నన్ను టార్గెట్ చేశారు.. భారత్‌కు అప్పగించొద్దు

నన్ను టార్గెట్ చేశారు.. భారత్‌కు అప్పగించొద్దు

పంజాబ్ నేష‌నల్ బ్యాంకుకు రూ. 14 వేల కోట్లు ఎగ్గొట్టి వ‌జ్రాల వ్యాపారి నీర‌వ్ మోదీ యూకేకు పారిపోయిన సంగతి తెలిపిందే. ఆ కేసుకు సంబంధించి నీరవ్ మోడీని ఇండియాకు అప్పగించాలని ఫిబ్రవరి 25న వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అందులో భాగంగా యూకే హోం కార్యదర్శి ప్రీతి పటేల్ కూడా నీరవ్‌ను భారత్‌కు అప్పగించాలంటూ ఏప్రిల్ 15న  ఆమోదం తెలిపారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసు మరియు మనీలాండరింగ్ కేసులో నీరవ్ దోషిగా తేలిన రెండు నెలల తర్వాత ఆయనను భారత్‌కు అప్పగించడానికి యూకే ప్రభుత్వం ఆమోదించింది.

అయితే తనను భార‌త్‌కు అప్ప‌గించ‌వద్దంటూ నీరవ్ మోడీ మరోసారి కోర్టు మెట్లు ఎక్కారు. అందుకోసం ఇప్ప‌టికే బ్రిట‌న్ కోర్టులో పిటిష‌న్ వేయ‌గా.. ఆ పిటిష‌న్‌ను కోర్టు కొట్టివేసింది. దాంతో ఆయన తాజాగా యూకే హైకోర్టును ఆశ్ర‌యించారు. త‌న మాన‌సిక స్థితి స‌రిగా లేద‌ని, ఈ ప‌రిస్థితుల్లో త‌న‌ను భార‌త్‌కు అప్ప‌గిస్తే న్యాయం జ‌రగ‌ద‌ని, పైగా తనను రాజకీయ కారణాల వల్ల లక్ష్యంగా చేసుకున్నారని నీరవ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

భారత్ అభ్యర్థన ఆధారంగా నీరవ్ మోడీని అరెస్టు చేసి మార్చి 19, 2019  నుంచి లండన్ శివార్లలోని వాండ్స్‌వర్త్ జైలులో ఉంచారు. అప్పటి ఆయన పలుమార్లు బెయిల్ కోసం అప్లై చేసినా.. బ్రిటన్ కోర్టు మాత్రం బెయిల్ ఇవ్వడానికి అంగీకరించలేదు.