
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ తర్వాత పెన్షన్, రిటైర్మెంట్ బకాయిలు సమయానికి అందేలా చూడటానికి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. ఈ మార్పులు పెన్షన్ పేమెంట్ ఆర్డర్స్(PPOs) జారీ, రిటైర్మెంట్ డ్యూస్ చెల్లింపులతో పాటు తొలి పెన్షన్ విడుదలలో ఆలస్యం జరగకుండా నిరోధించడమే ప్రధాన ఉద్దేశం.
విజిలెన్స్ క్లియరెన్స్ లేకపోవడం వల్ల పించన్ ఆలస్యం కావడానికి అవకాశం ఉండదని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం తెలుస్తోంది. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) నిబంధనలు, 2021 ప్రకారం.. పదవీవిరమణకు మూడు నెలల ముందు సంబంధిత శాఖలు తమ ఉద్యోగులకు విజిలెన్స్ క్లియరెన్స్ తప్పనిసరిగా ఇవ్వాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే పింఛన్ ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రభుత్వం భవిష్య (Bhavishya) పోర్టల్‌లో సాంకేతిక మార్పులు కూడా చేసింది. దీని ద్వారా గడువు మించిన కేసులు ఆటోమేటిక్‌గా ఫ్లాగ్ అవుతాయి. పై స్థాయికి ఆటోమేటిక్ ఎస్కలేషన్ అయ్యి సమస్య పరిష్కారం అవుతుందని వెల్లడైంది.
ప్రతి పదవీవిరమణ పొందే ఉద్యోగి కోసం ప్రత్యేకంగా ఒక వెల్ఫేర్ ఆఫీసర్ లేదా పెన్షన్ మిత్రని నియమిస్తూ, అవసరమైన పత్రాలు, ఫారమ్‌లు పూర్తి చేయడంలో వారికి సహాయం కూడా అందించనున్నారు. ఉద్యోగి మరణించిన సందర్భంలో వారి డిపెండెంట్స్ లేదా చట్టపరమైన వారసులకు కూడా అవసరమైన మద్దతు ఈ అధికారులు అందిస్తారు.
కొత్త మార్పులతో పదవీ విరమణ పొందిన ఉద్యోగికి ప్రయోజనాలు..
1. ఉద్యోగి రిటైర్మెంట్‌కు 60 రోజుల ముందు PPOలు లేదా e-PPOలు జారీ.
2. రిటైర్మెంట్ తర్వాతి రోజు వెంటనే రిటైర్మెంట్ డ్యూస్ చెల్లింపు జరగాలి.
3. తొలి పెన్షన్‌ను పదవీవిరమణ అనంతరం వచ్చే నెల చివరి రోజున తప్పనిసరిగా చెల్లించాలి.
సంస్కరణల్లో భాగంగా అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో హై-లెవల్ ఓవర్సైట్ కమిటీ ఏర్పాటు చేయబడుతుంది. అదేవిధంగా జిల్లావారీగా పర్యవేక్షణాధికారులు, పెన్షన్ పంపిణీ బ్యాంకులు సమయపాలన పాటిస్తున్నాయా లేదా అనే సమాచారాన్ని కఠినంగా గమనిస్తారు. అలాగే e-HRMS వినియోగాన్ని సర్వీస్ రికార్డులను డిజిటల్ రూపంలో ఉంచుతారు. దీంతో పొరపాట్లు తగ్గి.. పనితీరులో వేగం పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.