తార్కిక సత్యాన్ని ఒంపిన కవిత్వం

తార్కిక సత్యాన్ని ఒంపిన కవిత్వం

కవిత్వం నిత్యనూతనంగా ఉండాలంటే కవి నేర్పు ఒక్కటే సరిపోదు. వస్తు నవ్యతకు కూడా ప్రాధాన్యం ఉండాలి. ప్రతి వస్తువు కవిత్వానికి ఒదిగిపోతుందా అంటే.. కవి వస్తువుపై పెట్టే శ్రద్ధ, దానికున్న ఆకర్షణీయతే కవిత్వాన్ని ముందుకు తీసుకెళ్తాయి. పదికాలాలపాటు పలకరింపుకు నోచుకునేలా చేస్తాయి. ఇలా వస్తు వైవిధ్యంలో నవ్యతను, కవిత్వ నడకను దృశ్యమానం చేస్తూ, అనుభూతి శైలితో పాఠక హృదయాన్ని విశేషంగా ఆకర్షించిన కవి శ్రేష్ఠుడు తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. ఏనుగు నరసింహారెడ్డి. ఆయనకున్న పనిభారం, బాధ్యతల మధ్య అసలు చదవడానికి, రచన చేయడానికి వీలు లేని పరిస్థితి. అంతటి క్లిష్ట సమయంలోనూ తెలుగు భాషకు జీవం పోస్తూ, జీవితాన్ని సాహిత్యానికే అంకితం చేస్తున్న అవిశ్రాంత శ్రామికుడు, అక్షర యోధుడు నరసింహారెడ్డి.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం అప్పటి ప్రభుత్వం తెలంగాణ భాషకు పట్టం కట్టి, నిరాదరణకు గురైన తెలంగాణ సాహిత్యాన్ని, ఎందరో కవులను, కళాకారులను సాహితీ జగత్తుకు పరిచయం చేయడానికి ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించింది. తెలంగాణ భాష, యాసను విశ్వవ్యాప్తం చేసి, తెలంగాణ జాతి ఊపిరిని ప్రపంచ పటానికి పరిచయం చేసిన ఆ గొప్ప కార్యాన్ని ముందుండి నడపడంలో ప్రభుత్వానికి వారధిగా, భాషా సేవకు పూనుకున్న వ్యక్తి నరసింహారెడ్డి. అప్పటికీ, ఇప్పటికీ తెలంగాణ రుబాయీలు ఆయన రచనా కౌశలానికి గీటురాయిగా నిలిచాయి. ఈ కోవలోనే వచన సాహిత్యంలో అనేకానేక ప్రయోగాలతో పలు పుస్తకాలను వెలువరించారు. అందులో ప్రసిద్ధ కావ్యం ‘నీడల దృశ్యం’.

‘నీడల దృశ్యం’లో ఆయన పేర్చిన అక్షరాల గుట్టలు వట్టి మాటలు కావు. అందులో తడిమిన ఎన్నో అంశాలు పాఠకులను ప్రశ్నిస్తాయి. ఆ ప్రశ్నల తలంపులోనే పరిపూర్ణమైన సమాధానంగా కవి హృదయం ఆవిష్కృతమవుతుంది. రంగులరాట్నంగా తిరుగుతున్న కాలాలను కవి ప్రత్యేకంగా దర్శిస్తాడు. అది మొక్కుబడిగా కాదు. సునిశిత పరిశీలనతో చెప్పదలచుకున్న విషయానికి ఎక్కడో ఒక చోట లింకును తగిలించి, దాని చుట్టూ పాఠకులను తిప్పగల సమర్థుడు ఆయన. 

