టార్గెట్‌ క్లీన్‌స్వీప్‌

టార్గెట్‌ క్లీన్‌స్వీప్‌
  • నేడు కివీస్‌‌తో ఇండియా టీ20 మ్యాచ్‌‌
  • రిజర్వ్‌‌ ప్లేయర్లను పరీక్షించే చాన్స్‌‌ 
  • రా. 7 నుంచి స్టార్‌‌ స్పోర్ట్స్‌‌లో 

వరుసగా రెండు విజయాలతో ఇప్పటికే సిరీస్‌‌ పట్టేశాం..! టాపార్డర్‌‌ దుమ్మురేపుతోంది..! బౌలర్లు అదరగొడుతున్నారు..! కొత్త ప్లేయర్లు సైతం సత్తా చాటుతున్నారు..! ఇక మిగిలింది మరో టీ20నే..! దాన్నీ గెలిస్తే  సిరీస్‌‌ను క్లీన్‌‌స్వీప్‌‌ చేయొచ్చు..! టీ20 వరల్డ్‌‌కప్‌‌లో ఓటమికి న్యూజిలాండ్‌‌పై మరోసారి రివెంజ్‌‌ తీర్చుకోవచ్చు..!  టెస్టు సిరీస్‌‌ ముందు మరింత కాన్ఫిడెన్స్‌‌ పెంచుకోవచ్చు..! ఈ నేపథ్యంలో నేడు ఈడెన్‌‌ గార్డెన్స్‌‌లో కివీస్‌‌తో జరిగే లాస్ట్‌‌ మ్యాచ్​లోనూ ఇండియా గెలుపు జోరు కొనసాగించాలని చూస్తోంది..! ఓవైపు న్యూజిలాండ్‌‌ను 3-0తో స్వీప్‌‌ చేయడంతో పాటు తొలి రెండు మ్యాచ్‌‌ల్లో అవకాశాలు రాని ప్లేయర్లకు చాన్స్‌‌ ఇచ్చి కొత్త కాంబినేషన్స్​ను  పరీక్షించాలని భావిస్తోంది..! అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు కుర్రాళ్లు సైతం రెడీగా ఉన్నారు..!

కోల్‌‌‌‌కతా:  కొత్త హెడ్‌‌‌‌ కోచ్‌‌‌‌ రాహుల్‌‌‌‌ ద్రవిడ్‌‌‌‌, నయా కెప్టెన్‌‌‌‌ రోహిత్ శర్మ నేతృత్వంలో అంచనాలు అందుకుంటున్న టీమిండియా మరో సవాల్‌‌‌‌కు సిద్ధమైంది. రిజర్వ్‌‌‌‌ ప్లేయర్లకు చాన్స్‌‌‌‌ ఇస్తూ , సిరీస్‌‌‌‌ క్లీన్‌‌‌‌ స్వీప్‌‌‌‌ చేయడమే లక్ష్యంగా ఆదివారం ఇక్కడిఈడెన్‌‌‌‌ గార్డెన్స్‌‌‌‌లో జరిగే  మూడో  టీ20లో న్యూజిలాండ్‌‌‌‌ తో తలపడనుంది.   తొలి రెండు మ్యాచ్‌‌‌‌ల్లో గెలిచి మూడు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌ను 2–0తో ఇప్పటికే సొంతం చేసుకున్న టీమిండియా లెక్కను 3–0కు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అది జరిగితే పూర్తి స్థాయి కెప్టెన్‌‌‌‌గా రోహిత్‌‌‌‌కు, కొత్త కోచ్‌‌‌‌ ద్రవిడ్‌‌‌‌కు ఇంతకంటే గొప్ప ఆరంభం మరొకటి ఉండదు.  అంతేకాక టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ వైఫల్యం నేపథ్యంలో టీమిండియాకు భారీ విజయం కూడా అవసరముంది. మరోపక్క చివరి మ్యాచ్‌‌‌‌లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని కివీస్‌‌‌‌ భావిస్తోంది. దీంతో ఈడెన్‌‌‌‌లో  హోరాహోరీ పోరాటం ఖాయంగా కనిపిస్తోంది.  కాగా,  బీసీసీఐ ప్రెసిడెంట్‌‌‌‌ సౌరవ్‌‌‌‌ గంగూలీ స్టేడియంలోని గంటను మోగించి ఈ మ్యాచ్‌‌‌‌ను ప్రారంభించే అవకాశముంది.

