త్వరలో కొత్త రేషన్ కార్డులు .. సివిల్ సప్లయ్ అధికారులు వెల్లడి

త్వరలో కొత్త రేషన్ కార్డులు .. సివిల్ సప్లయ్ అధికారులు వెల్లడి
  • సిటీలో 40 శాతమే ఈ - కేవైసీ పూర్తి
  • ఫిబ్రవరి ఆఖరు వరకు గడువు పొడిగింపు
  • సిటీలో దాదాపు లక్ష వరకు బోగస్ కార్డులు
  • ఏరివేత తర్వాత అర్హుల గుర్తింపు ఈజీ
  • మార్చి నుంచి కొత్త కార్డులు జారీ

హైదరాబాద్, వెలుగు : గ్రేటర్​ హైదరాబాద్​లో కొత్త రేషన్ ​కార్డుల పంపిణీకి పౌరసరఫరాలశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే.. ప్రస్తుత రేషన్​కార్డుల్లో ముందుగా అనర్హులను గుర్తించి తొలగించాలని అధికారులు నిర్ణయించారు. ఆ తర్వాతనే కొత్త కార్డులను జారీ చేయాలని కూడా భావిస్తున్నారు. ఇందుకు ప్రక్రియను వేగవంతం చేసినట్టుగా సివిల్ సప్లయ్ కు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. రేషన్​కార్డు ఈ– కేవైసీ చేయించుకోవాలని అధికారులు చెబుతున్నారు.

ఈనెల 31 వరకే గడువు విధించగా.. వందశాతం పూర్తి కాకపోగా మరో నెల రోజుల పాటు పొడిగించినట్టు ప్రకటించారు.  ఫిబ్రవరి ఆఖరునాటికి ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని సర్కిళ్ల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి కార్డుదారుడు ఈ కేవైసీ చేయించుకునేలా చూడాలని డీలర్లకు సూచించారు.

40శాతం లోపే పూర్తి

సిటీలో రేషన్​కార్డుల ఈ–  కేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు ప్రచారం చేస్తున్నా కార్డుదారులు  మాత్రం ఆసక్తి చూపకపోతుండగా ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. ప్రస్తుతం 35 నుంచి 40శాతం మేరకే పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు. ​కోర్​సిటీలోని 9 సర్కిళ్లలో దాదాపు 6 లక్షల రేషన్​కార్డులు, శివారు ప్రాంతాల్లో మరో రెండు లక్షల కార్డులు ఉన్నట్టు పేర్కొంటున్నారు.  గ్రేటర్​లో 1,600 రేషన్​షాపులు ఉండగా, వీటి పరిధిలో దాదాపు లక్ష వరకు బోగస్​ రేషన్​కార్డులు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. భారీగా బోగస్​కార్డులను ఫిల్టర్​చేయడం ద్వారా మరింత మంది అర్హులకు కేటాయించడానికి అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 

మార్చి నుంచి జారీ!

 వచ్చే నెల రోజుల్లో బోగస్ ​కార్డులను గుర్తించి వాటిని రద్దు చేయాలని అధికారులు భావిస్తున్నారు. అందుకే ప్రతి కార్డుదారుడు రేషన్​షాపులకు వెళ్లి ఈ– కేవైసీ చేయించుకోవాలని సూచిస్తున్నారు. కార్డు ఎవరి పేరున ఉందో వారితో పాటు, కార్డులో పేర్లున్న వారు కూడా రేషన్​షాపులో వేలి ముద్రలను వేయాల్సి ఉంది. ఈ ప్రక్రియతో అర్హులైన వారు మాత్రమే తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది. ఒక వేళ కార్డులో పేర్లున్న వారు రేషన్​షాపులకు వెళ్లి ఈ– కేవైసీ చేయించకపోతే బోగస్ ​కార్డుగానే పరిగణించాల్సి వస్తుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.  

ప్రక్రియ పూర్తయితే చాలా బోగస్​కార్డులు తొలగిపోతాయంటున్నారు. అనంతరం కొత్త రేషన్​ కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారి వెరిఫికేషన్​పూర్తిచేసిన తర్వాతనే మంజూరు చేస్తామంటున్నారు. పాత కార్డుల్లో దాదాపు లక్ష నుంచి లక్షన్నర రద్దయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. మార్చి నుంచి అర్హులకు కొత్త రేషన్​కార్డులను పంపిణీ చేస్తామని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.