
- సోషల్ మీడియా యాప్స్ నిషేధంపై భగ్గుమన్న యువత
- ఖాట్మండు సహా అనేక చోట్ల నిరసనలు హింసాత్మకం
- కొంతకాలంగా కేపీ శర్మ ఓలి సర్కారు అవినీతిపై యువత ఆగ్రహం
- ‘జన్ జడ్ రెవల్యూషన్’ పేరుతో ఆన్లైన్లో ఉద్యమం
- ఫేస్బుక్, వాట్సాప్ సహా 26 యాప్స్‌పై సర్కారు బ్యాన్‌తో తిరుగుబాటు
- పార్లమెంట్ భవనం ముట్టడి.. కాల్పులు జరిపిన పోలీసులు
- దేశవ్యాప్తంగా నిరసనల నేపథ్యంలో హోం మంత్రి రాజీనామా
- దిగొచ్చిన సర్కార్.. బ్యాన్ ఎత్తివేత
ఖాట్మండు: నేపాల్లో పలు సోషల్ మీడియా యాప్‌లను ప్రభుత్వం బ్యాన్ చేయడాన్ని నిరసిస్తూ వేలాది మంది యువత సోమవారం ఉదయం చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఖాట్మండులోని వివిధ ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఖాట్మండులో జరిగిన కాల్పుల్లో 17 మంది, సన్సారి జిల్లాలో జరిగిన ఫైరింగ్ లో ఇద్దరు నిరసనకారులు చనిపోయారని పోలీసులు ప్రకటించారు. దాదాపు 347 మంది గాయపడ్డారని వెల్లడించారు. పొఖారా, బట్వాల్, భైరహవా, భరత్ పూర్, ఇటహరి, దమక్ ప్రాంతాలకు కూడా నిరసనలు వ్యాపించాయని తెలిపారు. అయితే, ఆందోళనల సందర్భంగా పార్లమెంట్ భవనం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పార్లమెంట్ ముట్టడికి యత్నించిన ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో బ్యారికేడ్లను తోసుకుంటూ ముందుకు దూసుకెళ్లిన ఆందోళనకారులు పార్లమెంట్ భవనం మొదటి గేటుకు నిప్పు పెట్టారు.
ఈ సందర్భంగా పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఆందోళనకారులను అణచేసేందుకు పోలీసులు కాల్పులు జరపడంతో అనేక మందికి బుల్లెట్ గాయాలయ్యాయి. గాయపడిన వారిని వివిధ ఆస్పత్రులకు తరలించగా, వారిలో 19 మంది చికిత్స పొందుతూ మరణించారు. ఆందోళనకారుల దాడిలో పోలీసులకు కూడా గాయాలయ్యాయి. ఖాట్మండులో పార్లమెంట్ తోపాటు అనేక ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో ప్రభుత్వం కర్ఫ్యూ ప్రకటించింది. మిలిటరీ బలగాలను మోహరించింది. భారత సరిహద్దులోనూ కర్ఫ్యూ విధించింది.
అవినీతికి వ్యతిరేకంగా ‘జన్ జడ్ రెవల్యూషన్’..
నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి ప్రభుత్వ అవినీతి, బంధుప్రీతికి వ్యతిరేకంగా జనరేషన్ జడర్స్ (1996 నుంచి 2010 మధ్య పుట్టినవారు) కొద్దిరోజులుగా ‘జన్ జడ్ రెవల్యూషన్’ పేరుతో మార్పు కోసం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తున్నారు. దీనికితోడు గురువారం వాట్సాప్, ఫేస్ బుక్, ఎక్స్, యూట్యూబ్ వంటి 26 సోషల్ మీడియా యాప్స్‌ను సర్కారు బ్యాన్ చేయడంతో జనరేషన్ జడ్ యువత సోమవారం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. వీరికి జనరేషన్ వై (మిలీనియల్స్: 1981 నుంచి 1996 మధ్య పుట్టినవారు) యువత కూడా జత కలిశారు.
టిక్ టాక్, రెడిట్ వంటి ప్రత్యామ్నాయ సోషల్ మీడియా వేదికల ద్వారా సమాచారం పంచుకున్న వేలాది మంది యువతీయువకులు ఖాట్మండులో భారీ ఆందోళనలు చేపట్టారు. ఉదయం నుంచే యువత జాతీయ జెండాలు చేతపట్టి, జాతీయ గీతం ఆలపిస్తూ వీధుల్లో కదం తొక్కారు. ఎక్కువమంది స్కూల్, కాలేజీ యూనిఫాంలు ధరించి, ప్లకార్డులతో నిరసన ర్యాలీల్లో పాల్గొన్నారు. ‘సోషల్ మీడియాను కాదు.. కరప్షన్‌ను షట్ డౌన్ చేయండి’, ‘సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తేయాలి’ అని నినాదాలు చేశారు. ప్రభుత్వంలో జవాబుదారీతనం, మార్పు రావాలని డిమాండ్ చేశారు.
సోషల్ మీడియాపై బ్యాన్ ఎందుకు?
నేపాల్లో సేవలు అందించే సోషల్ మీడియా కంపెనీలు మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, ఐటీ శాఖ వద్ద రిజిస్టర్ చేసుకోవాలని కేపీ శర్మ ఓలి సర్కారు ఇదివరకే ఆదేశించింది. టిక్ టాక్ తోపాటు మరికొన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ మాత్రమే దరఖాస్తు చేసుకున్నాయి. దీంతో వాటిని మినహాయించి మిగతా 26 యాప్స్‌ను ప్రభుత్వం గురువారం బ్యాన్ చేసింది. దేశంలో సేవలు అందించే యాప్స్ దేశ సార్వభౌమత్వాన్ని గౌరవించాలని, దేశాన్ని తక్కువ చేసి చూపిస్తే.. ఉపేక్షించేదిలేదని ప్రధాని ఓలి హెచ్చరించారు. కాగా, రూల్స్ పాటించని కారణంగానే సోషల్ మీడియా యాప్‌లపై బ్యాన్ విధించామని.. కానీ భావప్రకటన స్వేచ్ఛను హరించేందుకే బ్యాన్ చేసినట్టు తప్పుడు ప్రచారం జరగడం వల్లే నిరసనలు వెల్లువెత్తాయని ప్రభుత్వం తెలిపింది.
ఆందోళనల నేపథ్యంలో బ్యాన్ ఎత్తివేత..
ఖాట్మండులో నిరసనలు హింసాత్మకం కావడం, దేశవ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొనడంతో ప్రధాని కేపీ శర్మ ఓలీ బ్యాన్ ఎత్తివేశారు. ఈమేరకు తన అధికారిక నివాసంలో నిర్వహించిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.అంతకు ముందు హోంమంత్రి రమేశ్ లేఖక్, ఆర్థిక మంత్రి బిష్ణు పౌడెల్, విదేశాంగ మంత్రి అర్జు రాణా దేవుబా, రక్షణ మంత్రి మన్ బీర్ రాయ్, ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్దెల్, ఉన్నతాధికారులతో ప్రధాని ఓలి సమీక్ష చేపట్టారు. ఈ సమావేశం తర్వాత రమేశ్ లేఖక్ తన పదవికి రాజీనామా చేశారు. నిరసనలు హింసాత్మకంగా మారడం, ఖాట్మండు సహా ఇతర సిటీలకూ వ్యాపించడంతో నైతిక బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకున్నారు.