గ్రేటర్ నోయిడా: సీనియర్ నేషనల్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ తన పంచ్ పవర్ చూపెడుతోంది. వరుసగా రెండో బౌట్‌లో ఈజీగా గెలిచిన నిఖత్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మీనాక్షి హుడా,అమిత్ పంగల్‌కూడా క్వార్టర్స్ బెర్తులు సొంతం చేసుకున్నారు. బుధవారం జరిగిన విమెన్స్ 51 కేజీ విభాగం ప్రిక్వార్టర్స్‌లో నిఖత్ జరీన్, లడఖ్‌కు చెందిన కుల్సూమా బానోపై పంచ్‌ల వర్షం కురిపించింది.
తెలంగాణ బాక్సర్ దాడికి కుల్సూమా నిలవలేకపోవడంతో తొలి రౌండ్‌లోనే రిఫరీ మ్యాచ్‌ను నిలిపివేసి నిఖత్‌ను విజేతగా ప్రకటించారు. 48 కేజీ బౌట్‌లో ఆలిండియా పోలీస్ టీమ్‌కు ఆడుతున్న ప్రపంచ చాంపియన్ మీనాక్షి 5-0తో జార్ఖండ్‌కు చెందిన అన్నుపై గెలిచింది. మెన్స్ 55 కేజీ ప్రిక్వార్టర్స్‌లో అమిత్ 4-1తో చండీగఢ్ బాక్సర్ క్రిష్ పాల్‌పై గెలుపొందగా.. జాదుమణి సింగ్5–-0తో యూపీకి చెందిన మనీష్ రాథోడ్‌ను చిత్తుగా ఓడించాడు.
