
హైదరాబాద్: నిమ్జ్కు పర్యావరణ అనుమతులపై రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ చెన్నై బెంచ్ నోటీసులు జారీ చేసింది. జహీరాబాద్ లోని నిమ్జ్ కు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు ఇవ్వటాన్ని సవాల్ చేస్తూ రైతులు జాతీయ హరిత ట్రిబ్యునల్లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జాతీయ హరిత ట్రిబ్యునల్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది. నోటీసులకు 4 వారాల్లోగా దీనిపై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. జహీరాబాద్ నిమ్జ్ ను 12వేల 650 ఎకరాల్లో సర్కార్ ప్రతిపాదించటాన్ని రైతులు సవాల్ చేస్తూ ఎన్జీటీని ఆశ్రయించారు.
నేషనల్ఇన్వెస్ట్ మెంట్, మాన్యూఫ్యాక్చరింగ్ జోన్(నిమ్జ్) కోసం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని 12 గ్రామాల్లో 12,635 ఎకరాల భూసేకరణ చేస్తున్నారు. ఇప్పటి వరకు 3,800 ఎకరాల వరకు సేకరించారు. అయితే.. మామిడ్గి, హుస్సేల్లి, హద్నూర్, మొలకలపాడు, చాల్కి గ్రామాల రైతులు భూసేకరణను వ్యతిరేకిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని నిమ్జ్లో తొలి పరిశ్రమ ‘వెమ్’ టెక్నాలజీ ప్రాజెక్టుకు ఐటీ మంత్రి కేటీఆర్ గత జూన్ 22వ తేదీన శంకుస్థాపన చేయడంతోపాటు.. ఎంజీ ఈవీ పార్కును ప్రారంభించిన విషయం తెలిసిందే. మంత్రి కేటీఆర్ హాజరవుతున్న విషయం తెలిసి ఆయనను కలసి తమ గోస చెప్పుకుందామని వెళ్లిన వారిపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. పోలీసుల లాఠీ దెబ్బలకు తాళలేక పొలాల గట్లపై పరుగులు పెట్టారు. మంత్రికి తమ గోస చెప్పుకుందామని వెళతుతుంటే పోలీసులు లాఠీలు ప్రయోగించారని ఆవేదన వ్యక్తం చేశారు. నిమ్జ్ కోసం భూములు బలవంతంగా లాక్కుంటున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.