
- బీజేపీని గెలిపిస్తే రాష్ట్రాన్ని దేశంలో నంబర్ వన్ చేస్తామని వెల్లడి
నాగర్ కర్నూల్/కొల్లాపూర్/ ఎల్లారెడ్డి, వెలుగు: తెలంగాణ కోసం కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరం లిఫ్ట్ ప్రాజెక్ట్‌కు అనుమతులు ఇస్తే.. సీఎం కేసీఆర్ అతి తెలివితో దాన్ని సర్వనాశనం చేశాడని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విమర్శించారు. ప్రాంతీయ పార్టీల కుటుంబ పాలన వల్ల రాష్ట్రాల్లో అవినీతి, అక్రమాలు, దోపిడీ తప్ప అభివృద్ధి జరగదన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో సోమవారం నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయారని, మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ తన కొడుకు, కూతురుకే పెద్దపీట వేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారన్నారు. తను కేంద్ర జల వనరుల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులిస్తే, కేసీఆర్ సర్కార్ అవినీతితో ప్రాజెక్టుకు తీవ్ర నష్టం జరిగి ప్రజాధనం వృథా అవుతున్నదన్నారు.
రాష్ట్రంలో రోడ్లన్ని నేషనల్ హైవేలుగా..
రాష్ట్రంలో అన్ని ప్రధాన రోడ్లు నేషనల్హైవేలుగా మారుతాయని గడ్కరీ అన్నారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి మెదక్–-ఎల్లారెడ్డి–-బాన్సువాడ–-రుద్రూర్ జాతీయ రహదారి పనులు ప్రారంభ మయ్యాయన్నారు. 2018లో ఎన్నికల ప్రచారానికి కొల్లాపూర్‌కు వచ్చినప్పుడు తాను ఇచ్చిన హామీకి కట్టుబడి రూ.2500 కోట్లతో కల్వకుర్తి–నంద్యాల 167 హైవే మంజూరు చేసినట్టు గుర్తు చేశారు.
దీంతో హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లేందుకు 80 కిలోమీటర్ల దూరం తగ్గుతుందన్నారు. కృష్ణానదిపై దేశంలో మొదటి ఐకానిక్ సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మిస్తున్నామని తెలిపారు. జోగులాంబ నుంచి దేవరకొండ వరకు హైవే, వెల్గటూరు-–గొందిమల్ల బ్రిడ్జి నిర్మాణం, ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు అంశాలను పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.