ఈతరం పెండ్లి పిల్లల్లో ఫుల్ జోష్

ఈతరం పెండ్లి పిల్లల్లో ఫుల్ జోష్

ఒకప్పుడు పెండ్లిపిల్లలు  సిగ్గుపడుతూ, తల వంచి తాళి కట్టించుకునేవాళ్లు. కానీ, ఈ కాలం అమ్మాయిలు అలాకాదు. తమ పెండ్లి వేడుకలో ఫుల్​ జోష్​తో ఉంటున్నారు. పెండ్లి మండపానికి కారు, బండి నడుపుకుంటూ వెళ్లే పెండ్లిపిల్లలు కొందరైతే.. మరికొందరు గెస్ట్​ల ముందు డాన్స్​ చేస్తున్నారు. ఇలా తమకి ఏది ఇష్టమో చెప్పకనే చెప్తున్నారు. ‘పెండ్లిపిల్లలు ఇలానే ఉండాల’నే ​ ట్రెండ్​ను బ్రేక్​​ చేసి, తమ పెండ్లి రోజును అందమైన జ్ఞాపకంగా మలుచుకుంటున్నారు. అలాంటి పెండ్లిపిల్లలే ఈ ఇద్దరు...
హిందీ కామెడీ సీరియల్​ ‘తారక్​ మెహతా కా ఊల్తా​ చష్మా​’​ ఫేం దిలీప్​ జోషి ఈమధ్యే తన కూతురు నియతి పెండ్లి చేశాడు. అయితే, ఆ పెండ్లికి వెళ్లినవాళ్లలో చాలామంది ఆమె జుట్టు గురించే ఎక్కువ మాట్లాడుకున్నారు. కారణం నియతి జుట్టు నెరిసి(తెల్లగా) ఉండటమే. పెండ్లికి వచ్చిన వాళ్లు ‘నా జుట్టు చూసి ఏమనుకుంటారో’ అని ఆలోచించలేదు నియతి. అందుకే  జుట్టుకు రంగు వేసుకోలేదు. పెండ్లి రోజున ఎరుపు, తెలుపు రంగులు కలగలసిన చీర కట్టుకుని, నగలు పెట్టుకుని రెడీ అయింది. చక్కగా కొప్పు చుట్టుకుని, ఆ కొప్పు చుట్టూ గులాబీ, మల్లెపూలు పెట్టుకుని నవ్వుతూ మండపంలోకి అడుగు పెట్టింది. ‘తెల్ల జుట్టు చూసి పెండ్లికి వచ్చిన వాళ్లు ఏం అనుకున్నా పర్లేదు. నాకు నచ్చినట్టు నేనుండాలి’ అనుకుందామె. ఆమె కాన్ఫిడెన్స్​ చాలామందికి నచ్చింది. దాంతో ఆమె పెండ్లిఫొటోలు నెట్​లో వైరల్​ అవుతున్నాయి.
తల్లి ఫొటోతో...
అది పాకిస్తాన్​లోని ఇస్లామాబాద్​. అక్కడ ఒక పెండ్లి జరుగుతోంది. గెస్టులంతా కూర్చొని ఉన్నారు. కార్పెట్​ మీద పెండ్లిపిల్ల చేయి పట్టుకుని ఆమె తండ్రి వేదికపైకి తీసుకొస్తున్నాడు. పెండ్లి పిల్ల చేతిలో ఒక ఫొటో ఫ్రేమ్​ పట్టుకుని నడుస్తుండడంతో ఆమె పైనే అందరి చూపులు నిలిచాయి. ఆ ఫొటో చనిపోయిన ఆమె తల్లిది. ఒకవైపు పెండ్లి జరుగుతుందన్న సంతోషం, మరోపక్క కన్నతల్లి పక్కన లేదనే బాధతో కళ్ల నిండా నీళ్లు. 
ఆ దృశ్యం చూసిన అక్కడి వాళ్లందరి కళ్లు చెమ్మగిల్లాయి. ఈ ఎమోషనల్​ వీడియోని రెండు రోజుల కిందట ఇన్​స్టాగ్రామ్​లో  పోస్ట్ చేశాడు ఒక ఫొటోగ్రాఫర్. ‘‘పెండ్లిరోజున తల్లి పక్కన లేని ఆడబిడ్డలందరికీ ఈ వీడియో అంకితం. మా అమ్మంటే నాకు చాలా ఇష్టం. నిన్ను చాలా మిస్​ అవుతున్నాను అమ్మా”అనే క్యాప్షన్​ ఉన్న ఈ వీడియోని ఇప్పటివరకు 3 లక్షల మంది చూశారు.