
న్యూఢిల్లీ: ఆధార్ సేవలను మరింత సులువుగా పొందడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా క్యూఆర్ కోడ్- ఆధారిత ఈ-–ఆధార్ వ్యవస్థను ప్రవేశపెట్టనుంది. దీని ద్వారా ప్రజలు తమ గుర్తింపును డిజిటల్‌గా ధ్రువీకరించుకోవచ్చు. ఫిజికల్ ఆధార్ కార్డు కాపీలను తీసుకెళ్లాల్సిన, సమర్పించాల్సిన అవసరం ఉండదు.
ఇప్పటికే ఉన్న లక్ష ఆధార్ వెరిఫికేషన్ పరికరాలలో సుమారు 2,000 పరికరాలను క్యూఆర్ కోడ్- ఆధారిత వ్యవస్థకు అనుకూలంగా మార్చారు. కొత్త వ్యవస్థ అమలులోకి వచ్చిన తర్వాత, క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా తక్షణమే గుర్తింపు వెరిఫికేషన్ చేయవచ్చు. క్యూఆర్ కోడ్ అప్‌గ్రేడ్‌తో పాటు, యూఐడీఏఐ కొత్త మొబైల్ యాప్‌ను కూడా ప్రారంభించనుంది.
ఈ యాప్ ద్వారా వినియోగదారులు తమ మొబైల్ ఫోన్ల నుంచే పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి వివరాలను మార్చుకోవచ్చు. దీని వల్ల ఆధార్ నమోదు కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. ఫింగర్‌ప్రింట్, ఐరిస్ స్కాన్‌ల వంటి బయోమెట్రిక్ వెరిఫికేషన్లకు మాత్రమే ఆధార్ నమోదు కేంద్రాలకు వెళ్లాలి. మిగిలిన అన్ని మార్పులను యాప్ ద్వారా డిజిటల్‌గా చేసుకోవచ్చని యూఐడీఏఐ తెలిపింది.
డాక్యుమెంట్ల వెరిఫికేషన్ ఈజీ
క్యూఆర్‌కోడ్ వ్యవస్థ ప్రభుత్వ డేటాబేస్‌ల నుంచి నేరుగా సమాచారాన్ని సేకరిస్తుంది. పుట్టిన సర్టిఫికెట్లు, పాన్ కార్డులు, పాస్‌పోర్ట్‌లు, డ్రైవింగ్ లైసెన్స్‌లు, రేషన్ కార్డులు, ఎంఎన్ఆర్ఈజీఏ రికార్డులు, కరెంట్ బిల్లుల ఆధారంగా చిరునామా వెరిఫికేషన్ జరుగుతుంది. ఇది గుర్తింపు మోసాలను తగ్గించి, ఆధార్ వెరిఫికేషన్‌ను సురక్షితంగా, సులభంగా ఉండేలా చేస్తుంది. దీని వల్ల వ్యక్తుల అనుమతితో మాత్రమే వారి వ్యక్తిగత సమాచారం షేర్ అవుతుంది.
ఈ వ్యవస్థను ఇప్పటికే సబ్-–రిజిస్ట్రార్ కార్యాలయాలు, హోటళ్లలో పరీక్షిస్తున్నారు. స్కూల్ స్టూడెంట్ల కోసం బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ డ్రైవ్‌లను నిర్వహించడానికి యూఐడీఏఐ, సీబీఎస్ఈ వంటి ఎడ్యుకేషన్ బోర్డులతో కలసి పనిచేస్తోంది. ఐదు నుంచి ఏడేళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు, 15 నుంచి 17 సంవత్సరాల మధ్య ఉన్న వారికి బయోమెట్రిక్ అప్‌డేట్ తప్పనిసరి.