ఆయన శైలిలోని సూటిదనం, చెమక్కు అంత తొందరగా పట్టుబడవు. అనుభూతివాదంలో అంతుచిక్కని వస్తువులపై కావ్యగానం చేస్తాడు. వస్తువు ఎంపికలో నాణ్యతతో కూడిన నవ్యత కనిపిస్తుంది. కవిత్వంలోని ఈ నాణ్యతకు కారణం మలుపులు తిరిగిన కల్లోలిత జీవితం, అధికారిగా ఉన్న చోట కదిలించిన సంఘటనలు, కాలం మెలిపెట్టిన సన్నివేశాలు, సాంకేతిక ఆవిష్కరణలు. వీటన్నింటినీ సంకేత ధాతువులుగా ‘నీడల దృశ్యం’గా నిలబెట్టారు. మూసపద్ధతికి భిన్నంగా భావగర్భితమైన కవితలు విస్ఫోటనం చెందుతాయి. వస్తువుపై ఆయనకున్న మక్కువ స్పష్టంగా కనిపిస్తుంది. 

‘న్యూ డొమైన్’ అనే కవితలో ఈ పొందిక సుస్పష్టం. “ఎప్పుడన్నా ఉన్న స్వరమంతా విప్పుదామంటే అక్కడి బధిరత్వం ప్రదర్శనకు పెట్టబడుతది.. కుర్చీలే సర్వస్వమనేవాళ్లు కూడా దానికి నిరంతరం రంగులద్దుకుంటూ ఉంటరు.. పూల యుద్ధం చేసి రాళ్లలో చిక్కినవాడా.. నీ లోకం కాని చోట నిలవడం తప్పు.. మనస్కరించని మరుగుజ్జుల డొమైన్‌ నుంచి ఎగ్జిట్‌ కావడం ఉత్తమం” ఇక్కడ ఒక్కో వాక్యంలో ఒక్కో భావం కవితకు పెట్టుబడిగా మారుతుంది. అధికారిగా ఎంత పెద్ద హోదాలో ఉన్నా, మనిషితనపు వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోవద్దని చెప్పడానికి అనాయాసంగా నేతనే పలుకుగా మారిపోతాడు. మాటల పొందికను మనసుతో అద్దుతాడు.

“ఎంత మునిగినా అడుగు తగలదు.. దీనికసలు అడుగుందా? దిగకముందెవ్వరు చెప్పరైరీ ఇదింత లోతు.. పాడైతదని ఒడ్డు గనిపిస్తనేలేదు.. బుక్కెడు బుక్కెడు నీళ్లు దాగి మునిగిపోతానా ఏంది!” అనే తేలికైన మాటల్లో భావం మాత్రం సరళం కాదు. సముద్ర లోతులాంటి జీవిత చట్రంలో ఈదడం మాత్రమే మనిషి చేయగల పని. ఎదురయ్యే సవాళ్ల నిప్పుల వెచ్చదనాన్ని ముందుగానే చూడలేమనే భావాన్ని ‘పచ్చి కుండ’ కవితలో విశాలపరుస్తాడు.

మరోచోట “అన్ని కళ్లూ బహిరంగంగా వర్షించకపోవచ్చు.. కొందరి దుఃఖం అంతర్వాహిని.. బయటకేమీ ఎరుక పడదు” అని అద్దంలోని మౌనాన్ని అక్షర గుర్తులతో ఔన్నత్యంగా చూపించే వాక్యాన్ని ‘అంతర్వాహిని’గా చెక్కుతారు.

“రూపం లేని శక్తిశకలాలు ఉంటాయని ఏ దేశపు జానపద గాథా చెప్పకపాయె.. ఒళ్లు జల్లడేగని జీవి ఏ రంధ్రం గుండాపోతదో ఏ పురాణమూ ప్రవచించదాయె” అంటూ రచనాసౌష్టవాన్ని పలికిస్తారు. దీన్ని తాకితే అది పలికే విషాదం ఎంత చేదుగా ఉందో కళ్లకు కట్టినట్లు చూపడమే కాదు.. రెడ్డిగారి ఆలోచనా పటిమ కూడా అనేక కవితల్లో తారాడుతుంది.

