మదర్సా స్టూడెంట్ ను విచారించిన ఎన్ఐఏ 

మదర్సా స్టూడెంట్ ను విచారించిన ఎన్ఐఏ 

న్యూఢిల్లీ: ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్ట్ సంస్థ తరఫున యాక్టివిటీస్ జరుగుతున్నట్లు సమాచారం అందడంతో ఆదివారం ఆరు రాష్ట్రాల్లోని13 ప్రాంతాల్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) సోదాలు నిర్వహించింది. టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కు సంబంధించి కీలక డాక్యుమెంట్లు, మెటీరియల్ ను స్వాధీనం చేసుకుంది. దీనికి సంబంధించి ఎన్ఐఏ జూన్ 25న ఢిల్లీలో చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద సుమోటోగా కేసు నమోదు చేసింది. ఆదివారం ఒకేసారి మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్, కర్నాటక, మహారాష్ట్ర, యూపీలోని పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. మహారాష్ట్రలోని నాందేడ్, కొల్హాపూర్ లో  పలు పేపర్లు, మెటీరియల్ స్వాధీనం చేసుకుంది. గుజరాత్​లో భరూచ్, సూరత్, నవ్ సారి, అహ్మదాబాద్​లలో తనిఖీలు జరిగాయి. ఇక్కడ ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని ఎన్ఐఏ విచారిస్తున్నట్లు గుజరాత్ ఏటీఎస్ అధికారులు చెప్పారు. ఇక మధ్యప్రదేశ్ లో భోపాల్, రైసెన్ ప్రాంతాల్లో, యూపీ, కర్నాటక, బీహార్ లోనూ పలు ప్లేస్ లలో సోదాలు చేసినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. 

మదర్సా స్టూడెంట్ ను విచారించిన ఎన్ఐఏ 

యూపీ, సహారణ్ పూర్​లోని దేవ్ బంద్ మదర్సాలో చదువుతున్న స్టూడెంట్​కు పాక్ ఐఎస్ఐతో లింకులు ఉన్నాయన్న అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. ఫరూక్ అనే ఆ విద్యార్థి కర్నాటకకు చెందినవాడని తెలిపింది. ఆదివారం విచారించి విడిచిపెట్టినట్లు పేర్కొంది. అనేక భాషలు నేర్చుకున్న ఫరూక్.. పాక్ ఐఎస్ఐకి చెందిన మాడ్యూల్​తో ఓ సోషల్ మీడియా యాప్ ద్వారా టచ్​లో ఉన్నట్లు తెలిసింది.