ఏషియాటిక్​ మిర్రర్​ స్టోరీ

ఏషియాటిక్​ మిర్రర్​ స్టోరీ

స్వాతంత్ర్య పోరాట సమయంలో  సమాచారం చేరవేయడంలో పత్రికలు కీలకపాత్ర పోషించాయి. బ్రిటీష్​ పరిపాలనలో చేస్తున్న అరాచకాలను ప్రజలకు వివరిస్తుండ డంతో కొందరు గవర్నర్​ జనరల్స్​ కక్ష సాధింపు చర్యలకు దిగారు. లార్డ్​ వెల్లస్లీ సెన్షార్​​ షిప్​ చట్టం తీసుకురాగా, చార్లెస్​ మెట్​కాఫ్​ ఈ చట్టం రద్దు చేసి భారత   పత్రికలకు స్వాతంత్ర్యం కల్పించాడు. దేశంలో మొదటి పత్రిక బెంగాల్​ గెజిట్​ అగస్టన్​ హిక్కి ప్రారంభించారు. అనంతరం కొందరు భారతీయులు వివిధ భాషల్లో పత్రికలు ముద్రించి దేశ ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించారు. 

దేశంలో తొలి ముద్రణాలయాన్ని 1557లో పోర్చుగీసువారు గోవాలో  ఏర్పాటు చేశారు. ఇందులో జెసూట్స్​ ఆఫ్​ గోవా అనే పేరుతో తొలి గ్రంథం ముద్రించారు. ఆ తర్వాత కాలంలో 1684లో బ్రిటీష్​ ఈస్టిండియా కంపెనీ బొంబాయిలో ముద్రణాలయం స్థాపించింది. దేశంలో తొలి ఆంగ్ల వారపత్రిక బెంగాల్​ గెజిట్​ 1780, జనవరి 27న ప్రారంభమైంది. ఈ పత్రికను స్థాపించింది జేమ్స్​ అగస్టన్​ హిక్కి. ఇది ఒక వార, రాజకీయ, వాణిజ్య విషయక పత్రిక. గవర్నర్​ జనరల్​ వార్​ హేస్టింగ్స్​కు వ్యతిరేకంగా వార్తలు రాసినందుకు 1782లో హిక్కీని అరెస్టు చేశారు. ఫలితంగా బెంగాల్​ గెజిట్​ పత్రిక మూతపడింది. ఈ సందర్భంగా పత్రికా స్వాతంత్ర్యం అనేది ఆంగ్లేయులకు మనుగడతో ముడిపడిన హక్కు అని హిక్కీ వ్యాఖ్యానించారు.

1784లో కలకత్తా గెజిట్​ స్థాపించారు. ఇది ప్రభుత్వ అధికారిక పత్రికగా మారింది. 1799లో వెల్లస్లీ పత్రికలపై సెన్సార్​షిప్​ విధించాడు. ఈ​ సెన్సార్​షిప్​ ను​ 1818లో లార్డ్​ హేస్టింగ్స్ తొలగించాడు. దక్షిణ భారత దేశంలో  తొలి పత్రిక మద్రాస్​ కొరియర్​ 1784లో మద్రాస్​ రాష్ట్రంలో ప్రారంభమైంది. ప్రభుత్వం, వేల్స్​ యువరాజుపై అసత్యవార్తలు రాసినందుకు ఇండియన్​ హెరాల్డ్స్​ పత్రిక సంపాదకుణ్ని దేశం నుంచి పంపించివేశారు. 1799లో పత్రికలన్నీ  ప్రతిని ముందుగా ప్రభుత్వ తనిఖీకి సమర్పించిన తర్వాతనే ప్రచురించాలని నిబంధనను బ్రిటీష్​ ప్రభుత్వం విధించింది. బొంబాయి రాష్ట్రంలో 1789, 1790, 1791ల్లో బాంబే హెరాల్డ్​, బాంబే కొరియర్, బాంబే గెజిట్​ పత్రికలు వరుసగా వెలువడ్డాయి. 

