నయనతార బయోపిక్‌కి కాపీరైట్ కష్టాలు.. రూ.5 కోట్లు డిమాండ్ చేస్తూ నోటీసులు!

 నయనతార బయోపిక్‌కి కాపీరైట్ కష్టాలు.. రూ.5 కోట్లు డిమాండ్ చేస్తూ నోటీసులు!

ఇటీవల నటి నయనతార ( Nayanthara  )వరుస వార్తల్లో నిలుస్తున్నారు.  తన జీవితం ఆధారంగా రూపొందించిన 'నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్' డాక్యుమెంటరీ మరో సారి వివాదంలో చిక్కుకుంది.  గతంలో తమిళ నటుడు, నిర్మాత ధనుష్ తో న్యాయపరమైన వివాదాలు ఎదుర్కోంటుంది. అది మరువక ముందే తాజాగా 2025 తమిళ బ్లాక్ బస్టర్ మూవీ చంద్రముఖి హక్కులు కలిగిన సంస్థ నుంచి కాపీరైట్ సవాలును ఎదుర్కొంటున్నారు.  ఈ డాక్యుమెంటరీ చుట్టూ అలముకుంటున్న కష్టాలు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం  లేదన్న చర్చ సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

ఈ డాక్యుమెంటరీ 2024 నవంబర్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఇందులో  నయనతార వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన ప్రయాణం, ఆమె వివాహం, దర్శకుడు, నిర్మాత విఘ్నేష్ శివన్ తో దాంపత్య జీవితం, కవల పిల్లలకు తల్లిదండ్రులుగా వారి ప్రయాణం వంటివి ఉన్నాయి.  అయితే, ఈ డాక్యుమెంటరీ విడుదలైనప్పటి నుండి అనేక వివాదాల్లో చిక్కుకుంది.  తాజాగా 2005లో వచ్చిన  బ్లాక్‌బస్టర్ మూవీ 'చంద్రముఖి'కి సంబంధించిన ఆడియో, వీడియో హక్కులు కలిగిన ఏపీ ఇంటర్నేషనల్ సంస్థ, తమ అనుమతి లేదా లైసెన్స్ లేకుండా ఈ చిత్రంలోని ఫుటేజీని డాక్యుమెంటరీలో ఉపయోగించారని ఆరోపించింది.  ఏపీ ఇంటర్నేషనల్ దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు టార్క్ స్టూడియో ఎల్ఎల్‌పి , నెట్‌ఫ్లిక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సర్వీసెస్ ఇండియా ఎల్ఎల్‌పిలకు నోటీసులు జారీ చేసింది.

ఈ డాక్యుమెంటరీ నిర్మాతలు తమ నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండా యూట్యూబ్ నుంచి చంద్రముఖి విజువల్స్ సేకరించి చొప్పించారని ఏపీ ఇంటర్నేషనల్ ప్రధాన వాదన. ఈ కాపీరైట్ ఉల్లంఘన కారణంగా వినియోగాన్ని తక్షణమే నిలిపివేయాలని, రూ. 5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ కంపెనీ స్టూడియో,  స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌కు నోటీసులు పంపించింది.  చంద్రముఖి సినిమాకు సంబంధించిన ఉన్న అన్ని  సన్నివేశాలను ఈ డాక్యుమెంటరీ నుంచి తొలగించాలని ఏపీ ఇంటర్నేషనల్ కోరింది. 

ALSO READ :ఓటీటీలోకి మలయాళం సూపర్ హిట్ మూవీ.. ఈ కుర్రాళ్ల కథ అస్సల్ మిస్ కావొద్దు!

'నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్' డాక్యుమెంటరీకి ఇది మొదటి వివాదం కాదు. గతంలోనే తమిళ నటుడు,  నిర్మాత ధనుష్, తన నిర్మాణ సంస్థ ద్వారా విఘ్నేష్ దర్శకత్వంలో నిర్మించిన 'నానుమ్ రౌడీ దాన్'  చిత్రంలోని ఫుటేజీని తన అనుమతి లేకుండా ఉపయోగించారని ఆరోపించారు. ఈ చిత్రంలోని క్లిప్‌లను తొలగించాలని కోరినప్పటికీ, ఫుటేజీని అలాగే ఉంచినందున, ధనుష్ రూ. 10 కోట్ల దావా వేశారు. ఇది చట్టపరమైన చర్యలకు దారితీసింది. ఈ వరుస వివాదాలు 'నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్' డాక్యుమెంటరీ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ చట్టపరమైన సవాళ్లను నిర్మాతలు మరియు నెట్‌ఫ్లిక్స్ ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలి.