పెళ్లింట విషాదం... వరుడు మృతి

పెళ్లింట విషాదం... వరుడు మృతి

పెళ్లింట తీరని విషాదం ఏర్పడింది. వివాహం అయిన ఆరు రోజులకే  వరుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో చోటు చేసుకుంది. తోమలపల్లి సమీపంలో హైవేపై మంగళవారం రాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ శశికళ, భాస్కర్ గౌడ్ దంపతుల కుమారుడు సాయిచరణ్ కు నవంబర్ 24న పెళ్లి జరిగింది. అయితే కారు సర్వీసింగ్ చేయాలంటూ.. మంగళవారం మహబూబ్ నగర్ కు కారు తీసుకొని సాయి చరణ్ వెళ్లాడు. 

రాత్రి 8 గంటలకు ఇంటికి ఫోన్ కాల్ చేసి బయల్దేరుతున్నానని చెప్పాడు. అయితే రాత్రి తొమ్మిదిన్నర దాటిన ఇంకా ఇంటికి చేరలేదు. దీంతో తండ్రి సాయి చరణ్ కు కాల్ చేశారు. ఫోన్ ఎత్తకపోవడంతో.వెంటనే తండ్రి ఇంటినుంచి బయల్దేరాడు. రోడ్డు వెంట వెతుక్కొని వెళ్లారు. అయితే తోమాలపల్లి వద్ద కారు అదుపు తప్పి బోల్తా పడిన విషయం గమనించి వెంటనే కారు వద్దకు వెళ్లి చూశారు. అయితే అప్పటికే కారులో సాయిచరణ్ మృతి చెందాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పెబ్బేరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. పెళ్లైన ఆరు రోజులకే కన్న కొడుకు చనిపోవడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.