ఇండియా స్టార్‌‌ జావెలిన్‌‌ త్రోయర్‌‌ నీరజ్‌‌ చోప్రాకు లెఫ్టినెంట్‌‌ కర్నల్‌‌ హోదా

ఇండియా స్టార్‌‌ జావెలిన్‌‌ త్రోయర్‌‌ నీరజ్‌‌ చోప్రాకు లెఫ్టినెంట్‌‌ కర్నల్‌‌ హోదా

న్యూఢిల్లీ: ఇండియా స్టార్‌‌ జావెలిన్‌‌ త్రోయర్‌‌ నీరజ్‌‌ చోప్రాకు అరుదైన గౌరవం దక్కింది. టెరిటోరియల్‌‌ ఆర్మీలో అతనికి లెఫ్టినెంట్‌‌ కర్నల్‌ హోదా లభించింది. ఇండియా గెజిట్‌‌ ప్రకారం ఈ నియామకం ఏప్రిల్‌‌ 16 నుంచి అమల్లోకి వచ్చిందని సైనిక వ్యవహారాల శాఖ జాయింట్‌ సెక్రటరీ మేజర్‌‌ జనరల్‌‌ జీఎస్‌‌ చౌదరీ బుధవారం వెల్లడించారు.

నీరజ్‌‌కంటే ముందు టీమిండియా కెప్టెన్లు కపిల్‌‌ దేవ్‌‌, ఎంఎస్‌‌ ధోనీ, 2008 బీజింగ్ గోల్డెన్‌‌ షూటర్‌‌ అభినవ్‌‌ బింద్రాకు కూడా టెరిటోరియల్‌‌ ఆర్మీలో గౌరవ ర్యాంక్‌‌లు లభించాయి. లెజెండ్‌‌ బ్యాటర్‌‌ సచిన్‌‌ టెండూల్కర్‌‌ 2010లో ఇండియన్‌‌ ఎయిర్‌‌ఫోర్స్‌‌ (ఐఏఎఫ్‌‌)లో గ్రూప్‌‌ కెప్టెన్‌‌ హోదా అందుకున్నాడు.

2016లో ఇండియన్‌‌ ఆర్మీలో నయీబ్‌‌ సుబేదార్‌‌ హోదాలో జూనియర్‌‌ కమిషన్డ్‌‌ ఆఫీసర్‌‌గా చేరిన నీరజ్.. 2018లో అర్జున, 2021లో విశిష్ట సేవా పతకాన్ని సాధించాడు. అదే ఏడాది సుబేదార్‌‌ హోదా కూడా లభించింది. 2022లో భారత సాయుధ దళాల అత్యున్నత పురస్కారం ‘పరమ విశిష్ట సేవ పతకం’ పొందిన తర్వాత సుబేదార్‌‌ నుంచి మేజర్‌‌ హోదాకు ప్రమోట్‌‌ అయ్యాడు. ఇప్పుడు కర్నల్‌ హోదా లభించింది.

కాగా, వచ్చే వారం బెంగళూరులో జరగాల్సిన ఎన్‌‌సీ క్లాసికల్‌‌ టోర్నీ వాయిదా పడటంతో నీరజ్‌‌.. పోలెండ్‌‌ ఈవెంట్‌‌లో బరిలోకి దిగనున్నాడు. ఈ నెల 23న చోర్జోలో జరిగే ఓర్లెన్‌‌ జానస్జ్‌‌ కుసోసిన్కి మెమోరియల్‌‌ ఈవెంట్‌‌లో పోటీపడనున్నాడు. పారిస్‌‌ ఒలింపిక్స్‌‌ బ్రాంజ్‌‌ మెడల్‌‌ విన్నర్‌‌ అండర్సన్‌‌ పీటర్స్‌‌ (గ్రెనెడా), జూలియన్‌‌ వెబర్‌‌(జర్మనీ), మార్సిన్‌‌ కుర్సోవిస్కీ, సిప్రియన్‌‌ మ్రిగ్లోడ్జ్‌‌, డేవిడ్‌‌ వాగ్నెర్‌‌ (పోలెండ్‌‌) కూడా బరిలో ఉన్నారు.