
సెలబ్రిటీల జీవితాలు ఎప్పుడూ ప్రజల దృష్టిలో ఉంటాయి. వారి వ్యక్తిగత జీవితం, కెరీర్ అప్‌డేట్స్ పట్ల అభిమానులకు ఆసక్తి ఉంటుంది. అయితే, కొన్నిసార్లు ఈ ఆసక్తి అనవసరమైన పుకార్లకు దారితీస్తుంది. సోషల్ మీడియా విస్తృతి పెరిగాక ఇలాంటి వార్తలు మరింత వేగంగా వ్యాపిస్తున్నాయి. సెలబ్రిటీలు కూడా తమపై వస్తున్న పుకార్లను ఖండించడానికి సోషల్ మీడియానే వేదికగా వాడుకుంటున్నారు. నయనతార విషయంలో కూడా ఇదే జరిగింది.
గత కొద్ది రోజులుగా నటి నయనతార ( Nayanthara) , దర్శకుడు విఘ్నేష్ శివన్ ( Vignesh Shivan ) దంపతులు విడిపోతున్నారంటూ సోషల్ మీడియా, కోలీవుడ్ వెబ్‌సైట్‌లలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. విడాకులు తీసుకోబోతున్నారనే కోణంలో పలు కథనాలు రావడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే, ఈ పుకార్లపై నయనతార తాజాగా స్పందించారు. తన భర్త విఘ్నేశ్ శివన్‌తో కలిసి దిగిన ఒక ఫొటోను షేర్ చేస్తూ, "మాపై వచ్చే సిల్లీ న్యూస్ చూసినప్పుడు మా రియాక్షన్ ఇదే" అంటూ ఆ అసత్య ప్రచారాన్ని ఘాటుగా ఖండించారు.
😬😍 #WikkiNayan pic.twitter.com/S8FtozvupS
— Nayanthara✨ (@NayantharaU) July 10, 2025
పుకార్లకు దారితీసిన పోస్ట్..
నయనతార తన వైవాహిక బంధం గురించి కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్టే ఈ వదంతులకు దారితీసింది. "తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం పొరపాటు. నీ భర్త తప్పులకు నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు.." అంటూ ఆమె పోస్ట్ చేశారు. అయితే, ఈ పోస్ట్‌ను కొన్ని గంటల వ్యవధిలోనే ఆమె డిలీట్ చేశారు. కానీ, అప్పటికే ఆ స్క్రీన్‌షాట్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, నయనతార-విఘ్నేష్ విడాకుల రూమర్లు శరవేగంగా వ్యాపించాయి. ఈ పోస్ట్ వెనుక అనేక ఊహాగానాలు చెలరేగాయి. కొంతమంది ఇది కేవలం ఏదో ఒక సినిమా డైలాగ్ లేదా వ్యక్తిగత అభిప్రాయం కావచ్చని భావించారు. మరికొందరు నయనతార, విఘ్నేష్‌ల మధ్య ఏదైనా చిన్నపాటి విభేదాలు తలెత్తాయేమోనని అనుమానించారు.
మా బంధం చెక్కుచెదరలేదు..
అయితే, నయనతార తన స్పందనతో ఈ పుకార్లన్నింటికీ తెరపడింది. తమ బంధం చెక్కుచెదరలేదని, ఇలాంటి వార్తలు తమను నవ్వించేలా ఉన్నాయని ఆమె పరోక్షంగా తెలియజేశారు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై వచ్చే ఇలాంటి తప్పుడు వార్తలు కొత్తేమీ కాదు. గతంలో కూడా ఎంతో మంది సినీ ప్రముఖులపై ఇలాంటి పుకార్లు షికారు చేశాయి. ఈ నేపథ్యంలో తమపై వచ్చిన ఆవాస్తవ కథనాలకు చెక్ పెడుతూ నయనతార క్లారిటీ ఇచ్చారు. తన జీవితంలో అంతా సవ్యంగా ఉందని, పుకార్లను నమ్మవద్దని ఆమె స్పష్టం చేస్తూ ఇద్దరి ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
నయనతార, విఘ్నేష్‌ల కెరీర్ అప్‌డేట్స్
పుకార్లకు చెక్ పెట్టిన నయనతార, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 'మెగా 157' ( Mega157 ) , కన్నడ సూపర్ స్టార్ యశ్ నటిస్తున్న 'టాక్సిక్' వంటి భారీ ప్రాజెక్టుల్లో ఆమె కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'టాక్సిక్' చిత్రంలో ఆమె పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని, గ్లామర్ పాత్ర కాదని ఇప్పటికే వార్తలు వెలువడ్డాయి. 'మెగా 157' మూవీలో నయనతార పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు, విఘ్నేష్ శివన్ కూడా దర్శకుడిగా తన తదుపరి ప్రాజెక్ట్‌లపై దృష్టి సారించారు. ప్రదీప్ రంగనాథన్ హీరోగా 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' (Love Insurance Company) అనే చిత్రాన్ని ఆయన తెరకెక్కిస్తున్నారు.
►ALSO READ | Naga Chaitanya : 'తండేల్' జోరు.. బుల్లితెరపై దుమ్మురేపిన నాగ చైతన్య, సాయి పల్లవిల జోడీ!