నిపా ఏం చేసిందో ఈ వైరస్‌‌ చెప్తది…

నిపా ఏం చేసిందో ఈ వైరస్‌‌ చెప్తది…

అంద‌‌మైన ప్రాంతాన్ని అతలాకుతలం చేసిందో  అరుదైన వ్యాధి. పదిహేడు మంది ప్రాణాలు తీసి జనాల్ని భయపెట్టాలనుకుంది.  కానీ, మూడున్నర కోట్ల మంది ఒక్కటై ప్రాణాంతకమైన వైరస్‌‌కి అడ్డు నిలిచారు.  ప్రభుత్వ సాయంతో వ్యాధి విస్తరించకుండా కట్టడి చేయగలిగారు.  ‘నిపా’ వైరస్‌‌ కంటే.. దాని బారినపడిన వాళ్లకు ప్రాణాలు ఫణంగా పెట్టి ట్రీట్‌‌మెంట్‌‌ అందించిన వైద్య సిబ్బంది, సేవలందించిన మలయాళీల గురించే దేశం ఎక్కువగా మాట్లాడుకుంది. ఇప్పుడు ఆ హీరోలను గుర్తు చేస్తూ ఒక సినిమా రాబోతోంది. దాని పేరే ‘వైరస్’…

సరిగ్గా ఏడాది క్రితం..  కేరళలో అంతుచిక్కని వైరస్‌‌తో ఒకేసారి ఎనిమిదిమంది చనిపోయారు.  ఆ చావుల వెనుక ‘నిపా’ వైరస్‌‌ ఉన్నట్లు నిర్ధారణ కావటంతో  జనాల్లో భయం రెట్టింపు అయ్యింది.  మెడికల్‌‌ ఎమర్జెన్సీ విధించిన కేరళ ప్రభుత్వం, వైరస్ విస్తరించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. అయితే ప్రమాదకరమైన ఆ వైరస్‌‌ అంతే వేగంతో వ్యాపించి పేషెంట్ల సంఖ్య పెరిగింది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో జనాలు భయంతో బయటకు కూడా అడుగుపెట్టరు. కానీ, తోటి ప్రజలకు సాయం అందించేందుకు కేరళ ప్రజలు రిస్క్‌‌ చేశారు. వైద్య సిబ్బందితో సమానంగా సాధారణ ప్రజలు పేషెంట్లకు ఆపన్నహస్తం అందించారు. అపురూపమైన ఈ ఘట్టాల్ని  తెరపై చూపించాలనే ఉద్దేశంతో ‘వైరస్‌‌’ సినిమా తీశాడు దర్శకుడు ఆషిక్‌‌ అబు.

అసలు కథేందంటే..

కోజికోడ్‌‌, మల్లాపురం జిల్లాల చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం మూడు వేల మందికి వైరస్‌‌ సోకింది.  వైద్యాధికారులు, రాష్ట్ర ప్రభుత్వం కలిసి వైరస్‌‌ ఉధృతి అరికట్టేందుకు ‘ఆపరేషన్‌‌ నిపా’ ప్రారంభించారు. మరోవైపు వైద్యులు, నర్సులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా పేషెంట్లకు సేవలందించారు.
ఇంకోవైపు చాలామంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి పేషెంట్ల బట్టలు ఉతకడం, వాళ్లకు ఆహారం అందించడం, వైరస్‌‌తో ఇన్‌‌ఫెక్షన్‌‌ అయిన డెడ్‌‌బాడీలను పూడ్చిపెట్టడం లాంటి పనులు చేశారు. నిపా వైరస్‌‌ కేసులు ఎక్కువగా  కోజికోడ్‌‌ మెడికల్ కాలేజీలో నమోదయ్యాయి. కథా రచయిత మునిష్‌‌ పరార్‌‌ బంధువు ఆ ఆస్పత్రిలో పనిచేసేవాడు. అతని సహాయంతో మిగతావారి నుంచి వివరాలు తెలుసుకున్నారు. అయితే మునిష్‌‌–అబుల స్టడీ అంతటితోనే ఆగిపోలేదు. పేషెంట్లు, బాధితుల కుటుంబాలు, ప్రభుత్వ అధికారుల్ని ప్రశ్నించి.. వాళ్ల నుంచి వివరాలు సేకరించారు. ఆ విధంగా కథ సిద్ధం అయ్యింది.

