స్టార్టప్‌కు టోపి! 

స్టార్టప్‌కు టోపి! 

బిజినెస్‌‌‌‌ డెస్క్‌‌, వెలుగు: గతంలో ఎప్పుడూ విని ఉండరు. ఐపీఓ  ప్రాసెస్‌‌లో సాయపడుతుందని నియమించుకున్న కంపెనీనే ఓ స్టార్టప్‌‌ కంపెనీకి  టోకరా పెట్టింది.  పబ్లిక్ ఇష్యూ ద్వారా సేకరించిన డబ్బులతో ఉడాయించింది. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఐపీఓ ద్వారా సేకరించిన ఫండ్స్‌‌ను అకౌంట్ల నుంచి మర్చంట్ బ్యాంకర్ ఫాస్ట్‌‌ ట్రాక్ ఫిన్‌‌సెక్‌‌   దారి మళ్లించిందని  జైపూర్‌‌‌‌కు చెందిన ట్రెక్కింగ్‌‌టోస్‌‌ డాట్ కామ్‌‌ ఎక్స్చేంజి ఫైలింగ్‌‌లో పేర్కొంది. ఈ కంపెనీ ఐపీఓకి 2020 ఆగస్ట్‌‌లో వచ్చింది. రూ. 4.54 కోట్లను ఐపీఓ ద్వారా సేకరించగలిగింది. ఫాస్ట్‌‌ ట్రాక్‌‌ ఫిన్‌‌సెక్‌‌, ఈ కంపెనీ మాజీ డైరెక్టర్‌‌, ప్రస్తుతం‌‌ జీవైఆర్ క్యాపిటల్‌‌లో ఇండిపెండెంట్‌‌గా డైరెక్టర్‌‌‌‌గా చేస్తున్న అభిషేక్‌‌ విజయ్‌‌ శర్మ,  డైరెక్టర్ మోహిత్ బైడ్‌‌, మరో ముగ్గురిపైన సెబీ వద్ద ట్రెక్కింగ్‌‌టోస్‌‌ ఫిర్యాదు చేసింది. 

అసలు ఏం జరిగిందంటే..?

ట్రెక్కింగ్‌‌టోస్ ప్రకారం, ఐపీఓకి వెళ్లడం ద్వారా ఫండ్స్ సేకరించాలని కంపెనీ  ఫౌండర్లు సహీల్‌‌ అగర్వాల్‌‌, సాగర్‌‌‌‌ అగర్వాల్‌‌లకు  సెబీ దగ్గర రిజిస్టర్ అయిన మర్చంట్ బ్యాంకర్‌‌‌‌ ఫాస్ట్‌‌ ట్రాక్‌‌ ఫిన్‌‌సెక్‌‌ సలహాయిచ్చింది.  ఇందుకోసం సాయం చేస్తామని నమ్మించింది. ఐపీఓ ద్వారా సేకరించిన ఫండ్స్‌‌లో కేవలం రూ. 40–45 లక్షలు మాత్రమే ఖర్చు చేయడానికి వీలుకలిపించేలా, మిగిలిన ఫండ్స్‌‌ను ఇతర కంపెనీల్లో ఇన్వెస్ట్‌‌ చేసేలా ఇష్యూ అగ్రిమెంట్‌‌ను ఫాస్ట్‌‌ ట్రాక్ ఫిన్‌‌సెక్‌‌ కుదిర్చింది.  రూ. 4 కోట్లను ఇతర కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయాలని పైన పేర్కొన్న ఇన్వెస్ట్‌‌మెంట్ బ్యాంకర్ ప్రమోటర్లను ఒప్పించిందని ట్రెక్కింగ్‌‌టోస్ పేర్కొంది. మరోవైపు ట్రెక్కింగ్‌‌టోస్‌‌ ఇన్వెస్ట్ చేసిన లేదా అప్పులిచ్చిన డబ్బులు తిరిగి వడ్డీతో సహా వసూలు అవుతాయని, అగ్రిమెంట్ ప్రకారం, ఇవి సెక్యూర్డ్‌‌గా ఉన్నాయని ఫాస్ట్‌‌ ట్రాక్ ఫిన్‌‌సెక్ చెబుతోంది. 

నష్టపోయింది ఇన్వెస్టర్లే..

ఐపీఓ ఫండ్స్‌‌ను ట్రెక్కింగ్‌‌టోస్‌‌ నాలుగు కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. ఈ నాలుగు కంపెనీలను కూడా ఫాస్ట్‌‌ ట్రాక్‌‌ ఫిన్‌‌సెక్ షార్ట్‌‌లిస్ట్ చేసిందని ట్రెక్కింగ్‌‌టోస్‌‌ ఆరోపిస్తోంది. ఇందులో రెండు కంపెనీలు స్వర్ణసిద్ధి, ఓపీసీఎల్‌‌కు ఎటువంటి సెక్యూరిటీ లేకుండానే లోన్‌‌ ఇచ్చేందుకు అగ్రిమెంట్‌‌ను కుదుర్చుకుంది. తర్వాత ఈ రెండు కంపెనీలు డొల్లా కంపెనీలుగా తెలిసిందని ట్రెక్కింగ్‌‌టోస్ చెబుతోంది. మరో రెండు కంపెనీలలో బాండ్లను కొనేందుకు  ఇన్వెస్ట్ చేసింది. ఈ రెండు కంపెనీలు కూడా ఫాస్ట్‌‌ ట్రాక్ ఫిన్‌‌సెక్‌‌ రికమండ్ చేసిందని, అగ్రిమెంట్ తర్వాత ఈ కంపెనీల జాడే లేదని ఆరోపిస్తోంది.   తమ షేర్లు లిస్టింగ్ టైమ్‌‌లోనూ పైన పేర్కొన్న మర్చంట్ బ్యాంకర్‌‌ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదని చెబుతోంది. ఫాస్ట్‌‌ ట్రాక్‌‌ ఫిన్‌‌సెక్‌‌ సెబీ నుంచి మొట్టుకాయలు కాయడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో వేరు వేరు సందర్భాల్లో ఈ కంపెనీపై సెబీ పెనాల్టీ విధించింది.