ఉద్యోగుల ట్రాన్స్​ఫర్లు, పోస్టింగులపై మార్గదర్శకాలు జారీ

ఉద్యోగుల ట్రాన్స్​ఫర్లు, పోస్టింగులపై మార్గదర్శకాలు జారీ
  • కొత్త స్థానికతకు తగ్గట్టుగా చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు
  • పోస్టింగ్​ పొందిన మూడు రోజుల్లో డ్యూటీలో చేరాలని ఆదేశం

హైదరాబాద్​, వెలుగు: కొత్త స్థానికతకు తగ్గట్టుగా ఉద్యోగుల ట్రాన్స్​ఫర్లు, పోస్టింగుల కోసం రాష్ట్ర సర్కార్​ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలకు అలకేట్​ అయిన డిస్ట్రిక్ట్​ కేడర్​ ఉద్యోగుల నుంచి పోస్టింగులకు ఆప్షన్లు తీసుకోనుంది. ఈ ప్రక్రియను కలెక్టర్​, జిల్లా హెచ్​ఓడీలతో కూడిన కమిటీ  కౌన్సెలింగ్ ​పద్ధతిలో  వారం రోజుల్లోగా పూర్తి చేయాలని సీఎస్​ సోమేశ్​ కుమార్​ ఆదేశించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సర్క్యులర్​ జారీ చేశారు. పోస్టింగ్​ పొందిన తర్వాత మూడు రోజుల్లోపు డ్యూటీలో చేరాలని, దీనికి తగ్గట్టు హెచ్​ఓడీలు కూడా ఆర్డర్ ఇచ్చి మూడు రోజుల్లోపే రిలీవ్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. బదిలీ ప్రక్రియ, పోస్టింగ్ ఆర్డర్‌‌ జారీ సజావుగా, సక్రమంగా జరిగేలా చొరవ తీసుకోవాలని డిపార్ట్​మెంట్ల కార్యదర్శులను, హెచ్‌‌వోడీలను ఆదేశించారు. దీనిపై రోజూ సెక్రటేరియేట్​లో అప్‌‌డేట్ అందించాలన్నారు. జిల్లా కేడర్‌‌‌‌తో పాటు జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగులకు కూడా ఇదే ఫార్ములా వర్తిస్తుందని సర్క్యులర్​లో పేర్కొన్నారు. జోనల్, మల్టీ జోనల్ పోస్టింగ్ ల విషయంలో అవసరమైతే ప్రత్యేకంగా ఆపరేషనల్ గైడ్ లైన్స్ జారీ చేస్తామని వివరించారు. 

  •     ఉద్యోగుల విభజనలో భాగంగా ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లాకే  ఆ ఉద్యోగి అలకేట్​అయినట్లయితే ఆ ఉద్యోగికి ఎలాంటి ట్రాన్స్ ఫర్​ ఉండదు. ఏ పోస్టులో అయితే పనిచేస్తున్నారో అదే పోస్టులో పనిచేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణ: ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలోని మంచిర్యాల జిల్లా ఉద్యోగి.. విభజనలో భాగంగా మంచిర్యాల జిల్లాకే అలకేట్​ అయ్యాడు. అప్పుడు ఆ ఉద్యోగి అదే పోస్టులో ఉన్నట్లు భావించాల్సి ఉంటుంది. కొత్త పోస్టింగ్​ అవసరం లేదు. ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లా కాకుండా ఉమ్మడి జిల్లా నుంచి వేరుపడిన ఇంకో జిల్లాకు అలకేట్​అయితే ఆ ఉద్యోగి అక్కడ రిపోర్ట్ చేసి, పోస్టింగు కోసం ఆప్షన్​ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. 
  •     ఉద్యోగులను కొత్త జిల్లాలకు కేటాయించేందుకు సీనియారిటీ లిస్ట్​ ప్రామాణికంగా తీసుకున్నట్లుగానే... ట్రాన్స్​ఫర్లు, పోస్టింగుల కోసం కూడా సీనియారిటీ లిస్ట్​ను పరిగణనలోకి తీసుకోనున్నారు. ఆయా డిపార్ట్​మెంట్ల హెచ్​ఓడీలు సీనియారిటీ జాబితాను సిద్ధం చేస్తారు.  
  •     పోస్టింగ్​ కోసం ఉద్యోగులు ప్రభుత్వం సూచించిన అప్లికేషన్​లో ప్రయార్టీ వైజ్​ ఆప్షన్స్​ఇవ్వాల్సి ఉంటుంది. 
  •     బదిలీలు, పోస్టింగులు ఇచ్చే టైంలో ఉద్యోగ సంఘాలు టీజీవో, టీఎన్జీవో మెంబర్లను మీటింగుల్లో పాల్గొనేందుకు పిలవాల్సి ఉంటుంది. 
  •     పోలీసు, ఎక్సైజ్​, స్టాంప్స్​, కమర్షియల్​ టాక్స్, రిజిస్ట్రేషన్​ డిపార్ట్​మెంట్లు పోస్టింగుల విషయంలో విడిగా గైడ్​లైన్స్​ జారీ చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. 
  •     ఒక మండలంలో ఒకలా, ఇంకో చోట మరొకలా కాకుండా అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో సర్వీసులు సరిగ్గా అంది, పరిపాలన అవసరాలు తీర్చేలా పోస్టింగులు ఇవ్వాలని రాష్ట్ర సర్కార్​ స్పష్టం చేసింది. రిమోట్​ ఏరియాల్లోనూ  సిబ్బంది పనిచేసేలా ఉద్యోగుల సర్దుబాటు ఉండాలని పేర్కొంది.  
  •     కొత్త జోనల్ విధానంలో ఆయా జిల్లాలకు అలకేట్​ అయిన ఉద్యోగులు అప్పీళ్ల కోసం అప్లికేషన్​ పెట్టుకోవాలని రెండు రోజుల కిందట ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఇప్పుడు కొత్తగా కేటాయించిన పోస్టులో చేరిన తర్వాతే అప్పీళ్లను స్వీకరించనుంది.