అప్పుల తెలంగాణ.. కొత్త సర్కారుకు సవాళ్లు

అప్పుల తెలంగాణ..  కొత్త సర్కారుకు సవాళ్లు

తెలంగాణ శాసనసభ ఎన్నికలు 30 నవంబర్ నాడు ముగుస్తాయి. కొత్త ప్రభుత్వం డిసెంబర్ 4 తర్వాత ఏర్పడే అవకాశం ఉంది. గత పదేండ్ల పాలన మీద వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ విషయం అధికార బీఆర్ఎస్​ పార్టీ నేతలకు అర్థం అయ్యి ఉండవచ్చు. ప్రభుత్వ వ్యతిరేకత పెద్దయెత్తున ఉన్నందున వారు తిరిగి అధికారంలోకి వచ్చినా పాలనలో మార్పులు చేయక తప్పదు. ఒకవేళ కాంగ్రెస్  పార్టీ అధికారంలోకి వచ్చినా మార్పులు చేయాల్సిందే. 

మూడు ప్రధాన పార్టీల మేనిఫెస్టోల్లో ఎన్నికల హామీలను నిశితంగా పరిశీలిస్తే వాటి మధ్య చెప్పుకోదగిన విధంగా పెద్దగా విధానపరమైన తేడాలు లేవు. అన్నింటా సంక్షేమం ముందు పెట్టుకుని ప్రకటించిన హామీలే.  కాగా, అధికార పార్టీ ఎక్కడా విధానపర మార్పులకు సంకేతం ఇవ్వలేదు. పార్టీ నాయకుల మాటలలో కూడా అవి ప్రస్ఫుటం కాలేదు.  ప్రతి విమర్శలు తప్పితే, అధికార పార్టీ తాము అనుసరించిన విధానాలను ప్రచారంలో వాడుకోలేకపోయింది. కొన్ని పథకాల గురించి గోల తప్పితే తెలంగాణ అభివృద్ధి మీద సాపేక్షంగా చెప్పుకునే పరిస్థితిలో అధికార బీఆర్ఎస్​ పార్టీ లేదు. కాలగతి తప్పిన ఆర్థిక ప్రమాణాలను గొప్ప, అద్భుత విజయాలుగా ప్రచారం ఎప్పటి నుంచో చేస్తున్నారు.  ఎన్నికలలో కూడా అదే ధోరణి అవలంబిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రతి సభలో ధరణిని ప్రస్తావించి అది తమ బలహీనతగా కాదు అని స్పష్టం చేసే ప్రయత్నం వినూత్నంగా ఉంది. బీఆర్ఎస్​ తిరిగి ఎన్నిక అయితే మాత్రం ధరణి బాధితులకు ఉపశమన మార్గం మూసుకుపోతుంది. ఎందుకంటే,  సీఎం ఎక్కడా కూడా ధరణి బాధితులకు న్యాయం చేస్తామని వాగ్దానం చేయలేదు. ధరణి పోర్టల్​లో భూ సంబంధాలు మారిన సందర్భంలో ధరణి కొనసాగింపు,  కేసీఆర్ ​తెగింపు వల్ల తెలంగాణలో తీవ్ర మార్పులు వచ్చే అవకాశం ఉన్నది. ప్రజలను తీవ్ర ఇబ్బందులలోకి నెట్టిన ప్రభుత్వ అడుగులను సమర్థించుకోవడం ద్వారా అధికార బీఆర్ఎస్​ పార్టీ తన మొండి వైఖరిని చాటుతున్నది. ఈ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చి ఈ వైఖరి బలపడితే గత పదేండ్ల పాలన బాధితులకు అన్ని దారులు మూసుకుపోయినట్లే.

