
న్యూఢిల్లీ: 2038 నాటికి నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ లెవెల్‌కు చేరుకోవాలని టార్గెట్‌గా పెట్టుకున్నామని, ఇందుకోసమే ఎనర్జీ ట్రాన్సిషన్ ప్రాజెక్టులలో 2030 దాకా రూ. లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని ఓఎన్జీసీ చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ సోమవారం వెల్లడించారు. ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడక్షన్లో దేశంలోనే ఓఎన్జీసీ నెంబర్1 గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ రంగ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), హిందుస్థాన్ పెట్రోలియమ్ కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్), గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్), భారత్ పెట్రోలియమ్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)లు ఇప్పటికే నెట్ జీరో ఎమిషన్స్ కోసం ప్లాన్స్‌ను ప్రకటించాయి.
ఇప్పుడు ఈ జాబితాలో ఆయిల్ అండ్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓన్జీసీ) కూడా చేరింది. నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ సాధించే దిశలో ఇంటర్నల్‌గా చర్చలు జరిపి ప్లాన్స్ రూపొందించుకున్నట్లు అరుణ్ కుమార్ సింగ్ చెప్పారు. 2038 నాటికి దశలవారీగా తాము పెట్టుకున్న టార్గెట్స్‌ను సాధించగలమనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. రెన్యువబుల్ సోర్సెస్ ద్వారా విద్యుత్ ప్రొడక్షన్‌ను ఇప్పుడున్న 189 మెగా వాట్ల నుంచి 1 గిగావాట్‌కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ లక్ష్యాన్ని 2030 నాటికి అందుకుంటామని అన్నారు. రాజస్థాన్‌లో 5 గిగావాట్ల ప్రాజెక్టు ఒకటి చూస్తున్నామని, ఇలాంటివే మరికొన్ని ప్రాజెక్టులనూ పరిశీలిస్తున్నామని సింగ్ వెల్లడించారు. ఆఫ్‌షోర్ విండ్‌ఫార్మ్స్ ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉందని చెప్పారు. పై ప్రాజెక్టులన్నింటికీ కలిపి రూ. లక్ష కోట్ల దాకా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.
మంగుళూరు వద్ద ఏడాదికి మిలియన్ టన్నుల కెపాసిటీ ఉండే గ్రీన్ అమ్మోనియా ప్లాంట్‌ను కూడా ఓఎన్జీసీ ఏర్పాటు చేయనుంది. 2022–23 లో ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడక్షన్‌ను కంపెనీ పెంచుకోగలిగింది. ఈ అప్ ట్రెండ్‌ను కొనసాగించాలని కంపెనీ పనిచేస్తోంది. తూర్పు, పశ్చిమ తీరాలలోని ప్రాజెక్టులలో ప్రొడక్షన్ పెంచుకోవడంతోపాటు, కొత్త ప్రాజెక్టులనూ చేపట్టడం వల్లే అప్‌ట్రెండ్ సాధ్యమవుతోంది. 14 డెవలప్మెంట్, 9 ఇన్ఫ్రా ప్రాజెక్టులలో కలిపి మొత్తం రూ. 61,200 కోట్లను ఓఎన్జీసీ పెట్టుబడులుగా పెడుతోంది.