Twitter : ట్రెండింగ్ లో తారకరత్న ..విషమంగా ఆరోగ్యం

Twitter : ట్రెండింగ్ లో తారకరత్న ..విషమంగా ఆరోగ్యం

నందమూరి తారకరత్న.. ఈ పేరు ఇప్పుడు ఎక్కడ చూసినా వినిపిస్తోంది. ఏ ఇద్దరి కలిసినా తారకరత్న గురించే చర్చించుకుంటున్నారు. తారకరత్న ఆరోగ్యం ఎలా ఉంది..? ఏ ఆస్పత్రిలో ఆయనకు ట్రీట్ మెంట్ అందిస్తున్నారు..? కోలుకుంటున్నాడా..? అనే సందేహాలు రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 

తారకరత్న.. మాజీ ముఖ్యమంత్రి నందమూరి రామారావు (ఎన్టీఆర్) కుమారుడు మోహనకృష్ణ కుమారుడు. తారకరత్న సినిమాల్లో నటించినా పెద్దగా హిట్స్ అందుకోలేదు. ఆయన బాబాయ్ బాలకృష్ణ, అన్నదమ్ములు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కు ఉన్నంత క్రేజ్ ఇండస్ట్రీలో లేదు. తక్కువ సినిమాలు చేసినా ఆయనకంటూ ఓ ప్రత్యేక స్థానం మాత్రం సంపాదించుకున్నారు. 

చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న ఉన్నట్టుండి అనారోగ్యానికి గురయ్యారు. పాదయాత్రలోనే స్పృహ తప్పి కింద పడిపోవడంతో వెంటనే ఆయన్ను కుప్పంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన ట్రీట్ మెంట్ కోసం ఆ తర్వాత బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం ఆయనకు డాక్టర్లు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. కానీ, ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని తెలుస్తోంది. కుటుంబ సభ్యులు కూడా ఆస్పత్రిలో ఉన్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నారు. 

గుండెపోటుకు గురైన తారకరత్న గురించి సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం ఎలా ఉంది..? ఏ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు..? వంటి విషయాలపై సెర్చ్ చేస్తున్నారు. అంతేకాదు.. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ట్విట్స్ చేస్తున్నారు. తారకరత్న త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థిస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. 
తారకరత్న గురించి సెర్చ్ చేస్తుండడంతో ఆయన పేరు ట్విట్టర్ లో ట్రెండింగ్ లో నిలిచింది. తారకరత్న త్వరగా కోలుకోవాలంటూ 17.9Kలకు మందికిపైగా ట్వీట్స్ చేశారు.