజంతా ఎనర్జిటిక్​​గా ఉంచుతాయి. అలాగే తాజా ఫ్రూట్స్​ తినడం వల్ల అలసట అనిపించదు. ఫాస్టింగ్​లో ఉన్నప్పుడు ఆరెంజ్​, యాపిల్​, దానిమ్మ లాంటి ఫ్రూట్స్​ తినడం వల్ల డైజెషన్​​ హెల్త్​ మెరుగుపడుతుంది.   ఆల్కలైన్​ ఎక్కువగా ఉండే వెజిటబుల్స్, ఆకుకూరలు, పాలకూర ​ సలాడ్​తో పాటు అవకాడో,  కీరదోస, ఆప్రికాట్స్​​, బీట్​రూట్​ తినడం వల్ల  ఉపవాసాల్లోనూ హెల్దీగా ఉండొచ్చు.  ఉపవాసం ​ ఉండేవాళ్లు  డీ హైడ్రేట్​ కాకుండా  వీలైనన్ని ఎక్కువ నీళ్లు తాగాలి. గోరు వెచ్చని నీళ్లు తాగితే మరీ మంచిది. పాలు, మజ్జిగ లేదా ఫ్రూట్​ జ్యూస్​లు తాగడం వల్ల కూడా రోజంతా  హైడ్రేటెడ్​గా  ఉండొచ్చు.  మామూలు ఉప్పుకి బదులు ఈ తొమ్మిది రోజులు కళ్లు ఉప్పు తినాలి. అలాగే వంటల్లో జీలకర్ర, దాల్చిన చెక్క, పచ్చి యాలకులు, నల్ల మిరియాల పొడి, ఎర్ర మిరియాలు  కొంచెం కొంచెం వేసుకుని తినాలి. ఫైబర్​ ఎక్కువగా ఉండే ఫుడ్​ తింటే త్వరగా ఆకలి అనిపించదు. అందుకే ఈ తొమ్మిది రోజులు ఫైబర్​తో నిండిన మొరం గడ్డలు,  అరటి, సొర కాయ, బ్రొకోలి,  గుమ్మడి కాయలు తినడం బెటర్​. నూనె పదార్థాలకి దూరంగా ఉండాలి.   నవరాత్రుల్లో చక్కెరకి బదులు తేనె, బెల్లం వాడటం మంచిది.   ఫాస్ట్​ ఫుడ్​కి ఈ తొమ్మిది రోజులు ఫుల్​స్టాప్​ పెట్టాల్సిందే.  ఆకలి వల్ల కోపం​ పెరిగే అవకాశాలు ఉన్నాయి.. వాటిని కంట్రోల్​ చేయడానికి  రోజులో కాసేపయినా మెడిటేషన్​ చేయాలి. దీనివల్ల బుర్ర ఆకలి ఆలోచన నుంచి  పక్కకు వస్తుంది. అలాగే ఉపవాసాల్లో ఎనర్జిటిక్​​గా ఉండాలంటే కంటినిండా నిద్రపోవాలి.