స్కిల్స్ పెంచుకోవాలి .. మానసికంగానూ దృఢంగా ఉండాలి: రాష్ట్రపతి ముర్ము

స్కిల్స్ పెంచుకోవాలి ..  మానసికంగానూ దృఢంగా ఉండాలి: రాష్ట్రపతి ముర్ము

సికింద్రాబాద్/యాదాద్రి, వెలుగు:  విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని స్కూల్ సిలబస్ ను రూపొందించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. కేవలం అకడమిక్ నాలెడ్జినే కాకుండా లైఫ్ స్కిల్స్ ను పెంచుకునేలా స్టూడెంట్లకు సిలబస్ ఉండాలన్నారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకునే కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం-–2020ని ప్రవేశపెట్టిందని ఆమె తెలిపారు. మంగళవారం బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో శతాబ్ది ఉత్సవాలకు రాష్ట్రపతి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. 

ఆమెతోపాటు గవర్నర్ తమిళిసై, మంత్రి సీతక్క, విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ..రాబోయే కాలంలో టెక్నికల్ స్కిల్స్ తోపాటు ఎలాంటి సంక్షోభాన్ని అయినా ఎదుర్కొనేలా మానసిక దృఢత్వాన్ని పొందే వ్యక్తులకే ఆయా రంగాల్లో డిమాండ్ ఉంటుందన్నారు. వీటితోపాటు స్టూడెంట్లు పర్యావరణం పట్ల అవగాహన, పేద ప్రజల పట్ల సేవాభావాన్ని పెంచుకోవాలన్నారు. స్టూడెంట్లలో ఈ లక్షణాలు పెంపొందించేలా చేసే బాధ్యత టీచర్లపైనే ఉందన్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వందేండ్ల ప్రయాణంలో ఎంతో మంది గొప్ప వ్యక్తులను సమాజానికి అందించిందని ముర్ము అన్నారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, అడోబ్ సీఈవో శంతను నారాయణ్, పద్మభూషణ్ డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి వంటి ప్రముఖులు ఈ స్కూల్ ఓల్డ్ స్టూడెంట్లు కావడం గర్వకారణమన్నారు. విద్యార్థులు అకడమిక్ గా విజయాలు సాధించడమే కాకుండా మంచి క్యారెక్టర్ కూడా కలిగి ఉండేలా ఈ స్కూల్ ప్రాధాన్యత ఇవ్వడం అభినందించదగ్గ విషయమన్నారు.  

ఈ స్కూల్ స్టూడెంట్లు ఎంతో ఎదిగారు

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదివిన విద్యార్థులు రాజకీయాలు, లా, బ్యాంకింగ్ వంటి అనేక రంగాల్లో ఉన్నత స్థానాలకు ఎదిగారని గవర్నర్ తమిళిసై అన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులుగా, గవర్నర్ లుగా ఎదిగిన ఎంతో మంది ఈ ఉత్సవాల్లో పాల్గొనడం తనకు ఆనందాన్ని ఇస్తోందన్నారు. రాష్ట్రపతి ముర్ము చెప్పినట్లుగా నూతన జాతీయ విద్యా విధానం 2020 అమలుతో విద్యార్థులు చదువుతోపాటు ఇతర రంగాల్లోనూ పూర్తిస్థాయి నాలెడ్జిని పొందుతారన్నారు. స్టూడెంట్లు చదువుపైనే కాకుండా ఆటలపై కూడా దృష్టి సారించాలని సూచించారు. హైదరాబాద్ పబ్లిక్​స్కూల్ సొసైటీ అధ్యక్షుడు గుస్తీ ఎన్ నోరియా మాట్లాడుతూ.. శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా 25న గోల్ఫ్ టోర్నమెంట్, 26న వింటేజ్ కార్ల కార్నివాల్, బుక్ రీడింగ్, యూత్ పార్లమెంట్ వంటి ఈవెంట్స్ ఉంటాయని తెలిపారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈ నెల 27న గ్రాండ్ ఫినాలే నిర్వహిస్తామన్నారు.  

ఇయ్యాల పోచంపల్లికి రాష్ట్రపతి 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం యాదాద్రి జిల్లా పోచంపల్లిలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి హెలికాప్టర్ ద్వారా పోచంపల్లికి చేరుకోనున్నారు. ముందుగా భూదానోద్యమకారుడు ఆచార్య వినోభాబావే, భూదాత వెదిరె రాంచంద్రారెడ్డి విగ్రహాలకు రాష్ట్రపతి పూలమాలలు వేస్తారు. అనంతరం టై అండ్ డై ఇక్కత్ పట్టు చీరల తయారీని పరిశీలిస్తారు. చేనేత మాస్టర్ వీవర్ శివకుమార్ తో పాటు ప్రత్యేకంగా ఆహ్వానించిన 350 మందితో రాష్ట్రపతి మాట్లాడుతారు. రాష్ట్రపతి దాదాపు గంటసేపు పోచంపల్లిలో ఉంటారు.