భారీ తారాగణం

ఈ సినిమాను భారీ తారాగణంతో తీశాడు అబు. సినిమా అంతా క్రేజ్ ఉన్న స్టార్లతోనే తెరకెక్కించాడు. సీనియర్ నటి రేవతి, టొవినో థామస్‌‌, కుంచాకో బోబన్‌‌, రీమా కల్లింగళ్‌‌, రెహమాన్‌‌, పార్వతి, మడోన్నా సెబాస్టియన్‌‌,  ఇంద్రజిత్‌‌ సుకుమారన్‌‌, రమ్య నంబీశన్‌‌, శ్రీనాథ్‌‌ బషి, ఇంద్రన్స్‌‌ కొచువేలు, కమెడియన్‌‌ సౌబిన్‌‌ షాహిర్‌‌.. ఇలా అంతా స్టార్‌‌ క్యాస్టింగ్‌‌ను ఎంచుకున్నాడు.
అయితే ‘వైరస్‌‌’ని కమర్షియల్‌‌ కోణంలో కాకుండా.. ఆ పాత్రల  కోసమే స్టార్లను సెలక్ట్‌‌ చేశానంటున్నాడు అబు.  మంచి సబ్జెక్ట్‌‌ కావడంతో రెమ్యునరేషన్‌‌ విషయంలో కూడా నటీనటులంతా కాంప్రమైజ్‌‌ అయ్యారట.

ఇన్సిపిరేషన్‌‌ మూవీస్‌‌

అమెరికన్‌‌ మెడికల్‌‌ థ్రిల్లర్‌‌ ‘కంటెజిన్‌‌’(2011) కథ ఇంచుమించుగా ‘వైరస్’ కథను పోలి ఉంటుంది. ప్రమాదకరమైన వ్యాధి వ్యాపించకుండా జనాలంతా మూకుమ్మడిగా ఏం చేస్తారు? వ్యాక్సినేషన్‌‌తో ఆ వ్యాధి నుంచి ఎలా బయటపడతారు.. అనేది  కంటెజిన్‌‌ కథ. ఈ సినిమా స్ఫూర్తితో ‘వైరస్‌‌’ని తీసినట్లు దర్శకుడు ఆషిక్‌‌ అబు చెప్పాడు.  కాకపోతే ప్రభుత్వం, వైద్య సిబ్బంది నిపా కట్టడి కోసం ఏం చేశారన్నది కూడా చూపించబోతున్నాడు.  ‘కంటెజిన్‌‌’తో పాటు ‘సాల్ట్‌‌ ఎన్‌‌ పెప్పర్‌‌’, ‘22 ఫిమేల్‌‌ కొట్టాయం’, ‘గ్యాంగ్‌‌స్టర్‌‌’, ‘రాణి పద్మిని’, ‘మయానది’ సినిమాలకు కూడా  టైటిల్‌‌ కార్డులో క్రెడిట్‌‌ ఇచ్చాడు అబు.

లినీ లాంటోళ్లు ఎందరో…

లినీ పుతుస్సేరి.. నిఫా వైరస్‌‌ సోకిన రోగికి సేవలందిస్తూ.. అదే వ్యాధితో కన్నుమూసిన ఒక నర్సు. చనిపోయేముందు లినీ రాసిన లేఖ సోషల్ మీడియాలో భావోద్వేగాన్ని  నింపింది. గొప్ప విషయం ఏంటంటే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌‌వో) ఘన నివాళి అర్పించిన నలుగురు వైద్య సిబ్బందిలో లినీ కూడా ఉండటం. అంతర్జాతీయ కథనాల్లో ప్రముఖంగా నిలిచిన లినీ గురించి.. ఆమెలాంటి ఎందరో వైద్య సిబ్బంది గురించి ప్రపంచానికి చెప్పాలనే ‘వైరస్‌‌’ సినిమా తీశానంటున్నాడు అబు. ‘కథ కోసం పేషెంట్లను ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ల కోసం సాయం చేసిన వాళ్ల గురించి చెప్పారు.  వాళ్లంతా నిజమైన హీరోలు. నిపా అనే చీకటి నుంచి ప్రజలను వెలుగులోకి తెచ్చేందుకు తమ ప్రాణాలను త్యాగం చేశారు. వాళ్ల గురించి ప్రపంచానికి చాటి చెప్పేందుకు వైరస్‌‌ సినిమాను ఉపయోగించుకుంటున్నామని’ చెప్పాడు అబు.