జనవరి 1నుంచి కరోనా కొత్త రూల్స్ అమల్లోకి..

జనవరి 1నుంచి కరోనా కొత్త రూల్స్ అమల్లోకి..
  • చైనా, హాంకాంగ్, జపాన్, సౌత్ కొరియా, సింగపూర్, థాయ్​లాండ్ ప్యాసింజర్లపై కేంద్రం ఆంక్షలు
  • రిపోర్టులు ఎయిర్ సువిధలో పోర్టల్ లో అప్ లోడ్ చేయాలి
  • ట్రావెల్లింగ్ కు ముందు 72 గంటల్లోగా టెస్టు చేయించుకోవాలి: మాండవీయ

న్యూఢిల్లీ: చైనాతో పాటు చుట్టుపక్కల దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 6 దేశాల నుంచి వచ్చే ప్యాసింజర్లపై ఆంక్షలు విధించింది. ప్రస్తుతం కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న చైనా, హాంకాంగ్, జపాన్, సౌత్ కొరియా, సింగపూర్, థాయ్ లాండ్ నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా నెగెటివ్ రిపోర్టు కంపల్సరీ చేసింది. ఈ దేశాల నుంచి వచ్చేటోళ్లకు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు ఉండాలని నిబంధన పెట్టింది. ఇది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పింది. ‘‘జనవరి 1 నుంచి  చైనా, హాంకాంగ్, జపాన్, సౌత్ కొరియా, సింగపూర్, థాయ్ లాండ్ నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు తప్పనిసరి. ప్రయాణానికి ముందు ప్యాసింజర్లు తమ రిపోర్టులను ఎయిర్ సువిధ పోర్టల్ లో అప్ లోడ్ చేయాలి” అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ గురువారం ట్విట్టర్ లో వెల్లడించారు. ట్రావెలింగ్ కు ముందు 72 గంటల్లోగా టెస్టు చేయించుకొని నెగెటివ్ రిపోర్టు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఎయిర్ పోర్టుల్లో విదేశాల నుంచి వస్తున్న ప్యాసింజర్లలో 2 శాతం మందికి ర్యాండమ్ గా టెస్టులు చేస్తున్నామని, ఇప్పుడీ రూల్ దానికి అదనమని పేర్కొన్నారు. వచ్చే 40 రోజులు అత్యంత గడ్డుకాలం ఉంటుందని, దేశంలో వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువని, పాజిటివ్ కేసులు పెరగొచ్చని  కేంద్రం అంచనా వేసింది.

అమెరికాలోనూ ఆంక్షలు.. 

విదేశీ ప్రయాణికులపై అమెరికా కూడా ఆంక్షలు విధించింది. చైనా, హాంకాంగ్, మకావోల నుంచి వచ్చేటోళ్లకు నెగెటివ్ రిపోర్టు తప్పనిసరి చేసింది. ‘‘ట్రావెలింగ్ కు ముందు 48 గంటల్లోగా కరోనా టెస్టు తప్పనిసరి.  విమానం ఎక్కే ముందు నెగెటివ్ రిపోర్టు సమర్పించాలి. రెండేండ్ల పిల్లలు మొదలు అందరూ టెస్టు చేయించుకోవాల్సిందే. చైనా నుంచి వేరే దేశానికి వయా అమెరికా వచ్చేటోళ్లకు కూడా ఇది వర్తిస్తుంది. ప్రయాణానికి 10 రోజుల ముందు కరోనా సోకి ఉంటే, వాళ్లు కరోనా నుంచి కోలుకున్నట్లు పేపర్లు చూపించాల్సి ఉంటుంది’’ అని యూఎస్ సెంటర్​ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) పేర్కొంది.

కరోనా సోకిన విదేశీ టూరిస్ట్ మిస్సింగ్

కరోనా సోకిన ఓ విదేశీ టూరిస్ట్, ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో ఉన్న తాజ్‌‌‌‌మహల్‌‌ని చూసేందుకు వచ్చి మిస్సయ్యాడు. అతని ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నెల 26న తాజ్‌‌మహల్‌‌ని సందర్శించేందుకు వచ్చిన ఒక టూరిస్ట్ నుంచి కొవిడ్ టెస్ట్ శాంపిల్స్ తీసుకున్నామని ఆగ్రా చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంవో) డాక్టర్ అరుణ్ శ్రీవాస్తవ గురువారం వెల్లడించారు. అతని పేరు, మొబైల్ నెంబర్ కూడా నమోదు చేశామని చెప్పారు. టెస్టులో టూరిస్ట్ కు కొవిడ్ పాజిటివ్‌‌గా తేలిందని.. విషయం చెప్పడానికి ప్రయత్నిస్తే అతని మొబైల్ కలవడం లేదని వివరించారు. టూరిస్ట్ ఇచ్చిన మొబైల్ నంబర్, ఇతర వివరాలన్ని తప్పుగా ఉన్నాయని తెలిపారు. అతడు ప్రస్తుతం ఎక్కడున్నాడో  తెలియదని..లోకల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎల్‌‌ఐయూ), హోటల్స్ అసోసియేషన్, పోలీసులు సహాయంతో వెతుకుతున్నట్లు వెల్లడించారు. కరోనా సోకిన విదేశీ టూరిస్ట్ 3 రోజుల నుంచి ట్రీట్మెంట్ లేకుండా బయటే తిరుగుతున్నాడని.. అతని వల్ల చాలా మందికి వైరస్ సోకే ప్రమాదముందన్నారు. ఇక నుంచి శాంపిల్స్ సేకరించేటప్పుడు ప్రతి టూరిస్ట్ గుర్తింపు కార్డును జాగ్రత్తగా పరిశీలిస్తామని శ్రీవాస్తవ పేర్కొన్నారు.

తాజా కేసులు 268

దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3,552కి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించింది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 268 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపింది.తాజా కేసులతో ఇప్పటివరకు వైరస్ సోకిన వారి మొత్తం సంఖ్య 4.46 కోట్లకు పెరిగిందని చెప్పింది. కొత్తగా ఇద్దరు మృతిచెందడంతో  మరణించిన వారి మొత్తం సంఖ్య 5,30,698కి చేరుకుందని వివరించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.08 కోట్ల కరోనా వ్యాక్సిన్‌‌ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.