బ్రిటీష్​ ప్రభుత్వ నియంత్రణ 

సెన్సార్​షిప్​ చట్టం(1799): ఈ చట్టాన్ని లార్డ్​ వెల్లస్లీ తెచ్చాడు. దీని ప్రకారం పత్రిక దాని ప్రింటర్​, ఎడిటర్, యజమాని పేరును ప్రచురించాలి. ప్రచురించే ముందు ప్రతిని సెన్సార్​ సెక్రటరీకి అందజేయాలి. ఈ చట్టాన్ని 1807లో జర్నల్స్, పుస్తకాలు, పాంప్లెట్లకూ వర్తింపజేశారు. ఈ చట్టాన్ని 1818లో మార్క్వేస్​ హేస్టింగ్స్​ రద్దు చేశాడు. 

పత్రికా స్వేచ్ఛ/ విముక్తి చట్టం: 1835లో గవర్నర్​ జనరల్​ చార్లెస్​ మెట్​కాఫ్​ లైసెన్సింగ్​ చట్టాన్ని రద్దు చేసి పత్రికలకు స్వేచ్ఛ కల్పించాడు. ఈయనకు మెకాలే సహాయపడ్డారు. దీనిని నిరసిస్తూ ఈస్ట్​ ఇండియా కంపెనీ మెట్​కాఫ్​ను స్వదేశానికి పిలిపించింది. మెట్​కాఫ్​ను భారత పత్రికలకు స్వాతంత్ర్యం ప్రసాదించిన వ్యక్తిగా ఖ్యాతిగడించారు.

ప్రాంతీయ భాషా పత్రికల చట్టం: దీనిని లార్డ్​ లిట్టన్​ ప్రవేశపెట్టాడు. ఇది భారతీయ పత్రికల నోరు నొక్కే చట్టం. గ్యాగింగ్​ యాక్ట్​గా పేర్కొంటారు.. దీనిని ఐరిష్​ పేపర్​ యాక్ట్​ ఆధారంగా తెచ్చారు. ఈ చట్టాన్ని 1882లో లార్డ్​ రిప్పన్ తొలగించాడు. బెంగాలీ భాషలో వెలువడే అమృత బజార్​ ఈ చట్టం వల్ల పత్రికగా మారింది. 

న్యూస్​ పేపర్​ యాక్ట్​ (1908): వందేమాతర ఉద్యమ కాలంలో ప్రవేశపెట్టారు. ఈ చట్టంతో యుగాంతర్, వందేమాతరం వంటి అతివాద పత్రికలు మూసేశారు.  

ఇండియన్​ ప్రెస్​ చట్టం (1910): పత్రికలు చెల్లించాల్సిన డిపాజిట్లు పెంచారు. అభ్యంతరకరమైన అంశాలు అనే పదాన్ని నిర్వచించారు. ఈ నిర్వచనం పరిధిలోకి పాలకులు, న్యాయమూర్తులు, పబ్లిక్​ సర్వెంట్లు వచ్చారు. ఈ చట్టం మొదటి ప్రపంచ యుద్ధకాలం (1914–1918)లో తీవ్రంగా అమలు చేశారు. 

ఇండియన్​ ప్రెస్​ చట్టం (1911): శాసనోల్లంఘన ఉద్యమకాలంలో పత్రికలపై ఆంక్షలు విధించడానికి ఈ చట్టం చేశారు. ఈ చట్టం పత్రికల డిపాజిట్లు స్వాధీనం చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాసినందుకు విధించే జరిమానాలు పెంచారు. 

ప్రెస్​ ట్రస్ట్ ఆఫ్​ ఇండియా: ఇది 1947లో నమోదై 1949 నుంచి పనిచేస్తోంది. స్వాతంత్ర్య భారతదేశంలో స్వతంత్ర ప్రతిపత్తిగల వార్తా సంస్థ ఇది.

లైసెన్సింగ్​ రెగ్యులేషన్​ చట్టం (1923): భారతదేశంలోని పత్రికలపైన సెన్సార్​ కొనసాగించాలని థామస్​ మన్రో కమిటీ సూచన మేరకు ఈ చట్టం చేశారు. దీనిని జాన్​ ఆడమ్​ తీసుకువచ్చాడు. 