కుర్రాళ్లకు అవకాశం..

థర్డ్‌‌‌‌ టీ20 బరిలోకి దిగే టీమిండియాపై ఎలాంటి ఒత్తిడి లేదు. పైగా ప్లేయర్‌‌‌‌ సెలక్షన్‌‌‌‌, టాస్‌‌‌‌ నుంచి అన్ని అంశాలు జట్టుకు అనుకూలంగా జరుగుతున్నాయి. దీంతో బెంచ్‌‌‌‌ బలాన్ని పరీక్షించుకునే అవకాశం దొరికింది.  అయితే కివీస్‌‌‌‌ను  క్లీన్‌‌‌‌ స్వీప్‌‌‌‌ చేసే అరుదైన అవకాశం ముందున్న నేపథ్యంలో తుది జట్టు ఎంపిక విషయంలో కోచ్‌‌‌‌ ద్రవిడ్‌‌‌‌, కెప్టెన్‌‌‌‌ రోహిత్‌‌‌‌  కాస్త అప్రమత్తంగా ఉండి తీరాలి. బ్యాటర్లు రుతురాజ్‌‌‌‌ గైక్వాడ్‌‌‌‌, ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌ ఫైనల్‌‌‌‌ ఎలెవన్‌‌‌‌లోకి రావొచ్చు. ఐపీఎల్‌‌‌‌లో అదరగొట్టిన రుతురాజ్‌‌‌‌.. టాప్‌‌‌‌–3 ప్లేసుల్లో బ్యాటింగ్‌‌‌‌కు సరిపోతాడు.  రోహిత్‌‌‌‌ బరిలోకి దిగడం ఖాయం కాగా టెస్ట్‌‌‌‌ సిరీస్‌‌‌‌ నేపథ్యంలో కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌కు విశ్రాంతినిచ్చి రుతురాజ్‌‌‌‌ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. లేదంటే గైక్వాడ్‌‌‌‌ కోసం  సూర్యకుమార్‌‌‌‌ను బెంచ్‌‌‌‌కు పరిమితం చేయాలి. టెస్టు సిరీస్​కు ముందు రాహుల్‌‌‌‌కు రెస్ట్‌‌‌‌ ఇచ్చేందుకే మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ మొగ్గు చూపవచ్చు.   వరల్డ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ నుంచి బ్రేక్‌‌‌‌ లేకుండా ఆడుతున్న వికెట్‌‌‌‌ కీపర్‌‌‌‌ రిషబ్‌‌‌‌ పంత్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌ బరిలోకి దిగబోతున్నాడు. ఇక, ఆరో బౌలర్‌‌‌‌గా భావిస్తున్న వెంకటేశ్‌‌‌‌ అయ్యర్‌‌‌‌తో ఈడెన్‌‌‌‌లో పూర్తి కోటా బౌలింగ్‌‌‌‌ చేయించే అవకాశాలున్నాయి. ఇక, ఐపీఎల్‌‌‌‌లో సెకండ్‌‌‌‌ హయ్యెస్ట్‌‌‌‌ వికెట్‌‌‌‌ టేకర్‌‌‌‌గా నిలిచిన యంగ్‌‌‌‌ పేసర్‌‌‌‌ అవేశ్‌‌‌‌ ఖాన్‌‌‌‌  కూడా ఇంటర్నేషనల్‌‌‌‌ డెబ్యూ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దీపక్‌‌‌‌ చహర్‌‌‌‌, భువనేశ్వర్‌‌‌‌లో ఒకరి స్థానంలో అవేశ్‌‌‌‌ బరిలోకి దిగుతాడు. రాంచీలో తన తొలి మ్యాచ్‌‌‌‌లోనే అదరగొట్టిన హర్షల్‌‌‌‌ అదే జోరు కొసాగించాలని మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆశిస్తోంది.  అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌, అశ్విన్‌‌‌‌లో ఒకరికి బదులుగా యుజ్వేంద్ర చహల్‌‌‌‌కు అవకాశం రావొచ్చు. తొలి రెండు మ్యాచ్‌‌‌‌ల్లో టాపార్డరే సత్తా చాటిన నేపథ్యంలో ఈ పోరులోనూ మిడిలార్డర్‌‌‌‌పైనే అందరి దృష్టి ఉండనుంది. ముఖ్యంగా కుర్రాళ్ల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ మళ్లీ ఫామ్‌‌‌‌లోకి రావాలని ఆత్రుతగా ఉన్నాడు.

