నేపాల్ నార్మల్ ! నెమ్మదిగా సాధారణ పరిస్థితులు.. సుశీల కర్కీ ప్రభుత్వంపై ప్రజల ఆశలు

నేపాల్ నార్మల్ ! నెమ్మదిగా సాధారణ పరిస్థితులు.. సుశీల కర్కీ ప్రభుత్వంపై ప్రజల ఆశలు
  • పలుచోట్ల ఇప్పటికీ కర్ఫ్యూ కొనసాగింపు
  • సుశీల కర్కీ ప్రభుత్వంపై ప్రజల ఆశలు
  • వచ్చే మార్చి 5న ఎన్నికలు నిర్వహిస్తామన్న ప్రెసిడెంట్

ఖాట్మండు: ఐదు రోజుల పాటు అట్టుడికిన నేపాల్​లో తాజా గా ఉద్రిక్తతలు చల్లారుతున్నాయి. అల్లర్లు, ఆందోళనలు సద్దుమణిగాయి. క్రమంగా సాధారణ పరిస్థితి నెలకొంటోంది. అల్లర్ల కారణంగా 51 మంది చనిపోయారు. దేశంలో శాంతి నెలకొంటున్నది. శనివారం షాపులు తెరుచుకున్నాయి. తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సుశీల కర్కీ.. ఘర్షణలో గాయపడిన వారిని, నష్టపోయిన బాధితులను పరామర్శించారు. శనివారం బిర్గంజ్ ప్రాంతంలో కర్ఫ్యూ కొంచెం సడలించడంతో షాపులు తెరుచుకున్నాయి. వాహనాలు రోడ్డెక్కాయి. మెల్లగా రొటీన్ ​లైఫ్ మళ్లీ మొదలైంది. ఈ గొడవల వల్ల నేపాల్​లో హోటళ్లకు 25  బిలియన్ రూపాయల నష్టం వాటిల్లింది. టూరిజం ప్రధాన ఆదాయంగా ఉన్న నేపాల్ ఆర్థిక వ్యవస్థకు ఈ పరిణామం భారీ ఎదురుదెబ్బగా మారింది.

అవినీతి లేని ప్రభుత్వం కావాలి
జెన్​ జెడ్​నడిపిన ఈ ఆందోళనలు దేశంలో ప్రబలిన అవినీతికి వ్యతిరేకంగా మొదలయ్యాయని ఒక యువకుడు మీడియాకు చెప్పాడు. ‘‘అవినీతి లేని ప్రభుత్వం కావాలి. కొత్త ప్రధాని సుశీల కర్కీ కొత్త చట్టాలు తీసుకొచ్చి, రాజకీయ నేతల ఆస్తులు లెక్కించి, చట్టపరంగా చర్యలు తీసుకుంటారు” అని ఆశాభావం వ్యక్తం చేశారు. 

మరో యువకుడు మాట్లాడుతూ మాజీ ప్రధాని ఒలీని అవినీతికి పెద్దన్న అని ఆరోపించారు. పాత రాజకీయ నాయకులు అందర్నీ జైలుకు పంపాలని, పార్లమెంట్​ను కూడా రద్దు చేయాలని  అన్నాడు. ‘‘కర్ఫ్యూ వల్ల చాలా నష్టపోయాం. కానీ కర్కీ ప్రధానిగా మారడంతో మంచి మార్పులు వస్తాయని ఆశిస్తున్నం” అని షాపుల యజమానులు అన్నారు. ఖాట్మండు నుంచి సైన్యం తిరిగి వెనక్కి వెళ్లి, పోలీసులకు బాధ్యతలు అప్పగించింది.  ట్రాఫిక్  పోలీసులు కూడా విధుల్లో చేరారు.

నేడు మంత్రి మండలి ఏర్పాటు
ప్రెసిడెంట్ రామ్ చంద్ర పౌడెల్ శుక్రవారం అసెంబ్లీని రద్దు చేశారు. మార్చి 5న ఎన్నికలు నిర్వహించనున్నట్టు చెప్పారు. సుశీల కర్కీ సలహాతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. ఆదివారం చిన్న మంత్రి మండలి ఏర్పాటు చేస్తారు. హోమ్, విదేశాంగ, రక్షణ శాఖ సహా 24 శాఖలు కార్కీ ఆధీనంలో ఉంటాయి. ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) కాలిపోయినందున, హోంశాఖ భవనానికి పీఎంవోను మార్చారు.

చదువులు మారాలి, ఉద్యోగాలు ఇవ్వాలి
‘‘ ఇక్కడ చదువుకున్న వారితో పాటు విదేశాల్లో చదువుకున్న వారికి కూడా ఇక్కడే ఉద్యోగాలు దొరకాలి. అప్పుడు మన నేపాల్ త్వరగా అభివృద్ధి చెందుతుంది’’ అని యువకులు అంటున్నారు. అలాగే దేశంలో చదువుల తీరు మారాలని కోరుతున్నారు. “దేశంలో అవినీతికి మనమే కారణం, మనమే ఓటు వేసి వాళ్లను ఎన్నుకున్నం. ఇక మళ్లీ అలాంటి తప్పు చేయబోం’’ అని అన్నారు. మంత్రులందరి ఇండ్లలో కాలిన నోట్లు దొరికాయని.. వాళ్లు విపరీతంగా దోచుకున్నారని ఆరోపించారు. సుశీల కర్కీ దేశ పరిస్థితులను చక్కదిద్దుతారని.. నేపాల్ భవిష్యత్తును మెరుగు పరుస్తారని జెన్ జెడ్​ యువత ఆశిస్తున్నారు.

మరిన్ని వార్తలు