ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఇండియాకు ఉచిత కరెంట్ ఓ కొత్త నాటకం
రాష్ట్రానికే దిక్కులేదు.. దేశానికి ఎలా ఇస్తడో..?
సీఎం కేసీఆర్‌‌‌‌ ప్రకటనపై బీజీపీ కౌంటర్‌‌‌‌

నిజామాబాద్, వెలుగు: కేసీఆర్‌‌‌‌ ఉచిత కరెంట్‌కు రాష్ట్రంలో అతిగతీ లేదని.. ఇక దేశంలో ఎలా ఇస్తాడో చెప్పాలని బీజేపీ జిల్లా శాఖ ప్రశ్నించింది. మంగళవారం బీజేపీ జిల్లా ఆఫీస్‌‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌‌మీట్‌‌లో జిల్లా ప్రెసిడెంట్ బస్వా లక్ష్మీనర్సయ్య, రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్‌‌పాల్‌‌ సూర్యనారాయణ పాల్గొని మాట్లాడారు. కేసీఆర్‌‌‌‌ అబద్ధాలకు అంతులేకుండా పోతుందన్నారు. అప్పట్లో ఎలక్షన్ల ముందు ఫెడరల్ ఫ్రంట్‌‌, జాతీయ పార్టీ, దేశ్ కి నేత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అని తిరిగిడాని దేశంలో ఏ ఒక్క రాజకీయ పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పడు మళ్లీ దేశ రాజకీయాల్లోకి పోతున్నానని కొత్త రాగం ఎత్తుకున్నాడని ఎద్దేవా చేశారు. రైతులు ఎదురుచూస్తున్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై సీఎం ఒక్క మాట మాట్లాడలేదన్నారు.

తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం వారిని పరామర్శించ లేదని, కానీ ఎక్కడో పంజాబ్‌‌లో ఉన్న రైతులకు మాత్రం పరిహారం ఇచ్చారన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులపాలు చేశాడని ఆరోపించారు. కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి తెచ్చాడని మండిపడ్డారు. సీతమ్మ తల్లిని అవమానించిన ఎంఐఎం నాయకులతో కలిసి రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నదెవవరో ప్రజలు గ్రహిస్తున్నారన్నారు. కేసీఆర్‌‌‌‌ను తెలంగాణ నుంచి తరిమికొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎన్.రాజు, పోతన్‌‌కర్‌‌‌‌ లక్ష్మీనారాయణ, బీజేజేవైఎం జిల్లా ప్రెసిడెంట్ సందగిరి రాజశేఖర్‌‌‌‌రెడ్డి, బీజేపీ నేతలు నాగోల్ల లక్ష్మీనారాయణ, బద్దం కిషన్, భారత్ భూషణ్, బుర్గుల వినోద్, ఇప్పాకాయల కిషోర్, ఖైజర్ చావుస్, పుట్ట విరేందర్, గడ్డం రాజు, రోషన్, అమంద్ విజయ్, చిరంజీవి పాల్గొన్నారు.

అర్బన్ అభివృద్ధిపై చర్చకు సిద్దమా

ఇందూరు అర్బన్‌‌లో అభివృద్ధి పై బహిరంగ చర్చకు ఎమ్మెల్యే గణేశ్‌‌గుప్తా సిద్ధమా అని బీజేపీ నేత ధన్‌‌పాల్‌‌ సూర్యనారాయణ ఓ ప్రకటనలో సవాల్ చేశారు. నిజామాబాద్​ సిటీ అభివృద్ధి చెందిందని సీఎం కేసీఆర్‌‌‌‌ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గాలి మోటర్‌‌‌‌లో వచ్చి గాలి మాటలు మాట్లాడడం కాదని, గల్లీల్లో పర్యటించి చూడాలని డిమాండ్ చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు  ఇప్పటికీ పూర్తి కాలేదన్నారు. మిషన్ భగీరథ పనులు సైతం అసంపూర్తిగాను ఉన్నాయన్నారు. నగరానికి రూ.100 కోట్లు ఇస్తామని ప్రకటించినప్పటికీ గతంలో ఇలాంటి హామీలకే నిధులు మంజూరు కాలేదని, ఇప్పుడు చెప్పిన 100 కోట్ల కథ కూడా కంచికి చేరుతుందని ఎద్దేవా చేశారు.


