అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ ఆస్తులకు కొత్త మార్కెట్ వ్యాల్యూస్

అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ ఆస్తులకు కొత్త మార్కెట్ వ్యాల్యూస్
  • అగ్రికల్చర్​ ల్యాండ్స్​ మినిమమ్​ 50%, మ్యాగ్జిమమ్​ 150 %  వరకు పెంపు
  • ఫ్లాట్ల విలువలు ఇప్పుడున్నదానిపై  25%పైగానే..
  • ఓపెన్ ప్లాట్ల విలువ 35%పైగా హైక్​ 
  • సోమవారం కిటకిటలాడిన రిజిస్ట్రేషన్​ ఆఫీసులు
  • రాత్రి 9 గంటలకే సర్వర్ క్లోజ్ 
  • నేటి ఉదయం 10.30 గంటల నుంచి మళ్లీ ఓపెన్​
  • గత వారంలోనే సర్కారుకు రూ. 650 కోట్ల ఆదాయం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ ఆస్తుల కొత్త మార్కెట్ వ్యాల్యూస్ మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయి. సవరించిన విలువల అప్ డేషన్ కోసం కార్డ్​ సాఫ్ట్ వేర్  సర్వర్ ను సోమవారం రాత్రి 9 గంటలకు క్లోజ్ చేశారు. దీంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఒక్కసారిగా నిలిచిపోయింది. అప్పటికే క్యూలైన్లలో ఉన్న ఆస్తుల కొనుగోలుదారులు వెనుదిరిగారు. అయితే అప్పటికే డాక్యుమెంట్లు సబ్ రిజిస్ట్రార్లు, తహసీల్దార్ల వద్దకు చేరి, చెక్ స్లిప్పులు జారీ చేసిన వారికి పాత మార్కెట్ వాల్యూ ప్రకారమే రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను తిరిగి స్టార్ట్​ చేయనున్నట్లు ఆ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. కొత్త మార్కెట్​ వ్యాల్యూస్​ను  సోమవారం అర్ధరాత్రి స్టాంప్స్​ అండ్​ రిజిస్ట్రేషన్​ వెబ్​సైట్​లో అప్​డేట్​ చేశారు. అందులో ఏరియా పేరుతో సర్చ్​ చేస్తే ఆ ఏరియాలోని కొత్త మార్కెట్​ వ్యాల్యూ కనిపిస్తుంది.  

నిరుడు జులైలోనే పెంచి.. మళ్లీ..!

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ లేనంతగా భూముల మార్కెట్​ విలువలు పెంచేసింది. నిరుడు జులైలోనే పెంచినప్పటికీ.. ఇప్పుడు మళ్లీ పెంచింది. దీంతో సామాన్యులకు రిజిస్ట్రేషన్ చార్జీలు మోయలేని భారంగా మారనున్నాయి. బహిరంగ మార్కెట్​లో ఉన్న ధరలకు, ప్రభుత్వం నిర్ధారించిన మార్కెట్ వ్యాల్యూకు తేడా ఉండడంతోనే  సవరించినట్లు ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఈ పెంపు నిర్ణయంతో సర్కార్​కు భారీగా ఆదాయం రానుంది. వ్యవసాయ భూముల విలువలు మినిమమ్​ 50%, మ్యాగ్జిమమ్​ 150% వరకు పెరగనున్నాయి. నాన్ అగ్రికల్చర్ ఆస్తులకు సంబంధించి ఫ్లాట్ల విలువలు ఇప్పుడున్న వ్యాల్యూస్ పై 25 శాతానికిపైగా, ఓపెన్ ప్లాట్ల విలువలు ఇప్పుడున్న వ్యాల్యూస్​పై  35 శాతానికిపైగా పెరగనున్నాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో ఆయా వ్యవసాయ భూములకు, ప్లాట్లకు ఉన్న ధరలు, అలాగే సబ్ రిజిస్ట్రార్ వ్యాల్యూ కు మధ్య వ్యత్యాసాన్ని ఆధారంగా చేసుకునే మార్కెట్ విలువలను సవరించినట్లు తెలిసింది. 

ఒక్కరోజే మస్తు రిజిస్ట్రేషన్లు

సోమవారం ఒక్కరోజు నాన్ అగ్రికల్చర్ ఆస్తులకు సంబంధించి 10,127 డాక్యుమెంట్లు రిజిస్టర్ కాగా, ప్రభుత్వానికి రూ.82 కోట్ల ఆదాయం సమకూరింది. ధరణి పోర్టల్ ద్వారా మరో 1,500 వరకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరుగగా.. రూ.20 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిసింది. మొత్తంగా రెండు రకాల రిజిస్ట్రేషన్ల ద్వారా ఖజానాకు రూ.100 కోట్ల ఇన్​కం దాటింది. జనవరి నెలలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. ఈ ఒక్క నెలలో రూ.1,204 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారిక వర్గాలు తెలిపాయి. మార్కెట్ వాల్యూస్ పెరుగుతాయనే ప్రచారం ఊపందుకోవడతో జనవరి 24 నుంచి 31వ తేదీ వరకు వారం రోజుల్లోనే సుమారు రూ. 650 కోట్లకుపైగా ఆదాయం వచ్చింది. మొత్తంగా ఈ ఫైనాన్షియల్  ఇయర్ లో 10 నెలలల్లో కలిపి ప్రభుత్వానికి రూ. 8,034 కోట్లు ఆదాయం రిజిస్ట్రేషన్ల నుంచి సమకూరింది. 