మద్యపానం పెరగిపోతున్నది

మద్యం అమ్మకాలు పెరగడం అంటే మద్యపానం విస్తృతం కావడమే.. దాని వల్ల ఎన్నో కుటుంబాలు చితికిపోతున్నాయ్. కార్మిక, శ్రామికుల శ్రమ వ్యసనం బారిన పడ్డది.  భూమి, మద్యం నుంచి ప్రభుత్వం ఆదాయాన్ని పిండుకోవడం తారస్థాయికి చేరింది. ఈ ఆదాయం ఇంకా పెంచాలని కొత్త ప్రభుత్వం భావిస్తే అది ఆత్మహత్యాసదృశ్యం అవుతుంది.  ప్రజల సంక్షేమ రీత్యా మద్యం వాణిజ్యం తగ్గించుకోవాలి. సహజ వనరుల దోపిడీని కూడా నిలువరించాలి. తెలంగాణ అభివృద్ధి దిశ మారడానికి ప్రజావ్యతిరేక మార్గాల ఆదాయం తగ్గించుకోవడం చాలా అవసరం. ప్రకటించిన సంక్షేమ పథకాల కోసం అవసరమైన నిధుల వేటలో ఈ మార్గాల ద్వారా ఖజానా నింపాలని కొత్త ప్రభుత్వం కూడా నిర్ణయించుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు. కాగా, కొత్త ప్రభుత్వం ముంగిట స్పష్టమైన ద్రవ్య లోటు ఉన్నది.  2023-–24లో  బీఆర్ఎస్ ప్రభుత్వం ​ప్రతిపాదించిన రూ.2.9 లక్షల కోట్లు బడ్జెట్​కు  కావాల్సిన నిధులు సాధారణంగా సమకూర్చుకునే అవకాశం లేదు. ప్రభుత్వ ఆదాయ మార్గాల మీద పారదర్శకంగా సమీక్ష చేయాల్సిన అవసరం ఉన్నది. కొత్త ప్రభుత్వం దీనిపై అఖిలపక్ష సమావేశం నిర్వహించి రాజకీయ మద్దతు కూడగట్టాల్సిన పరిస్థితి ఏర్పడనున్నది. 

పెరుగుతున్న నిరుద్యోగం

తెలంగాణాలో నిరుద్యోగం పెరుగుతున్నది. అంకెలు చెబుతున్న వాస్తవాలే కాక ఈ ఎన్నికలలో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం నిరుద్యోగం తగ్గించడానికి చేపట్టే చర్యలు ప్రధానం కానున్నాయి. ప్రభుత్వ ఆదాయం పెరిగినా నిరుద్యోగం ఉన్నది అంటే ప్రభుత్వ విధానాల దిశ గురించి అలోచించాల్సిందే. ప్రభుత్వ ఉద్యోగ భర్తీ కూడా పారదర్శకంగా, అవినీతి రహితంగా, సామాజిక న్యాయం పాటిస్తూ చేయాల్సిన అవసరం కూడా ఈ ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడున్న జీవనోపాధులను కాపాడుకోవడం కూడా నిరుద్యోగ సమస్యలో భాగమే. స్థానికుల జీవనోపాధి సంరక్షిస్తే ఆయా కుటుంబాలలో ఆదాయం కోసం ఆందోళన తగ్గుతుంది. వారి పిల్లల భవిష్యత్తుకు వారే బాటలు వేసుకునే అవకాశం లభిస్తుంది. తెలంగాణలో ఉన్న వివిధ రంగాలలో ఉత్పత్తి, సేవలు పెంచడానికి, వాణిజ్యం పెంచడానికి తగిన వ్యూహాలు అవసరం. ప్రభుత్వ ఉద్యోగుల భర్తీ ఖచ్చితంగా ఖర్చుతో కూడుకున్నది. అయితే, ప్రభుత్వ సేవలు కూడా అవసరం కనుక ఎక్కడ ఉద్యోగాల భర్తీ చేపడతారు? ఏ శాఖలో ఎంత అవసరం అన్నది పారదర్శకంగా నిర్ణయించాలి. విద్య, వైద్యం చాలా కీలకం. ఈ శాఖలలో ఉద్యోగుల సంఖ్య తగ్గడం వల్ల ప్రజల మీద భారం పడుతున్నది. 

