- టెండర్ లో హయ్యెస్ట్ బిడ్ దాఖలు
- రెండేండ్ల పాటు సొసైటీకి ప్రాసెసింగ్ యూనిట్, షాపులు, ఫంక్షన్ హాల్
- టెండర్ అలాట్ మెంట్ లెటర్ అందజేసిన మంత్రి పొన్నం
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో ఉన్న నీరా కేఫ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్వహణ టెండర్ అంబర్ పేట టీటీసీఎస్ ఎన్ కే, ఫూల్ బాగ్ కల్లు గీత సొసైటీకి దక్కింది. వీటి నిర్వహణకు గత నెలలో టాడీ టాపర్స్ కో–ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థ టెండర్ పిలిచింది. వీటితో పాటు అదే ప్రాంగణంలో ఉన్న ఏడు కమర్షియల్ షాపులు, బాంకెట్హాల్ సైతం లీజుకు ఇవ్వనున్నారు. ఈ టెండర్ కు అంబర్ పేట సొసైటీ మిగతా కల్లు గీత సొసైటీల కన్నా ఎక్కువ బిడ్ ( రూ.8.57 లక్షలు) దాఖలు చేసింది.
గురువారం సెక్రటేరియట్లో ఈ సొసైటీ ప్రెసిడెంట్ సారయ్య గౌడ్ కు టెండర్ అలాట్ మెంట్ లెటర్ ను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కమిషనర్ బాలమాయదేవి, కార్పొరేషన్ ఎండీ ఉదయ్ ప్రకాశ్ అందజేశారు. ఈనెల 1 నుంచి రెండేళ్ల పాటు నీరా కేఫ్ తో పాటు బాంకెట్ హాల్, షాపులు ఈ సొసైటీ ఆధ్వర్యంలో పనిచేస్తాయని అలాట్ మెంట్ లెటర్ లో ఎండీ ఉదయ్ ప్రకాశ్ పేర్కొన్నారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న నీరా కేఫ్ నిర్వహణ ప్రభుత్వానికి భారంగా మారడంతో సొసైటీలకు లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు వివిధ జిల్లాలకు చెందిన సొసైటీల వ్యాపారులు చాలా మంది లీజుకు తీసుకునేందుకు ముందుకు రాగా ఇతర సొసైటీల కన్నా ఎక్కువ బిడ్ దాఖలు చేసి టీటీసీఎస్ ఎన్ కే ఫూల్ బాగ్ కు టెండర్ దక్కింది.