ఈ చట్టంతో పత్రిక ప్రచురణకర్త ప్రెస్​ను ప్రారంభించే ముందు తప్పకుండా లైసెన్సు తీసుకోవాలి. లైసెన్స్​ లేకుండా ఎవరూ పత్రికలను స్థాపించకూడదు. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే రూ.400 జరిమానా చెల్లించాలి. ప్రచురించిన పుస్తకాలు, పత్రికల ప్రతులు ప్రభుత్వానికి సమర్పించాలి. గవర్నర్​ జనరల్స్​కు పత్రిక లైసెన్సు రద్దు చేసే అధికారం ఉంటుంది. ఈ చట్టంతో రామ్మోహన్​రాయ్​కు చెందిన మిరాత్​ ఉల్​ అక్బర్ పత్రిక ప్రచురణ నిలిచిపోయింది.

ముఖ్యమైన పత్రికలు

దిగ్దర్శన (1818): ఇది తొలి దేశ భాషా పత్రిక. దీనికి మార్ష్​మన్​ సంపాదకత్వం వహించాడు.

సమాచార దర్పణ్​(1818): ఈ పత్రిక సంపాదకుడు కూడా మార్ష్​మన్​. ఇది స్థానిక వార్తలను ప్రచురిస్తూ ఆధునిక ఉదారవాద భావాలను ప్రచారం చేసింది. దీన్ని విలియం వార్డ్​, మార్షమన్​లు స్థాపించారు.

బంగదూత: సంపాదకుడు మంట్​ గోమరీ మార్టిన్.

టైమ్స్​ ఆఫ్​ ఇండియా: ఈ దిన పత్రికను 1838లో బెన్నెట్​, కోల్​మన్​లు ప్రచురించారు. బాంబే కేంద్రంగా వెలువడింది.

ది హిందూ పేట్రియాట్​: ఈ పత్రికను1853లో ఘోష్​ సోదరులు కలకత్తా నుంచి వెలువరించారు. సంపాదకుడు హరిశ్చంద్ర ముఖర్జీ. 

అమృత బజార్​ (1868): ఈ పత్రికను ఘోష్​ సోదరులైన శిశిర్​కుమార్​, మోతీలాల్​ ఘోష్​లు స్థాపించారు. దీనికి మొదటి సంపాదకుడిగా శిశిర్​కుమార్​ ఘోష్​ పనిచేశారు. ఇది జెస్సోర్​లోని మగుర గ్రామం నుంచి వారపత్రికగా మొదలైంది. 1871 నాటికి పత్రిక ప్రచురణ కలకత్తాకు మారింది. 1878లో ఆంగ్ల పత్రికగా మారింది. 1891 నుంచి దినపత్రికగా రూపాంతరం చెందింది. బ్రిటీష్​ వారికి, భారతీయులకు మధ్య జాతిపరమైన అంతరాన్ని ఎత్తి చూపుతూ మనం మనమే.. వాళ్లు వాళ్లే అని నినదించింది. 

సంజీవని(1883): ఇది ఫ్రెంచి విప్లవ నినాదాలైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే నినాదాలను స్ఫూర్తి పదాలుగా స్వీకరించింది.

ఏషియాటిక్​ మిర్రర్​ (1798): కలకత్తా నుంచి వెలువడే ఆంగ్ల వార పత్రిక. దీనిని సి.కె.బ్రూస్​, శూల్​బ్రెడ్​లు ప్రచురించారు. 

ది హిందూ: 1878లో మద్రాస్​ నుంచి వెలువడింది.ఈ పత్రికను జి.సుబ్రహ్మణ్యం అయ్యర్​, విజయరాఘవాచారి, కస్తూరి రంగన్​లు ప్రారంభించారు.

ద మెయిల్​/ మద్రాస్​ మెయిల్​: ఈ పత్రిక 1868లో మద్రాస్​ ప్రెసిడెన్సీలో ప్రారంభించిన తొలి ఆంగ్ల సాయంకాలం దిన పత్రిక. దీనిని చార్లెస్​ లాపన్​, కార్నిష్​ స్థాపించారు.   ​