సత్ఫలితాలివ్వని పెట్టుబడులు 

తెలంగాణలో అప్పుల మీద విమర్శలు వస్తే ఆ ధనం మౌలిక పెట్టుబడుల మీద పెట్టాం అని బీఆర్ఎస్​ ప్రభుత్వం సంజాయిషీ ఇస్తున్నది. మౌలిక సదుపాయాల మీద పెట్టుబడులు పెడితే ఆర్థిక రంగం మెరుగు కావాలి.  కానీ, ఆ విధంగా కనపడడం లేదు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మౌలిక పెట్టుబడులు ఎక్కువగా ఎత్తిపోతల పథకాల మీద, కరెంటు మీద,  హైదరాబాద్ నగర అభివృద్ధి మీద పెట్టినట్లు కనపడుతున్నది. మేడిగడ్డ బ్యారేజిలో సమస్యల వల్ల కాళేశ్వరం మీద పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు ప్రశ్నార్థకం అయినాయి. దాని కంటే ముందే నీటి లభ్యత పెరిగినా, దానిని ఉపయోగించుకోవడానికి తగిన ఆర్థిక వ్యూహరచన జరగలేదు. సాగు 2 కోట్ల ఎకరాలకు పెరిగింది అని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం ఏ పంట వేయాలనేది ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి ముందు కాని తరువాత కాని సుస్థిరంగా ఆలోచించలేదు.  మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో  ఏర్పడిన సమస్య వల్ల ఇప్పుడు వాటిని నీటి నిల్వకు ఉపయోగించుకునే పరిస్థితి లేదు. అంటే, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు విఫలం అయ్యింది.  కొత్త ప్రభుత్వం ఈ పరిస్థితిని ఏ విధంగా ఎదురుకుంటుందనేది పెద్ద ప్రశ్నే.  రిపేరు కోసం ఇంకా అదనంగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఈ పెట్టుబడి అప్పుల ద్వారానే సాధ్యం.  

పెరగని విద్యుత్​ ఉత్పత్తి 

 తెలంగాణలో విద్యుత్​ఉత్పత్తి సామర్థ్యం పెరగలేదు. నిరంతర కొనుగోళ్లు ద్వారా తెలంగాణ ప్రభుత్వం కరెంటు అవసరాలు, హామీలు తీర్చుతున్నది. మార్కెట్లో అధిక ధరలు పెట్టి కరెంట్ కొనుగోలు చేయడం వల్ల కూడా ఆర్థిక భారం పెరిగింది. దీంతో అప్పులు పెరిగాయి. ఇదే విధంగా కరెంటు సరఫరా కొనసాగించాలంటే, కొత్త ప్రభుత్వం ఉన్న అప్పులు తీర్చుతూనే కొత్త అప్పులు చెయ్యాలి. లేకపోతే కరెంటు ఉండదు. డిస్కం కంపెనీల మీద భారం మోయలేని పరిస్థితికి చేరింది. తెలంగాణ అభివృద్ధికి, ఆర్థికరంగం బలోపేతానికి కరెంటు ఉత్పత్తి అత్యంత కీలకం. కొత్త ప్రభుత్వం కరెంటు ఉత్పత్తి సామర్థ్యం పెంచుకుంటూ, కరెంట్ సరఫరా ఏ మేరకు నిల్పుకుంటుంది? ఇది కూడా పెద్ద ప్రశ్న. 24 గంటల కరెంటు సరఫరా ఎప్పుడో ప్రమాదంలో పడింది. అయితే, కేసీఆర్ సర్కారు దాన్ని బయటపెట్టలేదు. కొత్త ప్రభుత్వానికి కరెంటు కూడా ఓ సవాలు. ఎల్ నినో వల్ల వర్షాభావం, ఎత్తిపోతల పథకాల వైఫల్యం వల్ల వ్యవసాయ కరెంటు వినియోగం పెరుగుతోంది. అంటే కరెంటు కొనుగోళ్ళు తప్పనిసరి. గత కొన్ని ఏండ్లుగా కరెంటు చార్జీలు సవరించలేదు. ఇక సవరించాల్సి వస్తుంది. కరెంటు ధరలు పెంచితే ప్రకటించిన సబ్సిడీల రూపంలో ప్రభుత్వం మీద, ప్రైవేటు రంగం మీద భారం పడుతుంది. ఉత్పత్తి ఖర్చు కూడా పెరుగుతుంది. దాని వలన తెలంగాణ ఉత్పత్తులు వాణిజ్య పోటీలో వెనుకబడతాయి. ఈ పరిస్థితికి చేరకుండా కొత్త ప్రభుత్వానికి వ్యూహాలు అవసరం. సౌరశక్తి ద్వారా కరెంటు ఉత్పత్తి సామర్థ్యం పెంచుకోవాలి. అదేవిధంగా ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి.

