మూడేండ్లుగా కొనసాగుతున్న కొత్త కలెక్టరేట్ పనులు

మూడేండ్లుగా కొనసాగుతున్న కొత్త కలెక్టరేట్ పనులు

మంచిర్యాల,వెలుగు: రాష్ర్టంలో ముందస్తు ఎన్నికల హడావుడి నేపథ్యంలో సీఎం కేసీఆర్​ జిల్లాల టూర్లు షురూ చేశారు. చాలా రోజుల తర్వాత ఆయన కొత్త కలెక్టరేట్ల ఓపెనింగ్​, ఇతర డెవలప్​మెంట్​ వర్క్స్​ పేరిట క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నారు. ఇటీవల పలు జిల్లాల్లో కలెక్టరేట్లను ప్రారంభించిన కేసీఆర్​ ఈ నెలలో మరో మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. నస్పూర్​లో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్​ కలెక్టరేట్​ బిల్డింగ్​ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో కేసీఆర్​ పర్యటన ఎప్పటికప్పుడు వాయిదా పడుతున్నట్టు సమాచారం. ఈ పనులు ఎప్పుడు అవుతాయో, కేసీఆర్​ ఎప్పుడొస్తారో, ఏమేమి వరాలు ఇస్తారో అని జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. 

మార్చి నాటికి పూర్తయ్యేనా...? 

కలెక్టరేట్​ బిల్డింగ్​ పనులపై అధికారులు ఆది నుంచి నిర్లక్ష్యం వహిస్తున్నారన్న విమర్శలున్నాయి. 2019లో పనులను ప్రారంభించగా, నిధుల కొరత, స్థలంపై కోర్టు కేసులు, కొవిడ్​ లాక్​డౌన్​ తదితర కారణాలతో నత్తనడకన కొనసాగుతున్నాయి. అగ్రిమెంట్​ అయినప్పటి నుంచి ఏడాదిలోగా పూర్తి చేయాల్సి ఉండగా, మూడేండ్లు దాటినా కొలిక్కి రాకపోవడం చూస్తే కాంట్రాక్టర్​, అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతుంది. దీంతో ఎప్పటికప్పుడు గడువులు పొడిగించుకుంటూ పోతున్నారు. ఇటీవల మరో మూడు నెలలు అంటే ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు డెడ్​లైన్​ విధించారు. 26.24 ఎకరాల విస్తీర్ణంలో రూ.50 కోట్లతో ఇంటిగ్రేటెడ్​ కలెక్టరేట్​ నిర్మిస్తున్నారు. జీ+2 పద్ధతిలో నిర్మిస్తుండగా ఇప్పటివరకు గ్రౌండ్​ ఫ్లోర్​ 90 శాతం, ఫస్ట్​ ఫ్లోర్​ 80 శాతం, సెకండ్​ ఫ్లోర్​ 70 శాతం పనులు జరిగాయి. కలెక్టర్​ క్యాంప్​ ఆఫీస్​ పనులు హడావుడిగా పూర్తి చేసి కిందటి నెలలో షిఫ్ట్​ చేశారు. ప్రస్తుతం ఫ్లోరింగ్​, సీలింగ్​, ఎలక్ర్టిఫికేషన్​, రోడ్లతో పాటు ఇతర పనులు నడుస్తున్నాయి. ఈ వర్క్స్​ పూర్తికావడానికి మరో నాలుగైదు నెలల టైమ్​ పడుతుందని పేర్కొంటున్నారు.  

వరదలు ముంచెత్తినా కన్నెత్తి చూడలే... 

నిరుడు జూలైలో గోదావరికి భారీ వరదలు రావడంతో మంచిర్యాల జిల్లా అతలాకుతలమైంది. గోదావరి పరివాహక ప్రాంతాలన్నీ నీటమునిగాయి. జిల్లాకేంద్రంలోని 15 కాలనీలు వారం రోజులపాటు నీళ్లలోనే ఉన్నాయి. జన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్, నస్పూర్, జైపూర్, చెన్నూర్, కోటపల్లి మండలాల్లోని 40 గ్రామాలను వరదలు చుట్టుముట్టాయి. వేల ఎకరాల్లో పత్తి, మిర్చి పంటలు మునిగిపోయి రైతులు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారు. రోడ్లు, కరెంట్​ లైన్లు పెద్ద సంఖ్యలో ధ్వంసం కావడంతో కోట్లలో నష్టం వాటిల్లింది. సీఎం కేసీఆర్​ ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు రూ.10 వేల ఆర్థికసాయం ప్రకటించారు. జిల్లా ప్రజలు సైతం సీఎం రాక కోసం ఎదురుచూసినప్పటికీ ఆయన కనీసం ఇటువైపు తొంగిచూడలేదు. మిగతా జిల్లాల్లో మాదిరిగా ఇక్కడ ముంపు బాధితులకు తక్షణ సాయం కూడా అందించలేదు. అగ్రికల్చర్​ ఆఫీసర్లు పంట నష్టాన్ని సర్వేచేసి గవర్నమెంట్​కు రిపోర్ట్​ ఇచ్చినా పరిహారం ఊసే లేకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.

ఐదేండ్లుగా ఎదురుచూపులు...  

సీఎం కేసీఆర్​ గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మినహాయిస్తే చివరిసారిగా 2018లో జిల్లాలో పర్యటించారు. ఫిబ్రవరి 27న శ్రీరాంపూర్​లోని ప్రగతి స్టేడియంలో నిర్వహించిన సింగరేణీయుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్​ గెలిచిన తర్వాత ఈ మీటింగ్​ ఏర్పాటు చేశారు. ఆరు కొత్త మైన్స్​ను ప్రారంభించడంతో పాటు సింగరేణి కార్మికుల సంక్షేమానికి అనేక హామీలు ఇచ్చారు. సింగరేణి వ్యాప్తంగా విశాలమైన డబుల్​ బెడ్​రూమ్​ క్వార్టర్ల నిర్మాణం, ఇల్లు కట్టుకోవడానికి రూ.10 లక్షల వడ్డీ లేని రుణం, ఏసీలకు ఫ్రీ కరెంట్​ సప్లై, కార్మికుల పిల్లలకు డిపెండెంట్​ జాబ్స్​ తదితర వాగ్ధానాలు చేశారు. ఇక మంచిర్యాల – అంతర్గాం గోదావరి బ్రిడ్జి, లక్ష్మీ టాకీస్​ చౌరస్తా నుంచి రాజీవ్​నగర్ వైపు ఆర్వోబీ, ఐబీ చౌరస్తా నుంచి కుర్మపల్లి వరకు ఫోర్​లేన్​ నిర్మిస్తామని పేర్కొన్నారు. సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీల్లో కొన్ని పాక్షికంగా అమలు కాగా, గోదావరి బ్రిడ్జికి ఇటీవలే టెండర్లు పూర్తయ్యాయి. మిగిలిన పనులకు మోక్షం కలగకపోవడంతో ప్రజలు నిరాశ చెందుతున్నారు.