అగ్రికల్చర్​ భూములు విలువలను పెంచిందిలా.. 

  • కొన్నిచోట్ల వ్యవసాయ భూముల ధరలు ప్రస్తుతం అమల్లో ఉన్న సబ్ రిజిస్ట్రార్ వ్యాల్యూతో పోలిస్తే బహిరంగ మార్కెట్ లో 4  నుంచి 1‌‌‌‌‌‌‌‌0 రెట్లు ఎక్కువగా పలుకుతున్నాయి. ఇలాంటి భారీ తేడాలున్న గ్రామాలు రాష్ట్రంలో 472 ఉన్నట్లు గుర్తించారు. ఈ గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న వ్యాల్యూపై 75 శాతం వ్యాల్యూ పెరగనుంది.  
  • సబ్ రిజిస్ట్రార్  వ్యాల్యూతో పోలిస్తే 10 నుంచి 15 రెట్లు ఎక్కువగా బహిరంగ మార్కెట్ లో రేటు పలికే భూముల మార్కెట్ వ్యాల్యూస్ 100 శాతం పెరగనున్నాయి. ఉదాహరణకు ఎకరాకు రూ.5 లక్షలు ఉంటే.. ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ మార్కెట్ వ్యాల్యూ రూ.10 లక్షలు కానుంది. ఇలాంటి గ్రామాలు రాష్ట్రవ్యాప్తంగా 90 వరకు ఉన్నాయి. 
  • సబ్ రిజిస్ట్రార్ నిర్ధారించిన మార్కెట్ వ్యాల్యూతో పోలిస్తే 15 నుంచి 20 రెట్లు ఎక్కువగా బహిరంగ మార్కెట్ లో రేటు పలికే భూముల మార్కెట్ వ్యాల్యూస్ 125 శాతం పెరగనున్నాయి. ఇలాంటి గ్రామాలు రాష్ట్రవ్యాప్తంగా 77 వరకు ఉన్నాయి. 
  • సబ్ రిజిస్ట్రార్ నిర్ధారించిన మార్కెట్ వ్యాల్యూతో పోలిస్తే 20 రెట్లు ఎక్కువగా బహిరంగ మార్కెట్ లో రేటు పలికే భూముల మార్కెట్ వ్యాల్యూస్ 150 శాతం పెరగనున్నాయి. ఉదాహరణకు ఎకరాకు రూ. 5 లక్షలు ఉంటే.. ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ మార్కెట్ వ్యాల్యూ రూ.12.50 లక్షలు కానుంది. ఇలాంటి గ్రామాలు రాష్ట్రవ్యాప్తంగా 42 వరకు ఉన్నాయి. 
  • నాన్ అగ్రికల్చర్ ఆస్తుల విలువల పెంపు ఇలా.. 
  • రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఓపెన్ ప్లాట్ల ధరలు, ఇండ్ల ధరలు ప్రస్తుతం అమల్లో ఉన్న సబ్ రిజిస్ట్రార్ వ్యాల్యూతో పోలిస్తే బహిరంగ మార్కెట్ లో 2  నుంచి 5 రెట్లు ఎక్కువగా పలుకుతున్నాయి. ధరలు ఇలా భారీ తేడాలున్న ప్రాంతాల్లో ప్రస్తుత మార్కెట్ వ్యాల్యూపై 40 శాతం పెరగనుంది. రాష్ట్రంలో అత్యధికంగా 4,722 ప్రాంతాల్లో ఇలా మార్కెట్ వ్యాల్యూస్ పెరగనున్నాయి.  
  • ఓపెన్ ప్లాట్ల ధరలు, ఇండ్ల ధరలు ప్రస్తుతం అమల్లో ఉన్న సబ్ రిజిస్ట్రార్  వ్యాల్యూతో పోలిస్తే బహిరంగ మార్కెట్ లో 5  నుంచి 7 రెట్లు ఎక్కువగా పలుకుతున్న చోట సబ్ రిజిస్ట్రార్ మార్కెట్ వ్యాల్యూ 50 శాతం పెరగనుంది. రాష్ట్రంలో ఇలాంటి ప్రాంతాలు 1,155 ఉన్నాయి. అలాగే సబ్ రిజిస్ట్రార్ వ్యాల్యూతో పోలిస్తే బహిరంగ మార్కెట్ లో 7 రెట్లకుపైగా ఎక్కువగా ధర పలుకుతున్న చోట మార్కెట్ వ్యాల్యూ 60 శాతం పెంచనున్నారు. ఇలాంటి ప్రాంతాలు 487 ఉన్నట్లు గుర్తించారు. 
  • ఇప్పటికే సబ్ రిజిస్ట్రార్  వ్యాల్యూ చదరపు గజానికి రూ. 20 వేల నుంచి 40 వేల వరకు అమల్లో ఉన్న హై పొటెన్షియల్ ఏరియాల్లో మార్కెట్ వ్యాల్యూ 15 శాతం పెరగనుంది. రూ. 40 వేలకు పైగా ఉన్న ప్రాంతాల్లో  మార్కెట్ వ్యాల్యూ  10 శాతం పెరగనుంది.