
- ప్రకటించి వదిలేస్తున్న జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ
- పైలట్ ప్రాజెక్టులూ అందుబాటులోకి రాలే
- ఇప్పటికే ఉన్న ట్రాక్‌లపై కార్లు, బైక్‌ల పరుగులు
హైదరాబాద్, వెలుగు:గ్రేటర్‌సిటీలో సైక్లింగ్ ట్రాక్ ల ఏర్పాటు నామ్‌కే వాస్తేగా కనిపిస్తోంది. విదేశాల తరహాలో 450 కిలోమీటర్ల మేర సిటీ అంతటా ఏర్పాటు చేస్తామని జీహెచ్ఎంసీ,హెచ్ఎండీఎలు ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు కేవలం రెండు చోట్ల మాత్రమే వినియోగంలోకి వచ్చాయి. అవి కూడా సైక్లిస్టులకు ఉపయోగపడటం లేదు. ఉన్నరోడ్లపై ఎల్లో, గ్రీన్‌కలర్ వేసి అధికారులు చేతులు దులుపుకొన్నారు. విదేశాల్లో సైక్లింగ్ ట్రాక్‌లను రోడ్ల పక్కన ప్రత్యేకంగా నిర్మిస్తారు. ఇతర వెహికల్స్వాటి మీదికి వస్తే భారీ ఫైన్లు వేస్తారు. మన దగ్గర చాలామందికి సైక్లింగ్ట్రాక్లపై అవగాహనే లేదు. జీహెచ్ఎంసీ అన్ని జోన్లలో ట్రాక్‌లు ఏర్పాటు చేయడమే లక్ష్యమని చెబుతున్నప్పటికీ, ఆ దిశగా పనులు చేయడం లేదు. కొన్నిచోట్ల తాత్కాలికంగా, మరికొన్ని ప్రాంతాల్లో పర్మినెంట్‌గా నిర్మిస్తామని చెప్పి పట్టించుకోవడం లేదు. పైలట్ ప్రాజెక్టు కింద బాలానగర్, లంగర్‌హౌస్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ట్రాక్‌లు ప్రారంభించక ముందే కరాబ్అయిపోయాయి. సైక్లింగ్ట్రాక్అని సూచిస్తూ వేసిన పెయింట్లు కనుమరుగైపోయాయి. సీఆర్ఎంపీ(కాంప్రెన్సివ్ రోడ్డు మెయింటెనెన్స్ ప్లాన్) రోడ్లపై కూడా సైక్లింగ్ ట్రాక్ లు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి కేటీఆర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పలుమార్లు ప్రకటించారు. కానీ ఆ దిశగా పనులు చేయించడం లేదు.
పూర్తయితే ఉపయోగం
దశలవారీగా 450 కిలోమీటర్ల మేర సైక్లింగ్ ట్రాక్‌లు అందుబాటులోకి తీసుకొస్తామని జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, హెచ్‌యూఎంటీఏ ఏడాది క్రితం ప్రకటించాయి. ముందుగా పైలట్‌ప్రాజెక్టుగా బేగంపేట మెట్రోస్టేషన్ నుంచి సైఫాబాద్ ఇక్బాల్ మినార్ వరకు 12.3 కిలోమీటర్ల మేర(వన్‌వే) సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించాయి. కానీ ఇప్పటి వరకు ట్రాక్ఏర్పాటు కాలేదు. అలాగే ఖైరతాబాద్, హైటెక్‌సిటీ, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్, చార్మినార్, మెహిదీపట్నం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైదరాబాద్ నాలెడ్జ్ సెంటర్, కోకాపేటలో మొత్తం ఎనిమిది రోడ్లను సైక్లింగ్ ట్రాక్‌లుగా మార్చాలని అధికారులు నిర్ణయించారు. ప్రముఖ ఆఫీసులు మెట్రో రైల్వేస్టేషన్లను కలుపుతూ అందరికీ సౌకర్యంగా ఉండేలా వీటి ఏర్పాటు ఉంటుందని చెప్పినా ఎక్కడ కూడా సైక్లింగ్ ట్రాక్ అందుబాటులోకి రాలేదు. మియాపూర్ మెట్రో స్టేషన్ సర్వీస్ రోడ్ వద్ద కొత్తగా వేసిన ఫుట్‌పాత్‌పై సైక్లింగ్ ట్రాక్ ది ఇదే పరిస్థితి. మంత్రులు, మేయర్చెప్పినట్లు సైకిల్ ట్రాక్ లు అందుబాటులోకి వస్తే సిటీలో సైక్లిస్టులు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో చాలామంది పబ్లిక్ ట్రాన్స్ పోర్టేషన్ ని వాడుతున్నారు. ఈ ట్రాక్ లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఇండ్లకు దగ్గరలో ఆఫీసులు ఉన్నవారు సైకిళ్లపై వెళ్లే అవకాశం ఉంది.
ఉన్నచోట ఇదీ పరిస్థితి
ప్రస్తుతం కేబీఆర్ పార్కు చుట్టూ, నెక్లెస్‌రోడ్డులో మాత్రమే సైక్లింగ్ ట్రాక్ లు అందుబాటులో ఉన్నాయి. ఫైనాన్షియల్డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ ప్రాంతాల్లోని సైక్లింగ్ ట్రాక్‌లు కనిపించడం లేదు. లాక్డౌన్ టైంలో రోడ్లు వేయడంతో ఉన్న లేన్లు కనుమరుగయ్యాయి. బయోడైవర్సిటీ నుంచి హైటెక్ సిటీ వరకు ప్రత్యేకంగా ఉన్న సైక్లింగ్ ట్రాక్ ఇప్పుడు లేదు. కేబీఆర్ పార్కు, నెక్లెస్‌రోడ్డులోని ట్రాక్‌ల మీదిగా కార్లు, బైక్‌లు వెళుతున్నాయి. సైక్లిస్టులు వచ్చినా దారి ఇవ్వడం లేదు.