టీయూకు రూ.200 కోట్ల  హమీ ఏమాయే?

డిచ్‌‌పల్లి, వెలుగు: తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధి రూ.200 కోట్లు కేటాయిస్తానని గతంలో సీఎం కేసీఆర్​ ఇచ్చిన హమీ అమలయ్యేది ఎప్పుడని ఎస్ఎఫ్ఐ వర్సిటీ ప్రెసిడెంట్ షిండే లత ప్రశ్నించారు. జిల్లాకు వచ్చిన సీఎంకు టీయూ సమస్యలు తెలిపేందుకు శాంతియుత నిరసన చేపట్టిన ఎస్ఎఫ్ఐ లీడర్లపై అక్రమ కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. అక్రమ కేసులను నిరసిస్తూ మంగళవారం టీయూలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెబుతూనే స్టూడెంట్లను బుతులు తిడుతూ కొట్టారని పేర్కొన్నారు. స్టూడెంట్ లీడర్లు విఘ్నేశ్‌‌, మహేశ్‌‌, నాగరాజు, జవార్ సింగ్‌‌పై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. 

విలువలతో కూడిన విద్య అందించాలి

కామారెడ్డి, వెలుగు: స్టూడెంట్లకు విలువలతో కూడిన విద్య అందించినప్పుడే ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేసిన వారవుతారని కామారెడ్డి జడ్పీ చైర్‌‌‌‌పర్సన్‌‌ దఫేదర్ శోభ అన్నారు. జిల్లాలో ఉత్తమ టీచర్లుగా ఎంపిక చేసిన 50 మందిని మంగళవారం కలెక్టరేట్‌‌లో సన్మానించారు. చీఫ్‌‌ గెస్ట్‌‌గా హాజరైన శోభ మాట్లాడుతూ స్టూడెంట్లను సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత టీచర్లపై ఉందన్నారు.  కలెక్టర్ జితేష్ విపాటిల్, అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్​దొత్రే,  అసిస్టెంట్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డీఈవో రాజు, కో ఆర్డినేటర్లు లింగం, గంగాకిషన్, వేణు శర్మ పాల్గొన్నారు. కామారెడ్డి రోటరీ క్లబ్, ఆర్యవైశ్య సంఘం, లయన్స్​క్లబ్‌‌ ఆధ్వర్యంలో కూడా టీచర్లను సన్మానించారు. 

కష్టపడితే ఏదైనా సాధించవచ్చు
ట్రైనీ ఐఏఎస్ బాలలత

బోధన్, వెలుగు: కష్టపడే తత్వం ఉంటే ఏదైన సాధించవచ్చునని ట్రైనీ ఐఏఎస్​ మల్లవరపు బాలలత అన్నారు. మంగళవారం బోధన్​ టౌన్‌‌లోని విజయసాయి స్కూల్‌‌లో విద్యార్థులకు సివిల్ కోచింగ్‌‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బాలలత మాట్లడుతూ తనకు తల్లిదండ్రులే గురువులని, వారు ఏ విధంగా తనను కష్టపడి చదివించారో.. సమాజంలో ఏ విధంగా గుర్తింపు తెచ్చారో  వివరించారు. స్టూడెంట్లు లక్ష్యంతో చదవాలని సూచించారు. లక్ష్యాన్ని సాధించాలంటే ఓపిక, సహనం, క్రమశిక్షణ, కష్టపడే తత్వం ఉండాలన్నారు. కార్యక్రమంలో విజయసాయి హైస్కూల్​ ప్రిన్సిపాల్ ఎస్.కృష్ణమోహన్, మేనేజర్ చక్రవర్తి, స్కూల్ ఇన్‌‌చార్జి సువర్చల, టీచర్లు, స్టూడెంట్లు పాల్గొన్నారు.   


