డీప్ ఫేక్స్ కట్టడికి కొత్త రూల్స్.. క్రియేట్ చేసేవారితోపాటు పబ్లిష్ చేసే వారికీ శిక్ష

డీప్ ఫేక్స్ కట్టడికి కొత్త రూల్స్.. క్రియేట్ చేసేవారితోపాటు పబ్లిష్ చేసే వారికీ శిక్ష
  • త్వరలోనే డ్రాఫ్ట్ రూల్స్ తయారీ
  • ఏఐ, సోషల్ మీడియా కంపెనీల ప్రతినిధులతో మంత్రి భేటీ

న్యూఢిల్లీ: ఇటీవల స్టార్ హీరోయిన్లు రష్మిక మందన, కత్రినా కైఫ్, కాజోల్ ముఖాలను అశ్లీల వీడియోల్లోని మహిళలతో మార్ఫింగ్​ చేసిన డీప్ ఫేక్ వీడియోలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. దీంతో ఇలాంటి వీడియోల కట్టడికి కొత్త రూల్స్ తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాయంతో రూపొందిస్తున్న డీప్ ఫేక్ వీడియోలు, ఆడియోలు వైరల్ అవుతుండటం పట్ల ప్రధాని మోదీ సైతం ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. తాను పాట పాడినట్లు కూడా ఓ ఫేక్ ఆడియో బయటకు వచ్చిందని, భవిష్యత్తులో ఈ టెక్నాలజీ ముప్పుగా మారుతుందని.. వీటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఏఐ టూల్స్ రూపొందించే కంపెనీలు, సోషల్ మీడియా కంపెనీల ప్రతినిధులతో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం ఢిల్లీలో సమావేశమయ్యారు.

మీటింగ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇకపై డీప్ ఫేక్ కంటెంట్ తయారీదారులు, పబ్లిష్ చేసేవారు బాధ్యత వహించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడి నుంచి వీటిని రూపొందించినా, పబ్లిష్ చేసినా.. మన దేశంలో ఈ కంటెంట్ ను చూపాలంటే తప్పనిసరిగా రూల్స్ పాటించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. లేకపోతే డీప్ ఫేక్స్ కంటెంట్ క్రియేటర్లకు, వాటిని పబ్లిష్ చేసే వెబ్ సైట్లకు పెనాల్టీలు, శిక్షలు తప్పవని ఆయన హెచ్చరించారు. దీనికి సంబంధించి కొన్ని వారాల్లోనే డ్రాఫ్ట్ ను రెడీ చేస్తామన్నారు. డీప్ ఫేక్స్ కంటెంట్ ను ఎలా గుర్తించాలి? ఎలా అరికట్టాలి? కంటెంట్ వైరల్ కాకుండా ఆపవచ్చా? వీటిపై ఫిర్యాదులు, పనిష్మెంట్ల ప్రక్రియ ఎలా ఉండాలి? వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించామన్నారు.

Also Read :- మార్కెట్‌‌‌‌‌‌‌‌లోకి గోల్డ్‌‌‌‌‌‌‌‌మెడల్‌‌‌‌‌‌‌‌ వాటర్ హీటర్లు