కివీస్‌‌ ‘డెత్‌‌’ సమస్య..

వరల్డ్‌‌ కప్‌‌ ఫైనల్‌‌తో పాటు వరుసగా రెండు టీ20ల్లో ఓడిన న్యూజిలాండ్‌‌ డీలా పడిపోయింది. బ్యాటింగ్‌‌, బౌలింగ్‌‌లో  ఎప్పట్లాగే బలంగా ఉన్నప్పటికీ డెత్‌‌ ఓవర్ల (15–20) బ్యాటింగ్‌‌లో తడబాటే తొలి రెండు మ్యాచ్‌‌ల్లో వారి కొంపముంచింది. టాపార్డర్‌‌ బ్యాటర్లు అదిరిపోయే స్టార్ట్‌‌ ఇచ్చినా.. ఇన్నింగ్స్‌‌ చివర్లో ఇండియా బౌలర్లకు అవకాశమిస్తున్నారు. దీంతో  గత రెండు మ్యాచ్‌‌ల్లో ఓ మాదిరి లక్ష్యాన్నే నిర్దేశించగలిగారు. బ్యాటింగ్‌‌లో రెగ్యులర్​ కెప్టెన్‌‌ కేన్‌‌ విలియమ్సన్‌‌ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది.  ఈ సమస్యను అధిగమిస్తే కివీస్‌‌ను ఆపడం కష్టం.  అదే ఛేజింగ్‌‌కు వెళ్లాల్సి వస్తే ఎంతటి లక్ష్యాన్ని అయినా పూర్తి చేసే సత్తా కివీస్‌‌ లైనప్‌‌కు ఉంది. వైట్‌‌వాష్‌‌ ముప్పు ఉన్నప్పటికీ న్యూజిలాండ్‌‌ గత మ్యాచ్‌‌లో ఆడిన జట్టునే కొనసాగించవచ్చు. బ్యాటింగ్‌‌లో గప్టిల్‌‌, చాప్‌‌మన్‌‌, డారిల్‌‌ మిచెల్‌‌.. బౌలింగ్‌‌లో ట్రెంట్‌‌ బౌల్ట్‌‌ కీలకం కానున్నారు. ఫిలిప్స్‌‌, సీఫర్ట్‌‌, నీషమ్‌‌ నుంచి మేనేజ్‌‌మెంట్‌‌ మరింత ఆశిస్తోంది.

పిచ్‌‌/ వాతావరణం

ఈడెన్‌‌ గార్డెన్స్‌‌ వికెట్‌‌ నుంచి  ఇటీవల పేస్‌‌, బౌన్స్‌‌ అధికంగా లభిస్తుంది. న్యూజిలాండ్‌‌ బౌలర్లకు ఇది అడ్వాంటేజ్‌‌ కానుంది.  భారీ స్కోర్లు వచ్చే చాన్సుంది.  మంచు ప్రభావం తీవ్రంగా ఉండనుంది. అందువల్ల టాస్‌‌ మరోసారి కీలకం కానుంది. వాన ముప్పు లేదు.

జట్లు (అంచనా)

ఇండియా:  రోహిత్‌‌ శర్మ (కెప్టెన్‌‌), కేఎల్‌‌ రాహుల్‌‌/ రుతురాజ్‌‌ గైక్వాడ్‌‌, సూర్యకుమార్‌‌,  శ్రేయస్‌‌ అయ్యర్‌‌, ఇషాన్‌‌ కిషన్‌‌ (కీపర్), వెంకటేశ్‌‌ అయ్యర్‌‌, అక్షర్‌‌ పటేల్‌‌/ చహల్‌‌, అశ్విన్‌‌, అవేవ్‌‌ ఖాన్‌‌, దీపక్‌‌ చహర్‌‌/ భువనేశ్వర్‌‌, హర్షల్‌‌ పటేల్‌‌.

న్యూజిలాండ్‌‌ : గప్టిల్‌‌, డారిల్‌‌ మిచెల్‌‌, చాప్‌‌మన్‌‌, ఫిలిప్స్‌‌, సీఫర్ట్‌‌ (కీపర్‌‌), నీషమ్‌‌, శాంట్నర్‌‌, మిల్నే, సౌథీ (కెప్టెన్), ఇష్‌‌ సోధీ, బౌల్ట్‌‌.