V6 News

మేం చెప్పేదాకా కదలొద్దు.. హార్మూజ్‎లో నిలిచిపోయిన భారత నౌకలకు నేవీ గైడ్ లైన్స్ జారీ

మేం చెప్పేదాకా కదలొద్దు.. హార్మూజ్‎లో నిలిచిపోయిన భారత నౌకలకు నేవీ గైడ్ లైన్స్ జారీ

న్యూఢిల్లీ: భారతీయ వాణిజ్య నౌకలపై కాల్పుల ఘటనతో హార్మూజ్ జలసంధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నెల 18న జలసంధి దాటేందుకు ప్రయత్నించిన రెండు భారత నౌకలపై ఇస్లామిక్‌‌‌‌ రెవల్యూషనరీ గార్డ్‌‌‌‌ కోర్ (ఐఆర్‌‌‌‌‌‌‌‌జీసీ) కాల్పులు జరపడంతో ఇండియన్‌‌‌‌ నేవీ అప్రమత్తమైంది. భారత జెండా కలిగిన నౌకలకు  తాజాగా సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. 

ఇరాన్ చమురు నిల్వలు, సైనిక స్థావరాలు ఎక్కువగా ఉన్న లారక్ ద్వీపం పరిసరాల్లోకి వెళ్లవద్దని నౌకలను హెచ్చరించారు. నేవీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే వరకు జలసంధిని దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. ప్రస్తుతం 14 భారతీయ నౌకలు పర్షియన్ గల్ఫ్‌‌‌‌లో నిలిచిపోయి ఉన్నాయి. వీటి రక్షణ కోసం 7 యుద్ధనౌకలను రంగంలోకి దింపిన నేవీ.. నిరంతరం కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా వాటిని పర్యవేక్షిస్తున్నది.

గత శుక్రవారం ‘జగ్ అర్నవ్’, ‘సన్మార్ హెరాల్డ్’ అనే రెండు భారతీయ నౌకలు హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తుండగా, ఇరాన్ దళాలు కాల్పులు జరిపాయి. దీంతో ఆ నౌకలు వెనక్కి తిరగాల్సి వచ్చింది. అదే రోజు ‘దేశ్ గరిమా’ అనే ట్యాంకర్ మాత్రం సురక్షితంగా జలసంధిని దాటగలిగింది. ప్రస్తుతం ఈ నౌకకు భారత యుద్ధనౌకలు రక్షణ కల్పిస్తూ అరేబియా సముద్రం మీదుగా ముంబైకి తీసుకొస్తున్నాయి.

ఇరాన్‌‌‌‌తో భారత్ సంప్రదింపులు..

ప్రపంచ చమురు వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్‌‌‌‌ జలసంధిలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇరాన్‌‌‌‌ అధికారులతో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. ఇరాన్–అమెరికా మధ్య నడుస్తున్న ఘర్షణల నేపథ్యంలో, గతంలో సురక్షితంగా ఉన్న ఒమన్ కోస్ట్ మార్గంలో మైన్ల  ముప్పు పొంచి ఉండటంతో ప్రస్తుతానికి హార్మూజ్ మార్గాన్నే నేవీ పరిశీలిస్తోంది. పరిస్థితి చక్కబడే వరకు భారత నౌకల కదలికలు పూర్తిగా నేవీ నియంత్రణలోనే ఉండనున్నాయి.