జీమెయిల్, FB, నెట్ ఫ్లిక్స్ కస్టమర్ల 15 కోట్ల అకౌంట్ల వివరాలు లీక్!

జీమెయిల్, FB, నెట్ ఫ్లిక్స్ కస్టమర్ల 15 కోట్ల అకౌంట్ల వివరాలు లీక్!


న్యూఢిల్లీ: జీమెయిల్, ఫేస్​బుక్, నెట్​ఫ్లిక్స్ వంటి కంపెనీల కస్టమర్ల 14.9 కోట్ల  అకౌంట్ల  ​ వివరాలు లీక్ అయ్యాయని తాజా స్టడీ తెలిపింది.  వీటి యూజర్ ​నేమ్స్​, పాస్​వర్డ్స్​ బహిరంగంగా అందుబాటులోకి వచ్చాయని ఎక్స్​ప్రెస్​ వీపీఎన్ స్టడీ రిపోర్ట్ వెల్లడించింది. ఈ డేటాబేస్​లో 4.8 కోట్ల జీమెయిల్ ఖాతాలు, 40 లక్షల యాహూ ఖాతాలు, 1.7 లక్షల ఫేస్​బుక్ ఖాతాలు ఉన్నాయి. అంతేగాక 65 లక్షల ఇన్​స్టాగ్రామ్, 34 లక్షల నెట్​ఫ్లిక్స్, 15 లక్షల ఔట్ లుక్ ఖాతాల సమాచారం కూడా బయటకు వచ్చిందని ఈ రిపోర్టును తయారు చేసిన సైబర్​సెక్యూరిటీ రీసెర్చర్​ జెరెమియా ఫాలర్​ చెప్పారు. ‘‘ఈ డేటాబేస్​కు పాస్​వర్డ్ రక్షణ​ లేదు. ఇందులో మొత్తం 14,94,04,754  లాగిన్స్​ వివరాలు​ ఉన్నాయి.  డేటాబేస్​ సైజు సుమారు 96 జీబీ ఉంటుంది. ఇది నెట్​లో అందరికీ అందుబాటులో ఉంది” అని ఆయన హెచ్చరించారు.    సాధారణంగా ముఖ్యమైన సమాచారాన్ని రహస్య కోడ్ భాషలోకి (ఎన్​క్రిప్షన్​) మారుస్తారు. ఇక్కడ ఆ సమాచారాన్ని ఎన్​క్రిప్ట్ చేయకుండా సాధారణ టెక్స్ట్ రూపంలోనే భద్రపరిచారు. దీనివల్ల నేరగాళ్లు లేదా ఇంటర్నెట్ వాడే ఎవరైనా ఆ సమాచారాన్ని సులభంగా చూసే అవకాశం కలిగింది. బాధితుల నుంచి సేకరించిన ఈ–మెయిల్స్, యూజర్ నేమ్స్, పాస్​వర్డ్స్ అన్నింటినీ ఒకే చోట చేర్చి స్టోర్​ చేశారు. ఈ సమాచారాన్ని నేరగాళ్లు 'క్రెడెన్షియల్ స్టఫింగ్' దాడుల కోసం వాడుకునే ప్రమాదం ఉందని ఫౌలర్ ఈ రిపోర్టులో హెచ్చరించారు.

బ్యాంకు ఖాతాలకూ ముప్పు

బాధితులకు చెందిన అన్ని రకాల ఆన్​లైన్ ఖాతాల వివరాలు ఇందులో ఉన్నాయని ఫౌలర్​ ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం సోషల్​మీడియా ఖాతాలే కాకుండా ఆర్థిక సేవల ఖాతాలు, క్రిప్టో వాలెట్లు, బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ లాగిన్​, పాస్​వర్డ్స్​ కూడా ఈ జాబితాలో కనిపించాయి. వివిధ దేశాలకు చెందిన ప్రభుత్వ డొమైన్ల ఖాతాలు ఇందులో ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ అనుబంధ ఖాతాల ద్వారా సున్నితమైన వ్యవస్థల్లోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. అధికారుల హోదా, వారికి ఉన్న అనుమతులను బట్టి నేరగాళ్లు ప్రభుత్వ నెట్​వర్క్​లను దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ఇది జాతీయ భద్రత, ప్రజా రక్షణకు పెద్ద ముప్పుగా మారుతుందని ఫౌలర్ హెచ్చరించారు. ‘‘పెద్ద సంఖ్యలో ప్రజల సమాచారం దొంగతనానికి గురికావడం వల్ల వారికి తెలియకుండానే భద్రతాపరమైన ఇబ్బందులు మొదలవుతాయి. ఈ సమాచారంలో ఈ–మెయిల్స్, సీక్రెట్​ కోడ్స్​ ఉన్నందున నేరగాళ్లు వీటిని ఆటోమేటెడ్ దాడులకు వాడే వీలుంది. దీనివల్ల ఆర్థిక నేరాలు, గుర్తింపు దొంగతనం పెరిగే ప్రమాదం పొంచి ఉంది. అసలైన ఖాతా వివరాలను వాడుతూ నేరగాళ్లు పంపే సందేశాలను సామాన్యులు నిజమని నమ్మి మోసపోయే అవకాశం ఉంటుంది”అని రిపోర్ట్​ పేర్కొంది.  ఎక్స్​ప్రెస్​ వీపీఎన్ స్టడీపై సంబంధిత కంపెనీలు ఇంకా స్పందించలేదని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.