దేశంలోని 50 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు

దేశంలోని 50 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు

న్యూఢిల్లీ : దేశంలోని పలు ప్రాంతాల్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) మంగళవారం దాడులు నిర్వహించింది. ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, రాజస్థాన్-, ఉత్తరప్రదేశ్‌‌లోని సుమారు 50 చోట్ల ఉన్న గ్యాంగ్‌‌స్టర్ల ఇండ్లపై దాడులు జరిగాయి. డ్రోన్ డెలివరీల కేసుతో పాటు దేశ, విదేశాల్లో టెర్రర్ కార్యకలాపాలు, ఇత నేరాలకు సంబంధించి నమోదైన కేసు దర్యాప్తుల్లో భాగంగా ఎన్ఐఏ తనిఖీలు నిర్వహించింది. ఈ దాడులతో టెర్రరిస్టులు, గ్యాంగ్‌‌స్టర్లు, డ్రగ్స్ స్మగ్లర్ల మధ్య జరుగుతున్న కార్యకలాపాలు అడ్డుకునే చర్యలను ఎన్ఐఏ వేగవంతం చేసింది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీల్లో నిర్వహించిన దాడుల్లో డ్రగ్స్, నగదు, కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలు, బినామీ ఆస్తుల వివరాలు, బెదిరింపు లేఖలతో పాటు పేలుడు పదార్థాలు, ఆరు పిస్టల్స్, రివాల్వర్, షాట్‌‌గన్-ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, పంజాబ్-లోని గురుగ్రామ్-లో ముగ్గురు గ్యాంగ్‌‌స్టర్ల ఇండ్లు, ఓ మాజీ సర్పంచ్ ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు.

గ్యాంగ్‌‌స్టర్ అమిత్ దాగర్, అతని సన్నిహితుడి సోదరుడు అనిల్, కర్తార్ సింగ్-ల ఇండ్లల్లో అణువణువు తనిఖీ చేశారు. అమిత్ దాగర్ భార్యను..కర్తార్ సింగ్‌‌లను కొన్ని గంటల పాటు విచారించారు. అక్కడ నాలుగు గంటల పాటు తనిఖీలు చేసిన తర్వాత ఫరూఖ్‌‌నగర్‌‌ పోలీస్‌‌ స్టేషన్‌‌ పరిధి ముషైద్‌‌పూర్‌‌ గ్రామంలోని మాజీ సర్పంచ్‌‌ ఇంట్లో కూడా అధికారులు సోదాలు చేశారు.  డ్రోన్ డెలివరీ కేసుకు సంబంధించి జమ్మూ కాశ్మీర్‌‌లోని పూంచ్ జిల్లాతో సహా పలు ప్రాంతాల్లో అక్టోబర్ 14న ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. అయితే, ఇప్పటివరకు ఆ కేసులో ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. గడిచిన 9 నెలల్లో, పాకిస్తాన్ నుంచి దేశ భూభాగంలోకి 191 డ్రోన్‌‌లు అక్రమంగా ప్రవేశించినట్లు భద్రతా దళాలు గుర్తించాయి. దేశంలోకి సోమవారం కూడా డ్రోన్ అక్రమంగా చొరబడింది. పాక్ నుంచి పంజాబ్-లోని అమృత్​సర్-లోకి  డ్రోన్ వస్తుండగా చూసిన అధికారులు దాన్ని కూల్చి వేశారు. ఇక దేశంలో టెర్రర్ కార్యకలపాలు, ఇత నేరాలకు సంబంధించి ఎన్ఐఏ ఆగస్టు 26 న కొందరిపై కేసు నమోదు చేసింది. ఈ రెండు కేసుల దర్యాప్తులో భాగంగానే పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, యూపీల్లో ఎన్ఐఏ దాడులు నిర్వహిస్తోంది.