ఒక కవితా సంపుటి ద్వారా కవి సమాజానికి ఎలాంటి సందేశం అందించాలి? అనే తార్కిక ప్రశ్నను తనలో తానే వేసుకున్నట్లు కనిపిస్తుంది. ‘బోయెడు కుట్టిన వల’ కవితలో ఆదర్శపథ నిర్దేశం తానే చేస్తాడు. రాచవీధుల్లో నెత్తులెత్తుకుని నడవాలి. కాపరి పట్టుబట్టినప్పుడు కోడిగంప కిందికి రాక తప్పనట్లు, ఆకాశమే వెంటాడినప్పుడు పిచ్చుక దొరకక తప్పదు. ఇక్కడ తహసీల్దార్‌ నాగరాజు జైలు మృతిని చెబుతున్నట్లు కనిపించినా, అంతర్లీనంగా రాజకీయ చదరంగంలో అధికారులు పావులుగా వాడబడతారనే పచ్చి నిజాన్ని అనుభవజ్ఞానంతో వివరిస్తారు.

కావ్యభాషలో ధూర్జటి కవి రాసిన ‘శ్రీకాళహస్తీశ్వర శతకం’లోని “రాజులు మత్తుల్‌” అనే పద్యభావనకు దగ్గరగా ‘వెర్రి’ అనే కవితలో “మహా సామ్రాజ్యాలు ఇక్కడ కొలువై ఉంటే.. మలిన సింహాసనాల వెంట వెర్రిలోకం” అంటూ ఒక కవిగా, చిత్రకారుడిగా, గాయకుడిగా కళాహృదయం ఉన్నవారు కుళ్లిన రాజకీయ చెత్తలో కిరీటాన్ని ఏరుకోవడం ఎందుకని ప్రశ్నిస్తాడు. ఈ సందర్భంలో స్వీయ అనుభవాలకు పదునుపెట్టి ఈ కావ్యాన్ని రక్తికట్టించాడు.

ప్రభుత్వంలో భాగస్వామ్యమైన అధికారికి స్వేచ్ఛ ఉండదనే భావనను ఊటంకిస్తూ అనేక కవితల్లో ఇష్టం లేని సంసారం చేసినట్టుగా మంచి భావుకతతో జనంలో స్ఫురణ కలిగిస్తాడు. “నీళ్లనూ బియ్యాన్నీ ఏ నిష్పత్తిలో కలిపితే రాళ్ల బాధలను...” అంటూ అడ్డదిడ్డంగా పనులు చేయించుకుని, చివరికి ఆ అధికారిణి చుక్కలు చూపించిన సదరు మహిళ వైపు కవి హృదయాన్ని విశాలపరిచి యదార్థగాథను ‘గుడ్డికొంగ’ కవితలో వినిపిస్తాడు.

ఆయన కవిత్వం రుచులు కోరదు. కానీ చేదు చేసే పెత్తనంపై బలంగా విరుచుకుపడుతుంది. సూదిమందు ఇచ్చినప్పుడు ఏర్పడని నొప్పిలా, సన్నగా హృదయాంతరాల్లోకి చొచ్చుకుపోయి కలవరపెడుతుంది. తన మనసు ఎంత మాధుర్యాన్ని సంకల్పిస్తుందో చెప్పే విషయంలోనూ అంతే నిబద్ధతను చూపిస్తాడు.

“నా గొడుగునెప్పుడో కాలం గాలి తిరిగేసుకుపోయింది. నా కవచకుండలాలనెవరో నాకు తెలియకుండానే దానం తీసుకున్నారు” అని తన తండ్రి జ్ఞాపకాలను, ఓదార్పులేని పక్షిగా తాను అనుభవిస్తున్న తీరును ‘నీడల దృశ్యం’ కవితలో స్పష్టం చేస్తాడు.

గాలం నొప్పితో గాయపడ్డ గొంతు నుంచి వచ్చిన మాటగా అన్ని కవితల్లో అంతర్ముఖ రంగ ప్రవేశం చేసి, పెద్దరికంతో సందేశాన్ని ఇస్తారు. ‘నీడల దృశ్యం’ను ఒక కావ్యంగా కాకుండా జీవిత సత్యంగా పలికించారు ఏనుగు నరసింహారెడ్డి.

 
- గన్నోజు ప్రసాద్