విద్యార్థి నాయకులపై లాఠీచార్జి అమానుషం

ఆర్మూర్, వెలుగు : తెలంగాణ యూనివర్సిటీని సీఎం కేసీఆర్ పర్యవేక్షించాలని, అభివృద్ధికి రూ.200 కోట్లు మంజూరు చేయాలని డిమాండ్‌‌ చేస్తూ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన విద్యార్థి నాయకులపై పోలీసులు లాఠీచార్జి చేయడం అమానుషమని పీడీఎస్‌‌యూ ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు నరేందర్ అన్నారు. లాఠీచార్జ్‌‌ని ఖండిస్తూ మంగళవారం ఆర్మూర్‌‌‌‌లో పీడీఎస్‌‌యూ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన తెలిపి సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ సమాజానికి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని, లాఠీచార్జి చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పీడీఎస్‌‌యూ డివిజన్ కోశాధికారి అనిల్ కుమార్, ఏరియా ప్రధాన కార్యదర్శి నిఖిల్, కన్వీనింగ్ కమిటీ కన్వీనర్ దేవిక, ఏరియా కోశాధికారి వినోద్, మనోజ్, దీపిక, మమత పాల్గొన్నారు. 

ఓటరు కార్డుతో ఆధార్‌‌‌‌ లింక్‌ చేయాలి

బోధన్, వెలుగు: ఓటరు గుర్తింపు కార్డుతో ప్రతి ఒక్కరూ తమ ఆధార్‌‌‌‌ను లింక్‌ చేసుకోవాలని మోప్మా డైరెక్టర్‌‌  రాములు సుచించారు. మంగళవారం పట్టణంలోని మున్సిపల్ ఆఫీసులో మోప్మా రిసోర్స్ పర్సన్స్, బీఎల్వోలకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సంరద్భంగా మాట్లాడుతూ వారం రోజుల్లో ఈ లింకేజీ ప్రక్రియ పూర్తి చేయలన్నారు.  అలాగే18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఓటర్లు కార్డులో మార్పులు సవరణల కోసం ఫారం 8 నింపాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామలింగం, తహాసీల్దార్ వరప్రసాదర్, ఎలక్షన్ సీనియర్​ అసిస్టెంట్ సుశీల, మోప్మా డీఎంసీ మాధురిలత, టీఎంసీ శ్రీనివాస్, కమ్యూనిటీ ఆర్గనైజర్లు, రిసోర్స్‌‌పర్సన్స్, బీఎల్వోలు పాల్గొన్నారు.   

అక్రమ కేసులు పెట్టడం సరికాదు

భీంగల్, వెలుగు: బీజేజీ కార్యకర్తలపై పీడీ కేసులు బనాయించడం సరికాదని ఆ పార్టీ స్టేట్ ఐటీ సెల్ కన్వీనర్ వెంకటరమణ అన్నారు. మండలంలోని బడా భీంగల్ గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త  కట్ల లింగం సోషల్ మీడియాలో యాక్టివ్‌‌గా ఉంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ పోస్ట్ చేస్తున్నందుకు పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న వెంకటరమణ మంగళవారం స్థానిక లీడర్లతో కలిసి లింగం కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ స్టేట్‌‌ ప్రెసిడెంట్ సంజయ్ ఆదేశాల మేరకు రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. లింగంను బెయిల్ పై తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందని చెప్పారు.  పార్టీ జిల్లా సెక్రటరీ శ్రీనివాస్,  మోహన్, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.

