పెండ్లి చేసుకుని వస్తున్న కొత్త జంటపై పెండ్లి కూతురు బంధువులు దాడి

పెండ్లి చేసుకుని వస్తున్న కొత్త జంటపై పెండ్లి కూతురు బంధువులు దాడి
  • కారు జీపీఎస్ ఆధారంగా ట్రేస్ చేసి అటాక్​
  •  అమ్మాయిని తీసుకుని పరార్​
  • ఘటన వెనుక బీఆర్ఎస్ కార్పొరేటర్!

హనుమకొండ/ కాజీపేట/ హుజూరాబాద్, వెలుగు: పెండ్లి చేసుకుని వస్తున్న కొత్త జంటపై పెండ్లి కూతురు బంధువులు దాడి చేశారు. అబ్బాయిని తీవ్రంగా కొట్టి అమ్మాయిని అక్కడి నుంచి లాక్కెళ్లారు. ఈ ఘటన బుధవారం రాత్రి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో జరగ్గా, గురువారం రోజంతా హైడ్రామా కొనసాగింది. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండకు చెందిన రవి కుమార్ ఓ పేపర్ ప్రింటింగ్ సెక్షన్ లో పని చేస్తున్నాడు. మడికొండకు చెందిన బైరి రాజు,- వినోద కూతురు ప్రసన్న, రవికుమార్ చిన్నతనం నుంచే ఫ్రెండ్స్. పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇద్దరి కులాలు వేర్వేరు కావడం, ఇంట్లో ఒప్పుకోరన్న కారణంతో భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో బుధవారం పెండ్లి చేసుకున్నారు. తర్వాత మడికొండ పోలీస్ స్టేషన్​కు వెళ్లేందుకు బయల్దేరగా.. అమ్మాయి బంధువులు వీళ్ల కోసం వెతుకుతున్నట్టు తెలిసింది. దీంతో వారికి దొరకకుండా ఉండేందుకని సాయంత్రం హుజూరాబాద్ వైపు బయల్దేరారు.

జీపీఎస్​తో ట్రాక్​ చేసి..

పెండ్లికి ముందు రవికుమార్ ఓ కారును రెంట్ తీసుకొని అమ్మాయిని కొత్తకొండ వీరభద్రస్వామి గుడికి తీసుకెళ్లాడు. విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు కారు ఓనర్ వద్దకు వెళ్లారు. కారు జీపీఎస్ ఎనేబుల్ చేసి ఉండటంతో అలా ట్రాక్ చేశారు. కారు హుజూరాబాద్ వైపు వెళ్తున్నట్టు గుర్తించారు. జీపీఎస్ ఆధారంగా ఫాలో అయ్యారు. రాత్రి 10 గంటల టైంలో హుజూరాబాద్ పట్టణంలో కారును పట్టుకున్నారు. డ్రైవర్ పై దాడి చేసి, రవికుమార్ ను బయటకు లాగి తమ కారులో ఎక్కించుకున్నారు. విచక్షణారహితంగా దాడి చేసి, పరకాల ఎక్స్ రోడ్డు సమీపంలో అతడిని పడేసి.. అమ్మాయిని తీసుకుని వెళ్లారు. గాయాలతో రోడ్డుపై పడిపోయిన రవికుమార్.. ఫోన్ ద్వారా తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. అక్కడికి చేరుకున్న వారు అతడికి స్థానికంగా ఓ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ చేయించి తీసుకెళ్లారు. రవికుమార్ పై దాడి వీడియో వైరల్ అయింది.

అధికార పార్టీ కార్పొరేటర్​ అండతో..

రవిపై దాడి చేసి అమ్మాయిని తీసుకెళ్లడం వెనుక గ్రేటర్ వరంగల్​కు చెందిన బీఆర్ఎస్ కార్పొరేటర్ హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అమ్మాయి కుటుంబ సభ్యులతో కార్పొరేటర్ ఫ్యామిలీకి సాన్నిహిత్యం ఉండగా.. అతని అండతోనే రవికుమార్ పై దాడి జరిగిందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై మడికొండ సీఐ వేణును వివరణ కోరగా.. ప్రసన్న కనపడట్లేదని బుధవారం ఆమె పేరెంట్స్ ఇచ్చిన కంప్లైంట్​తో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గురువారం అమ్మాయి తల్లిదండ్రులకు ఫోన్ చేయగా.. వాళ్లు హైదరాబాద్ లో ఉన్నట్లు చెప్పారన్నారు. మిస్సింగ్ కేసు నమోదైనందున అమ్మాయిని తీసుకుని స్టేషన్​కు రావాలని సూచించామన్నారు.

హుజూరాబాద్ పీఎస్​లో బాధితుడి ఫిర్యాదు

తనను తీవ్రంగా కొట్టి భార్యను కిడ్నాప్ చేశారని బాధితుడు రవికుమార్ హుజూరాబాద్ పీఎస్ లో గురువారం రాత్రి ఫిర్యాదు చేశాడు. ప్రసన్న తల్లిదండ్రులు పెండ్లికి నిరాకరించారని, దీంతో ఆమెను గుడిలో పెండ్లి చేసుకున్నట్లు తెలిపాడు. ఆమె అన్నలు బైరి ప్రశాంత్, బైరి ప్రణయ్ వారి ఫ్రెండ్స్ దువ్వ అశోక్, బోగి మహేశ్, గణేశ్, శ్రీకాంత్, సందీప్, భరత్, తరుణ్, రాజేశ్, పుతీన్, రాజు కలిసి హుజూరాబాద్​లో దాడిచేసినట్లు పేర్కొన్నాడు. ప్రసన్నను కిడ్నాప్​ చేసి తీసుకెళ్లారని చెప్పారు. వారి నుంచి తనకు, తన భార్యకు ప్రాణభయం ఉందని పేర్కొన్నాడు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.