 అవినీతిపై చర్యలు చేపట్టాలి

తెలంగాణ ఏర్పడినాక అన్ని స్థాయిలలో అవినీతి పెరిగింది.  కొత్త ప్రభుత్వం అవినీతిని తగ్గించాలంటే పారదర్శక పాలన వైపు అడుగులు వెయ్యాలి. ప్రభుత్వశాఖల్లో, సంస్థల్లో  వేళ్ళూనుకున్న వ్యక్తులను మార్చాలి.  అన్నిరంగాల్లో జరిగిన అవినీతి మీద దర్యాప్తు చేసి తగిన చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ నియంత్రణ సంస్థల మీద  ప్రజలకు గౌరవం, నమ్మకం పెంచేలా చర్యలు చేపట్టాలి.  తెలంగాణాలో పాలన గాడి తప్పింది. కొత్త ప్రభుత్వం ఏ పార్టీకి చెందినా  పాత పాలనా పద్ధతులను వీడాలి.  ఇది అంత సులువు కాదు. అయితే అసాధ్యం కూడా కాదు. 
తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా అనేక సమస్యలు నెలకొన్న తరుణంలో వాటిని అధిగమించడానికి కొత్త సర్కారు వేసే అడుగులు, తీసుకునే నిర్ణయాలు, ఎంచుకునే వ్యూహాలు చాలా కీలకం కానున్నాయి.  తెలంగాణ సుస్థిర అభివృద్ధికి బాటలు వేయాలంటే ప్రజాస్వామ్య పాలనా సంస్కృతి తిరిగి తీసుకురావాలి. వ్యక్తిస్వామ్యం దూరం పెట్టి ప్రజాస్వామ్యానికి పూర్తి స్థాయి పని కల్పించాలి. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులు పెంచాలి. స్థానిక సంస్థలు, పంచాయతీలు, మున్సిపాలిటీలను బలోపేతం చెయ్యాలి. తెలంగాణా సుస్థిర అభివృద్ధికి వ్యూహరచన చెయ్యాలి. వ్యవసాయం, విద్య, వైద్యరంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. పాలనలో అందరినీ కలుపుకుని పోయి అన్ని వర్గాల అభివృద్ధి చెందేలా చర్యలు చేపట్టాలి.

అప్పుల తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 5 లక్షల కోట్లకు పైగా అప్పులు ఉన్నాయనేది వాస్తవం. మిగులు బడ్జెట్ నుంచి రాష్ట్రాన్ని అప్పుల దశకు చేర్చింది బీఆర్ఎస్​ పాలన.  దానిని ఇప్పటికీ ప్రభుత్వం సమర్థించుకుంటున్నది.  రాబోయే ప్రభుత్వానికి  అప్పులు, వాటి వడ్డీ భారంగా మారనున్నది. వడ్డీలు దాదాపు రూ.16 వేల కోట్లు కడుతున్నారు. అయితే, ఇంకా అప్పుల కిస్తీలు మొదలు కాలేదు. కొత్త ప్రభుత్వం ఈ కిస్తీలు, వాటి వడ్డీలు కట్టడానికే తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. వీటికి నిధులు ఎక్కడ నుంచి వస్తాయి?  కాగా,  ప్రస్తుత ప్రభుత్వం నాలుగు మార్గాలను ఎంచుకున్నది.  సర్కారు భూముల అమ్మటం, భూముల ధరలు పెంచి వాటి క్రయవిక్రయాల ద్వారా ఆదాయం పెంచుకోవటం, మద్యం అమ్మకాలు, సహజ వనరుల దోపిడీ..ఈ నాలుగు మార్గాలనే  ప్రభుత్వ అనుసరించడం వల్ల తెలంగాణ  ప్రజలు అప్పుల ఊబిలో  కూరుకుపోతారన్నది  వాస్తవం. తెలంగాణ సంపద కొందరి దగ్గరికే చేరుతున్నది.  కొందరి వద్దే  భూములు పేరుకుపోతున్నాయి. 

-డా. దొంతి నర్సింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్​