డైట్‌‌ కాలేజీ ప్రిన్సిపాల్‌‌ను సస్పెండ్ చేయండి   

నిజామాబాద్, వెలుగు: డైట్ కాలేజీలో స్టూడెంట్లను వేధిస్తున్న ప్రిన్సిపాల్ టి.శ్రీనివాస్‌‌ను సస్పెండ్ చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని పీడీఎస్‌‌యూ జిల్లా ప్రెసిడెంట్ కల్పన హెచ్చరించారు. జిల్లా కలెక్టరేట్ ఎదుట మంగళవారం  ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డైట్ కాలేజీలో  లెక్చరర్లు, మౌలిక సౌకర్యాలు లేక స్టూడెంట్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇటీవల సౌజన్య అనే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్‌‌ మూడు నెలల ప్రెగ్నెన్సీతో ఉండగా సెలవు అడిగితే ఇవ్వకుండా కావాలంటే వచ్చే సంవత్సరం రీఅడ్మిషన్ చేసుకోవాలని ప్రిన్సిపాల్‌‌ బెదిరించాడని వాపోయారు. మరో మార్గం లేక కాలేజీకి వెళ్లడంతో ఆమె ఆరోగ్యం క్షీణించి అబార్షన్ జరిగిందన్నారు. కాలేజీలో ఇలాంటి ఘటనలు చాలా ఉన్నాయని చెప్పారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రిన్సిపాల్‌‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీడీఎస్‌‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు అషూర్, టీయూ కన్వీనర్ గణేశ్‌‌, జిల్లా నాయకులు వేణు, డైట్ కాలేజీ విద్యార్థులు గణేశ్‌‌, లక్ష్మణ్, మనీషా, సంధ్య, వైష్ణవి, నవీన, రవి, భాస్కర్, కావేరి పాల్గొన్నారు.


కేజీబీవీని తనిఖీ చేసిన డీఈవో 

కోటగిరి, వెలుగు: కోటగిరి మండల కేంద్రంలోని కేజీబీవీ స్కూల్‌‌ను నిజామాబాద్ జిల్లా డీఈవో దుర్గాప్రసాద్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్‌‌లోని రికార్డులు, వంట సామగ్రిని, క్లాస్‌‌ రూంలు, నిల్వ ఉన్న బియ్యాన్ని పరిశీలించారు. అనంతరం స్టూడెంట్లతో మాట్లాడారు. పిల్లలకు అందించే ఫుడ్‌‌, చదువుపై అశ్రద్ధ వహించవద్దని స్టాఫ్‌‌కు సూచించారు. ఎప్పటికప్పుడు విద్యార్థులను గమనించాలని, ప్రతి పూటా పరిశుభ్రమైన భోజనాన్ని అందించాలన్నారు. అలాగే స్కూల్‌‌లో  బాత్రూంలు, వంట, తరగతి గదుల్లో అవసరమైన చిన్న చిన్న రిపేర్లు వెంటనే చేయించాలని తెలిపారు.

ఘనంగా టీయూ వార్షికోత్సవం

డిచ్‌‌పల్లి, వెలుగు: తెలంగాణ యూనివర్సిటీ 16వ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం క్యాంపస్‌‌లో ఘనంగా నిర్వహించారు. వీసీ రవీందర్ గుప్తా, మాజీ ఐఏఎస్ చిరంజీవులు, మహేశ్‌‌ బిగాల, వందేమాతరం శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గెస్ట్‌‌లు, ప్రొఫెసర్స్ స్టూడెంట్లను ఉద్దేశించి స్ఫూర్తివంతమైన ప్రసంగాలు చేశారు. కష్టపడి చదివి భవిష్యత్తును తిర్చిదిద్దుకోవాలని సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు 
ఆకట్టుకున్నాయి. 

16 మంది ఉత్తమ టీచర్లకు సన్మానం

కోటగిరి, వెలుగు: టీచర్స్ డే సందర్భంగా మండలంలోని 16 మంది ఉత్తమ టీచర్లను మంగళవారం ఘనంగా సన్మానించారు. కోటగిరి హైస్కూల్‌‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో స్టూడెంట్లు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో ఎంపీపీ వల్లేపల్లి సునీత, వైస్ ఎంపీపీ గంగాధర్, ఎంఈవో నాగనాథ్, ఇన్‌‌చార్జి ఎంపీడీవో మారుతి, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు సూదం వెంకటేశ్, తపస్ అధ్యక్షుడు కులకర్ణి పురుషోత్తమ్, మండల టీచర్లు పాల్గొన్నారు.