విదేశాల్లో ఫైన్లు ఇలా..
దుబాయిలోని షేక్ జాహెద్ రోడ్ లోని సైక్లింగ్‌ట్రాక్ పైకి ఇతర వెహికల్స్వస్తే 500 ధీరమ్స్(రూ.8వేలకు పైనే) ఫైన్విధిస్తారు. సౌదీ అరేబియాలో సైక్లింగ్ ట్రాక్ పైకి ఇతర వెహికల్స్ వస్తే 500 రియాల్స్(రూ.9వేల వరకు)విధించడంతోపాటు జైలు శిక్ష అమలులో ఉంది. నెదర్లాండ్స్‌లోని ఆమ్స్టర్డామ్సిటీలో సైక్లింగ్ ట్రాక్ కోసం సపరేట్ వే ఉంటుంది. ఇతర వెహికల్స్ వస్తే వేలల్లో ఫైన్లు వేయడంతోపాటు కేసులు నమోదు చేస్తున్నారు. అమెరికా, న్యూజిల్యాండ్ దేశాల్లోనూ ప్రత్యేకంగా సైక్లింగ్ ట్రాక్‌లు ఉన్నాయి.
ప్రతిపాదిత ప్రాంతాలు ఇవే
450 కిలోమీటర్లు మాట పక్కన పెడితే, గ్రేటర్ లోని సీఆర్ఎంపీ రోడ్లపై 90 కిలోమీటర్ల మేర ట్రాక్‌లు ఏర్పాటు చేయాలని బల్దియా నిర్ణయించింది. ఎల్ బీనగర్ జోన్ లోని హబ్సిగూడ క్రాస్ రోడ్డు నుంచి ఉప్పల్ చౌరస్తా వరకు 3 కిలోమీటర్లు, బైరామల్ గూడ క్రాస్ రోడ్డు నుంచి ఓవైసీ జంక్షన్ వరకు 4 కిలోమీటర్లు, చార్మినార్ జోన్ లోని ఓవైసీ జంక్షన్ నుంచి ఆరాంఘర్ వరకు, ఆరాంఘర్ నుంచి పీడీపీ జంక్షన్ వరకు 4 కిలో మీటర్లు పర్మినెంట్ట్రాక్లు వేయాలని నిర్ణయించింది. అలాగే ఖైరతాబాద్ జోన్ లోని కేబీఆర్ రౌండ్ పార్క్ వద్ద 6 కిలో మీటర్లు తాత్కాలికంగా, ఓయూ కాలనీ జంక్షన్ సెన్సార్ వ్యాలీ రోడ్ నంబర్ 82 నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 జూబ్లీహిల్స్ రోడ్డు లిమిట్ వరకు 6 కిలోమీటర్లు, శేరిలింగంపల్లి జోన్ లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, ఐకియా నుంచి బయోవర్సిటీ రాయదుర్గం వరకు 6 కిలో మీటర్లు, కొంత భాగం పర్మినెంట్, తాత్కాలికంగా ట్రాక్‌లు, ఖాజా గూడ జంక్షన్ నుంచి కేర్ హాస్పిటల్ వరకు, లింక్ రోడ్డు నుంచి ఖాజా గూడ రోడ్డు 6 కిలో మీటర్లు, కూకట్ పల్లి ఐడీఎల్ చెరువు నుంచి జేఎన్ టీయూ రెయిన్ బో విస్టా నుంచి ఐడీఎల్ చెరువు వరకు 10 కిలో మీటర్లు, బాలానగర్ వద్ద 25 కిలో మీటర్లు తాత్కాలికంగా ట్రాక్‌లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్ జోన్ లోని మెట్టుగూడ క్రాస్ రోడ్డు నుంచి హబ్సిగూడ క్రాస్ రోడ్డు వరకు 4 కిలోమీటర్లు, బుద్ధ భవన్ నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వయా నెక్లెస్ రోడ్డు 6 కిలోమీటర్లు మేర పర్మినెంట్ ట్రాక్వేయాలని నిర్ణయించింది. ఇంతవరకు పనులు మొదలుపెట్టలేదు.
ఏర్పాటు చేసి కఠినంగా వ్యవహరించాలి
విదేశాల్లో సైక్లింగ్ ట్రాక్‌లకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు. మన దగ్గర మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు. సిటీలో కొన్నిచోట్ల ఏర్పాటు చేసినప్పటికీ ఉపయోగపడడం లేదు. సైక్లింగ్ట్రాక్మీద నుంచి కార్లు, బైక్‌లు వెళ్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. విదేశాల్లో ట్రాక్మీదికి ఇతర వెహికల్స్ వస్తే ఫైన్ వేయడంతోపాటు కఠిన చర్యలు తీసుకుంటారు. ఇక్కడ కూడా అదే విధంగా వ్యవహరించాలి.
- ఖాసీం ఖాన్, సిటిజన్
సైక్లింగ్ ట్రాక్ లు ఉండాలి
ఇంత పెద్ద సిటీలో సైక్లింగ్‌ట్రాక్ లు తప్పనిసరిగా ఉండాలి. ఏర్పాటు చేసిన చోట ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని సైక్లింగ్ట్రాక్ల పైకి ఇతర వెహికల్స్రాకుండా చర్యలు తీసుకోవాలి. ట్రాక్‌లు ఏర్పాటు చేసే ముందే రోడ్ల విస్తరణ చేపట్టాలి.
- సుదర్శన్, ప్రైవేట్ ఎంప్లాయ్